🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 92 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము -22 🌻
దైవీహ్యేషా గుణమయాయి మమ మాయా దురత్యయా |
మామేవ యే ప్రపద్యన్తే మాయామేతాం తరన్తి తే ||
బాబూ! నీలో ఉన్నటువంటి ఇంద్రియాలను పరిగెత్తిస్తున్నటువంటి, త్రిగుణాత్మకమైనటువంటి, ప్రకృతి సంబంధమైన మాయ అతిక్రమింప రానిది. అని ఒక పక్క చెబుతూనే ఏమంటున్నాడు? నేను ప్రకృతికి అతీతుడను. పరమాత్మ ప్రకృతికి అతీతుడు. మాయకు అతీతుడు. మోహానికి అతీతడు. మోక్ష స్వరూపుడు.
కాబట్టి నువ్వు పరమాత్మని గనుక పట్టుకున్నట్లయితే “మాం అను స్మరణ్” - నేనే కదా అనేక చోట్ల వస్తుంది. ‘మమ ఆశ్రయ’ - నన్నే పట్టుకో! ఆ పరమాత్మనే గనుక నీవు భక్తితో ఆశ్రయించినట్లయితే, విశ్వాసంతో ఆశ్రయించినట్లయితే, ఆత్మబలంతో గనుక నీవు ఆశ్రయించినట్లయితే, ధైర్యంతో ఆశ్రయించినట్లయితే, స్థైర్యంతో ఆశ్రయించినట్లయితే, వివేకంతో ఆశ్రయించినట్లయితే, విజ్ఞానంతో ఆశ్రయించినట్లయితే నీవు ఆ మాయ నుంచి ముక్తుడవు అయ్యేటువంటి అవకాశం లభిస్తుంది. జనన మరణ రాహిత్యం లభించేటువంటి అవకాశం లభిస్తుంది ఈ జన్మలోనే!
బహునాం జన్మనామంతే జానవాన్మాం ప్రపద్యతే |
వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః ||
ఉన్నదంతా వాసుదేవ వ్యూహమే! ఉన్నదంతా వాసుదేవ స్వరూపమే! అనేటటువంటి బుద్ధి ఎప్పటికో గానీ కలగడం లేదు. నిశ్చలమైనటువంటి బుద్ధిలో మాత్రమే అటువంటి లక్షణం కలుగుతుంది. నీవున్నావు, నేనున్నాను అందరూ ఉన్నారు. అనేకత్వంగా ఉంది. జగత్తు అంతా అనేకంగా ఉంది. ఈ అనేకత్వం అంతా నేను భోగ్యంగా అనుభవించవచ్చు. అనేటటువంటి భోగి, భోగ్య లక్షణం మనలో బలంగా ఉన్నంత సేపు ఆ జగత్ భావన, జీవభావన బలంగా ఉంటుంది.
గుణధర్మం బలంగా ఉంటుంది. చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే, ఏమీ చేయకుండా ఉంటే ఇవన్నీ సాధ్యమౌతాయండి. ఏమైనా చేస్తూ ఉంటే, ఇవేమీ సాధ్యం కావండీ! చేస్తూ ఇలా ఉండడం కుదరదు. విరమించేసి, ఏ పని చేయకుండా ఓ మూల ముక్కు మూసుకుని, జపం చేసుకుంటూ, తపం చేసుకుంటూ కూర్చుంటే మాత్రమే సాధ్యం అనుకుంటారు అన్నమాట. అది ఎట్లా సాధ్యమో, అసాధ్యమో క్రింద వివరిస్తున్నారు.
స్థూలములైన ఇంద్రియముల నుండి సూక్ష్మాతి సూక్ష్మమైన పరమాత్మను తెలుసుకొను విధానము చెప్పబడుచున్నది. ఇంద్రియములు గోళకములకన్నా సూక్ష్మమైనవి. నేత్రము అనగానే మనకు కనిపించునది స్థూలమైన గోళకము. నేత్రేంద్రియము, నేత్ర గోళమునకు అంతరంగముగా, సూక్ష్మముగా ఉన్నది.
అటులనే ఇంద్రియముల కన్న వానికి కారణమగు శబ్దాది తన్మాత్రలు సూక్ష్మం. శబ్దాది తన్మాత్రల కన్న మనస్సు సూక్ష్మం. మనసు కన్న బుద్ధి, బుద్ధి కన్న మహత్ తత్వం సూక్ష్మం. మహత్ తత్త్వం కన్న అవ్యక్తం సూక్ష్మం. అవ్యక్తం కన్న పురుషుడు [పరమాత్మ] సూక్ష్మం. పురుషుని కంటే సూక్ష్మమైనది మరియొకటి లేదు. అదియే అంతిమము. అదియే పరమావధి.
ఈ రకంగా స్థూలపరిధి నుండి, బుద్ధిని సూక్ష్మం దిశగా నడపాలి. ఈ రకమైనటువంటి విచారణ చేయాలి. ఈ రకమైన గుర్తింపు రావాలి. ఈ రకమైనటువంటి భావనా బలం రావాలి. ఈ రకమైనటువంటి వివేకం రావాలి. ఈ రకమైనటువంటి విజ్ఞానం రావాలి. ఇది రోజువారీ జీవితంలో ప్రతీ ఒక్కరూ విచారణ ద్వారా పొందవలసినటువంటి సత్యము. దీనికి వేరే మార్గం లేదు. ఏమిటట అది? అంటే,
“నవ రంధ్ర కాయమన్నా... నిన్ను నట్టేట ముంచునోరన్నా” - విద్యా సాగర్ స్వామి
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
Facebook, WhatsApp & Telegram groups, WordPress:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
03 Nov 2020
No comments:
Post a Comment