కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 141


🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 141 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. ఆత్మను తెలుసుకొను విధము - 71 🌻


బ్రహ్మణోరవ్యక్తః అవ్యక్తాన్‌ మహత్‌

మహదోర్‌ మహదహంకారః - అన్నప్పుడు కూటస్థుడుగా వ్యక్తం అయ్యింది.

అలాగే మహదహంకారముగా జ్ఞాతగా వ్యక్తం అయ్యింది. కాబట్టి, బ్రహ్మాండ ప్రతిబింబం అంతా పిండాండం. బింబమేమో బ్రహ్మాండం. ప్రతిబింబమేమో పిండాండం.

ఈ రెండిటి యందు రెండు అహములున్నవి. ఒకటి జ్ఞాత, రెండు కూటస్థుడు. ఈ రెండు అహములు కలిస్తే అఖండంబైన ఎఱుక. కూటస్థుడు అనేది అఖండ ఎఱుక. ఈ రకంగా ఖండ, ఖండాలుగా ఐదైదులు ఇరవై అయిదుగా తోస్తున్నప్పటికీ వాస్తవానికి ఇదంతా ఒక్కటిగానే ఉన్నది.

ఈ పిండ బ్రహ్మాండములు ఒక్కటే. ఈ రకమైనటువంటి సాంఖ్యవిచారణ క్రమం ద్వారా ఏ మహతత్వ నిరూపణ అయితే అవుతోందో, ఏ అవ్యక్త నిరూపణ అయితే అవుతోందో, ఏ బ్రహ్మమైతే నిర్ణయించబడుతున్నాడో,

బ్రహ్మణోరవ్యక్తః అవ్యక్తాన్‌ మహత్‌ - అనేటటువంటి సూత్రాన్ని ఆశ్రయించి, సదా ఎల్లకాలము జనన మరణ చక్రములకు లోను కాకుండా, కాలత్రయమునకు లోను కాకుండా, అవస్థాత్రయమునకు లోను కాకుండా, శరీర త్రయానికి లోనుకాకుండా, దేహత్రయానికి లోనుకాకుండా ఏ రీతిగా అయితే బ్రహ్మము నిలబడి ఉన్నదో, అట్టి బ్రహ్మము నేను.

అట్టి పరమాత్మను నేను. అట్టి పరబ్రహ్మనిర్ణయాన్ని నేను. అనేటటువంటి పద్ధతిగా తన బుద్ధి గుహయందు, తన హృదయాకాశము నందు, ఇట్టి నిర్ణయాన్ని ఎవరైతే పొంది, ఆ నిర్ణయముతో స్థిరముగా ఉన్నారో, వారే ముక్తులు.

ఈ రకంగా ముక్తిని సాంఖ్య తారక అమనస్క విధిగా సాధించాలి అనేటటువంటి సూచనని తెలియజేస్తున్నారు. కాబట్టి, మానవులందరూ హిరణ్య గర్భస్థితిని తప్పక తెలుసుకోవాలి. వ్యష్టి ప్రాణులంతా కూడా ఈ ఆది దైవతం ఆధీనంలో ఉండడం చేత, వీళ్ళందరూ కూడా, అప్పటికి చివరికి వారి యందు చేరి పోతూఉంటారు.

ఇట్లా బుద్ధి గుహయందు పరమాత్మను ధ్యానాదులతో తెలుసుకొనుము. ధ్యానం చేయడం ద్వారా, నిరంతరాయంగా చేయడం ద్వారా, సహజ సమాధి నిష్ఠులవ్వడం ద్వారా, సహజ ధ్యాన పద్ధతిగా, మానవుడు ఈ స్థితిని సాధించాలి. ఈ స్థితి యందు నిలకడ చెందాలి.

ఇట్లా ఎవరైతే హిరణ్య గర్భుడిని తెలుసుకోగలుగుతున్నారో, ఎవరైతే ఈ ఆరవ కోశాన్ని బాగుగా ఎరుగ గలుగుతున్నారో, ఎవరైతే షడూర్మి రహితంగా ఉంటున్నారో, ఎవరైతే షడ్వికార రహితంగా ఉంటున్నారో, ఎవరైతే వాసనాత్రయం లేకుండా ఉంటున్నారో, ఎవరైతే నిర్వాసనామౌనాన్ని ఆశ్రయించి ఉన్నారో, ఎవరైతే ఈశ్వరీయ మౌనస్థితిలోనికి చేరారో, ఎవరైతే కాలత్రయము చేత బాధింప బడక యున్నారో, ఎవరైతే కర్మత్రయం అనేటటువంటి బంధం లేకుండా ఉన్నారో, ఎవరైతే కర్మఫల ప్రదాతగా ఉన్నారో, అట్టి ఈశ్వరీయమైనటువంటి స్థితిని, సాధుకులందరు తప్పక సాధించాలి.

ఈ రకమైనటువంటి, విశేషమైనటువంటి ఆత్మ విచారణని మానవులు ప్రతి నిత్యమూ, అనుక్షణమూ ఆశ్రయించి, తనను తాను విరమింప చేసుకుని, పృథ్విలో పృథ్వి దగ్గర నుంచి, ఆకాశంలో ఆకాశం అనేటటువంటి ఆధార స్థానం వరకూ, ఆధార ఆధేయ విమర్శ పద్ధతిగా, జడచేతన విమర్శ పద్ధతిగా, అధిష్ఠాన ఆశ్రయ పద్ధతిగా దీనిని చక్కగా విచారణ చేసి, నేను జ్ఞాతను, నేను కూటస్థుడను, అనే నిర్ణయాన్ని పొందవలసినటువంటి అవసరము తప్పక ఉన్నది.

ఈ రకంగా ఇంద్రియాల దగ్గర నుంచి, గోళకముల నుంచి ఇంద్రియాలకు, ఇంద్రియాల నుంచి పంచ భూత తన్మాత్రల యొక్క అధిష్టములైన జ్ఞానమునకు, అక్కడి నుంచి మనసుకి, మనసు నుంచి బుద్ధికి, బుద్ధి నుంచి మహతత్త్వానికి, మహతత్వం నుంచి అవ్యక్తానికి, అవ్యక్తం నుంచి ప్రత్యగాత్మకు, ఆ తదుపరి ప్రత్యక్‌ పరమాత్మలు అభిన్నులు అనేటటువంటి, అభేదత్వానికి మానవుడు సాధన ద్వారా ప్రయాణం చేయవలసి ఉంటుంది.

ఇట్లా ఎవరైతే ప్రయాణం పూర్తి చేశారో, ఎవరైతే ఈ చిట్టచివరి స్థితికి చేరుకున్నారో, వారే దేశికేంద్రులు. వారే ముక్తులు. వారే జన్మరాహిత్యాన్ని పొందినటువంటి వారు. వారే మోక్షమును అధివసించినటువంటి వారు.

ప్రశ్న: గురువు గారు ఇక్కడ మీరు ఈశ్వర దర్శనం గురించి చెప్పారు కదా! ఈశ్వర సాకార దర్శనం అవుతుంది అని చెప్పారు. అయితే ఇప్పుడు ప్రతి రూపాన్ని వెనుక ఒక భగవద్ శక్తే నడిపిస్తుంది అన్న భావన ఉంది. నిరాకారంతో ఇది వున్న వాళ్ళకి ఆ దర్శనం ఏ విధముగా వుంటుంది అన్నది ఏమన్నా చెబుతారా?

సమాధానం: స్వప్రకాశ దర్శనంగా వుంటుంది. - విద్యా సాగర్ గారు

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


24 Dec 2020

No comments:

Post a Comment