భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 192


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 192 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. దధీచిమహర్షి-సువర్చల - 1 🌻

జ్ఞానం:


1. దేవతలు పుణ్యమూర్తులేకాని, వారిని మించిపోయినటువంటి స్థితి మనుష్యులకు వస్తే, “వీళ్ళు మమ్మల్ని ఆశ్రయించవలసిన వాళ్ళే కదా!” అనే భావన ఒకటి దేవతలకు ఉంటుందని అన్ని పురాణాలలోనూ మనకు తెలుస్తుంది. ఆ కారణంచేత ఆ తపస్సును భంగంచేసి వాళ్ళు అంత ఎత్తుకు ఎద్గకుండా చూడాలని దేవతలకు అనిపిస్తూ ఉంటుంది. అందుకే అనేకమంది తపస్సులు భంగంచేస్తారు వాళ్ళు.

2. నదియందు ఒక వ్యక్తిత్వం భావించటం ఆర్యసంప్రదాయంలో ఎప్పుడూ ఉన్నది. ఎందుచేతనంటే ఈ దేవతల దివ్యశక్తులు పంచభూతములలోనూ ఉన్నాయి. ఆ శక్తులన్నిటికీకూడా-ఆ భూతములందుండే విశేషములైన వేరువేరు లక్షణములేవైతే ఉన్నాయో, వాటిని భాసింపచేస్తూ ఈశ్వరాజ్ఞగా ఆ కార్యాన్ని నెరవేరుస్తూ; ఆ నిర్వహణలో ఒక వ్యక్తిత్వము, అహంకారము ఎప్పుడయితే వచ్చిందో – ఆ దేవతలు ఇతర జీవులతో ఏవో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండి-కోపమో, ప్రేమో-వాటియందు(ఆ దేవతాశక్తులవలన ఆ భూతములయందు) అలా పుట్టటం జరుగుతుందని పురాణం చెబుతుంది. దాన్ని మన పెద్దలు అలా గుర్తించారు.

3. దివ్యశక్తులను దేవతలుగా గుర్తించారు. అందుకనే వారికి అంత విలువ ఉంది. ఉదాహరణకు నది ఉన్నది. పర్వతం ఉన్నది. వాటికి ఒక వ్యక్తిత్వం ఉన్నది, భూదేవికొక వ్యక్తిత్వం, వృక్షానికొక వ్యక్తిత్వం ఉన్నయి. మంత్రములతో వాటిని వ్యక్తులవలే భావించి మంత్రమూలకంగా వాటిని ఆరాధించటము, వరాలు అడిగి తీసుకోవటము మన హిందువులకు తెలిసిన విషయమే! అంటే మనుష్యులు మాత్రమే జీవులు కాదు.

4. ఈ పంచ భూతములలోపల ప్రవేశించినటువంటి దివ్యశక్తులు-అవికూడా వ్యక్తిత్వంతో ఉన్నాయి. వాటికి నిగ్రహానుగ్రహ సామర్థ్యం ఉంటుంది. మనుష్యులు వాటిని ఆరాధించాలి. ఈ సంభంధం మొదటినుండీ ఆర్యుల దృషిలో వాళ్ళకు ముఖస్థంగా కంటికి కనబడి, ప్రత్యక్షంగా వాళ్ళకు అనుభూతమైన విషయమిది.

5. ఆర్యసంస్కృతిలో విదేశీయులకు అర్థంకాని విషయం ఇది. ‘మీరంతా రాళ్ళురప్పలు, చెట్లుచేమలు, పుట్టలకు పూజచేస్తుంటారు” అని అంటారు విదేశీయులు. దానియందు ఒకానొక తేజస్సుంది. దానియందు వ్యక్తిత్వం ఉంది. నదికి, పర్వతానికి అలా వాటివాటి వ్యక్తిత్వాలు వాటికిఉన్నాయి.

6. ఈ విషయం వాళ్ళకు అర్థంకాదు. దానికి అర్థంచేసుకున్నవాడు, ఈ సృష్టిలో జడపదార్థమంటూ లేదు. పదార్థంలో దృశ్యమానంగా ఉండేది, జడములో అంతర్యామిగా ఉండేది చైతన్యము. చనిపోతే ఈ శరీరముకూడా జడమే! జడపదార్థం అంటే ఏమిటి? అందులో చైతన్యం ఉండదు.సృష్టిలో జడపదార్థంకూడా నశిస్తుంది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


24 Dec 2020

No comments:

Post a Comment