శ్రీ శివ మహా పురాణము - 263


🌹 . శ్రీ శివ మహా పురాణము - 263 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

62. అధ్యాయము - 17

🌻.సతీ వరప్రాప్తి - 2 🌻


చిక్కని కాటుక కాంతి గల సతి స్ఫటికమువలె ప్రకాశించు దేహముగల శివుని సమీపములో చంద్రుని ప్రక్కన మేఘపంక్తి వలె భాసిల్లెను(20).అపుడా దాక్షాయణీ మిక్కిలి ప్రసన్నురాలై భక్త వత్సలుడగు శివునకు చేతులు జోడించి అనేక నమస్కారములను చేసి, ఆయనతో నిట్లనెను (21).

సతి ఇట్లు పలికెను -

దేవదేవా! మహాదేవ! ప్రభూ! జగత్పాలకా! నా తండ్రికి తెలుపుడు జేసి నన్ను యథావిధిగా వివాహమాడి స్వీకరించుము (22).

బ్రహ్మ ఇట్లు పలికెను -

భక్త వత్సలుడగు మహేశ్వరుడు సతీ దేవి యొక్క ఈ మాటను విని, ఆమెను ప్రేమతో చూచి 'అటులనే అగుగాక!'అని పలికెను (23). దాక్షాయణి కూడా శంభునకు నమస్కరించి భక్తితో విన్నవించి ఆజ్ఞను పొంది ప్రేమతో ఆనందముతో నిండిన మనస్సుగలదై తల్లి వద్దకు వెళ్లెను (24).

శివుడు కూడా హిమవత్పర్వత మైదానములోని తన ఆశ్రమములో ప్రవేశించి, దాక్షాయణి వియోగముచే అతి కష్టముతో ధ్యానమును చేయ మొదలిడెను (25). వృషభధ్వజుడగు శంభుడు మనస్సును నియంత్రించుకొనెను. ఓ దేవర్షీ! ఆయన లౌకిక ప్రవృత్తి నాశ్రయించి, మనస్సులో నన్ను తలంచెను (26).

త్రిశూలి, మహేశ్వరుడు నగు హరుడు నన్ను స్మరించగా ఆయన యొక్క సిద్ధిచే ప్రేరితుడనై నేను ఆయన ముందు వెంటనే నిలబడితిని (27). వత్సా! శివుడు సతీవియోగముతో హిమవత్పర్వతముయొక్క మైదానములో ఉండెను. నేను సరస్వతితో గూడి అచటకు చేరుకుంటిని (28). ఓ దేవర్షీ! సతీదేవి యందు దృఢమైన ప్రేమగల ఆ శంభు ప్రభుడు ఉత్కంఠతో గూడి యుండెను సరస్వతితో గూడి వచ్చిన నన్ను చూచి ఆయన ఇట్లు పలికెను (29).

శంభుడు ఇట్లు పలికెను -

హే బ్రహ్మన్‌! నేను వివాహము చేసుకొనగోరి స్వార్ధ పరుడనైనాను. ఇప్పుడు నాకు స్వార్థచించనయే నా స్వభావమన్నట్లు తోచుచున్నది (30). దక్షుని కుమార్తె యగు సతి నన్ను భక్తితో ఆరాధించెను. ఆమె చేసిన నందా వ్రతము యొక్క ప్రభావముచే ఆమెకు నేను వరమునిచ్చితిని (31).

హే బ్రహ్మన్‌! 'నాకు భర్తవు కమ్ము' అని ఆమె వరమును నానుండి కోరెను. నేను ఎంతయూ సంతసించి యుంటిని. 'నా భర్యవు కమ్ము' అని అంటిని (32). అపుడు దక్షపుత్రియగు ఆ సతీ దేవి నాతో నిట్లనెను. హే జగత్ర్పభో! నా తండ్రికి నివేదించి నన్ను స్వీకరించుము (33).

హే బ్రహ్మన్‌! ఆమె భక్తిచే సంతసిల్లిన నేను దానికి కూడా అంగీకరించితిని. ఓ బ్రహ్మా! ఆమె తన భవనమునకు తల్లి వద్దకు వెళ్లెను. నేనిచటకు వచ్చితిని (34). కావున నీవు నా ఆజ్ఞచే దక్షుని గృహమునకు వెళ్లుము. దక్షుడు నాకు ఆ కన్యను వివాహములో శీఘ్రముగా ఇచ్చు తీరున దక్షునకు నచ్చ జెప్పుము (35). నాకు ఈ సతీవియోగము నుండి విముక్తి కలుగు ఉపాయము ననుష్ఠింపుము. నీవు అన్ని విద్యల యందు దిట్టవు. ఆ దక్షని ఒప్పించుము (36).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


03 Nov 2020

No comments:

Post a Comment