గీతోపనిషత్తు - 66

🌹. గీతోపనిషత్తు - 66 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍀 4. పరిణామము -మృత్యువును దాటుటకు అనంతుడైన ఆదిశేషువు యోగవిద్య నందించెను. భగవంతుని ఆదేశము కూడ అందరును యోగులు కావలెననియె. కలియుగమున అజ్ఞానవశమై ఇతర మతము లేర్పడి, జీవునకు పునర్జన్మలు లేవని, ఒకే జన్మమని ప్రచారమున్నది. ఇది అజ్ఞానము. 🍀

📚. 4. జ్ఞానయోగము - 4 📚


బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున |
తా న్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప || 5


సృష్టియందు జీవులకు పునర్జన్మ లుండునని, కొందరు వాటి నెరుగుదురని, కొందరెరుగరని ఒక సత్యమును భగవానుడు ప్రతిపాదించినాడు. తనకును, అర్జునునకు అనేక జన్మలు గడచినవని, తానన్నిటిని ఎరుగుదునని, అర్జునుడెరుగడని తెలుపుటలో పై సత్య మున్నది. జన్మలు గడచుచున్నను తానెవరో తెలిసియున్నవారు యోగులు, ఋషులు, సిద్ధులు.

తెలియని వారు అజ్ఞానులు. అజ్ఞానులు మృత్యువుతో సమస్తమును మరతురు. యోగులు మృత్యువును దాటుట తెలిసినవారు. కనుక వారికన్ని జన్మలును జ్ఞప్తి యందుండును. వీరినే చిరంజీవులని కూడ అందురు.

మృత్యువును దాటుటకు అనంతుడైన ఆదిశేషువు యోగవిద్య నందించెను. భగవంతుని ఆదేశము కూడ అందరును యోగులు కావలెననియె. కలియుగమున అజ్ఞానవశమై ఇతర మతము లేర్పడి, జీవునకు పునర్జన్మలు లేవని, ఒకే జన్మమని ప్రచారమున్నది. ఇది అజ్ఞానము.

జీవుని స్వభావములో దైవీ ప్రకృతి ఏర్పడుటకు పరిణామ మార్గమొకటి కలదు. ఈ పరిణామ మార్గమున జీవులు పాశవిక ప్రవృత్తి నుండి మానవతా ప్రవృత్తిలోనికి పెరుగుదురు. అటు పైన దైవీ ప్రవృత్తిలోనికి పెరుగు సందర్భమున యోగవిద్యా ప్రవేశము కలుగును. యోగ విద్యయందు పరిపూర్ణత చెంది జీవుడు మృత్యువును దాటి అమరుడై భూమి మీద యుండును.

అట్టి జీవుని భూసురులందురు. అట్టివారు బ్రహ్మోపాసన చేయుచు బ్రహ్మమును పొందుదురు. అనగా బ్రహ్మమే వారి రూపమున వుండును. వీరినే బ్రహ్మర్షులందురు. వీరు జీవులకు తరణోపాయము చూపించుచు సద్గురు పరంపరగ నేర్పడి యున్నారు.

వశిష్ఠ అగస్త్యులట్టి వారు. శ్రీకృష్ణుడు అట్టి యోగీశ్వరుల గమ్యము. అతనికి సృష్ట్యాది నుండి జరుగుచున్న జీవుల కథ తెలిసియున్నది. అతడికి అర్జునుని యొక్క పూర్వజన్మలు తెలియుటలో ఆశ్చర్యము లేదు. సద్గురువులకు కూడ జీవుల పూర్వజన్మల అవగాహన యుండును. వాని ననుసరించియే వారు జీవులకు హితము కలిగించు చుందురు. ఇది యొక సత్యము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


03 Nov 2020

No comments:

Post a Comment