గీతోపనిషత్తు -107


🌹. గీతోపనిషత్తు -107 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


శ్లోకము 39 - 2

🍀 34 - 2. తదేక నిష్ఠ :


భగవంతుడు 'తత్పరః' అను పదమును వాడినాడు. తత్పరత్వము కలుగవలెనన్నచో చేయు పనియందాసక్తి మిన్నగ యుండవలెను. ఆసక్తి యున్నచోటే శ్రద్ధ, తత్పరత్వము యుండును. ఆసక్తికి శ్రద్ధ, తత్పరత జోడించినచో కార్యసిద్ధి తథ్యము. ఈ రెండు గుణముల గలవాడు అంతఃకరణముల యందు అఖండుడై నిలచును. అతని స్వభావము, మనసు, బుద్ధి, అహంకారము ఒకటిగ నిలచి కార్యములు నిర్వర్తించును గనుక సిద్ధి కలుగును. 🍀

భగవంతుడు 'తత్పరః' అను పదమును వాడినాడు. తత్పరత్వము కలుగవలెనన్నచో చేయు పనియందాసక్తి మిన్నగ యుండవలెను. ఆసక్తి యున్నచోటే శ్రద్ధ, తత్పరత్వము యుండును.

ఆసక్తి కలుగుట, కలుగకపోవుట స్వభావము పై ఆధారపడి యుండును. స్వభావమున కనుగుణమైన పని స్వధర్మమగును. అందువలన స్వధర్మము నాచరించువారికి సహజముగ కొంత ఆసక్తి యుండును. ఆ ఆసక్తికి శ్రద్ధ, తత్పరత జోడించినచో కార్యసిద్ధి తథ్యము. ఈ రెండు గుణముల గలవాడు అంతఃకరణముల యందు అఖండుడై నిలచును.

అనగ అతని స్వభావము, మనసు, బుద్ధి, అహంకారము ఒకటిగ నిలచి కార్యములు నిర్వర్తించును గనుక సిద్ధి కలుగును. బుద్ధిని దైవముపై లగ్నము చేయుచుండగ, చిత్తము చెప్పు పైకి ప్రసరించుట సర్వసామాన్యము. అట్టివారు ఖండ ప్రజ్ఞ గలవారై, కార్యములందు విఫలు లగుచుందురు.

అంతఃకరణ ప్రజ్ఞ అఖండమై, కార్యములందు ప్రయోగించి నపుడు సర్వసామాన్యముగ కార్యసిద్ధి కలుగును. అట్టివారు జ్ఞానము పై మనసు నిడినపుడు చిత్తము, మనసు, బుద్ధి, తాను (అహంకారము) జ్ఞానము నుపాసించుటచే జ్ఞాను లగుదురు. కర్మల నుపాసించునపుడు కూడ శాంతిగ నుందురు.

పనులు చేయుచుండుట వలన వారికి శాంతి కరవు కాదు. పనులు చేయుచు కూడ పరమశాంతితో నుందురు. విస్తారమగు కార్యములు నిర్వర్తించుచు, ప్రశాంతముగ ఏమియు చేయని వారివలె గోచరించు వారు శ్రద్ధాళువులు, తత్పరులు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


24 Dec 2020

No comments:

Post a Comment