రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
75. అధ్యాయము - 30
🌻. సతీదేహత్యాగము - 1 🌻
నారదుడిట్లు పలికెను -
శంకరుని పత్నియగు ఆ సతి మౌనమును వహించిన పిదప, అచట జరిగిన వృత్తాంతమెయ్యది? బ్రహ్మా! దానిని ఆదరముతో చెప్పుము (1).
బ్రహ్మ ఇట్లు పలికెను -
సతీదేవి మౌనమును వహించి ప్రసన్నమగు మనస్సు గలదై తన భర్తను ఆదరముతో స్మరించి వెంటనే ఉత్తర దిక్కునందు నేలపై కూర్చుండెను(2). ఆమె యథావిధిగా జలముతో ఆచనమును చేసి, వస్త్రముతో కప్పుకొని, శుచియై కన్నులను మూసుకొని భర్తను స్మరించి యోగమార్గమును ప్రవేశించెను (3).
స్వచ్ఛమగు ముఖము గల ఆ సతి ప్రాణాపానములను వాయువులను సమానములుగా చేసి, తరువాత ఉదానమును నాభి చక్రము నుండి ప్రయత్నపూర్వకముగా ఉత్థాపనము చేసెను (4). శంకరునకు ప్రాణములకంటె ప్రియురాలు, దోష విహీనయగు సతీదేవి ఉదానమును బుద్ధితో సహా హృదయమునందు వక్షస్థ్స లమను స్థానము నందుంచి, తరువాత కంఠ మార్గము గుండా కనుబొమల మధ్య లోనికి తీసుకొని వెళ్లెను (5).
ఆమె ఈ తీరున దక్షునియందలి కోపము వలన తన దేహమును త్యజించ గోరినదై, వెంటనే యోగమార్గము ననుసరించి దేహమునందు వాయువును, అగ్నిని ధరించెను (6). అపుడు యోగమార్గమునందు లగ్నమైన మనస్సు గల ఆ సతి తన భర్తయొక్క పాదములను ధ్యానిస్తూ ఇతరమును దేనినీ చూడలేదు (7).
ఓ మహర్షీ !వెంటనే కల్మషములు తొలగిపోయి ఆమె దేహము ఆమె కోర్కెకు అనుగుణముగా ఆ అగ్ని చే భస్మము చేయబడి క్రిందబడెను (8). భూమియందు, ఆకాశమునందు గల దేవతలు మొదలగు వారు ఆ దృశ్యమును చూచి భయమును కలగించె, మిక్కిలి పెద్ద హాహాకారమును చేసిరి. ఆ దృశ్యము అద్భుతముగను, చిత్రముగను ఉండెను (9).
అయ్యో !శంభునకు సతీదేవి మిక్కిలి ప్రియురాలు. ఆయన ఆమెను దైవమును వలె ప్రేమించెను. ఆమె మిక్కిలి దుష్టుడగు ఆ దక్షునిచే అవమానింపబడి ఆ కోపముతో ప్రాణములను వీడెను (10). ఆశ్చర్యము !చరాచర ప్రపంచము సంతానముగా గలవాడు, బ్రహ్మగారి కుమారుడు అగు ఈ దక్షుని అతిశయించిన దుష్టత్వమును పరికించును (11).
అయ్యో! మానవతి, వృషధ్వజునకు ప్రియురాలు, సత్పురుషులచే సర్వదా సన్మానమునకు అర్హురాలు అగు ఆ సతీదేవి ఈనాడు మిక్కిలి మానసిక దుఃఖమునకు గురి అయెను (12). దుష్ట హృదయుడు, పరబ్రహ్మయగు శివుని ద్వేషించువాడు అగు ఆ దక్ష ప్రజాపతి సమస్త లోకములలో పెద్ద అపకీర్తిని పొందగలడు (13).
ఏలయనగా,శంభుని ద్వేషించు ఆ దక్షుడు తన దేహమునుండి పుట్టిన కుమార్తె ప్రయాణమై రాగా అవమానించినాడు. ఆతడు మరణించిన మహానరకము ననుభవించగలడు. దీనిలో మన అపరాధము కూడా గలదు (14). సతీదేవి ప్రాణములను వీడుట అను అద్భుత దృశ్యమును గాంచిన జనులు ఇట్లు పలుకుచుండగా, వెనువెంటనే శివగణములు క్రోధముతో ఆయుధములను పైకి ఎత్తి లేచి నిలబడిరి (15).
ద్వారమునందు అరవై వేల గణములు నిలబడియుండిరి. శంకర ప్రభుని సేవకులగు వారు మహాబలశాలురు. వారు క్రోధముతో మండిపడిరి (16). 'మాకు నిందయగు గాక !అని' పలుకుచూ, వీరులగు శివగణ నాయకులందరు పెద్ద స్వరముతో అనేక పర్యాయములు హాహాకారములను చేసిరి (17).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
24 Dec 2020
No comments:
Post a Comment