గీతోపనిషత్తు -109


🌹. గీతోపనిషత్తు -109 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

శ్లోకము 40

🍀 35. అశ్రద్ధ - సంయమము - అజ్ఞాని ఇహలోకమున గాని, పరలోకమున గాని సుఖమును పొందలేడు. కారణమేమనగ అతడు రెండు గుణములచే బద్ధుడు. ఒకటి అశ్రద్ధ, రెండు సంశయము. శ్రద్ధ లేమివలన పనులయందాటంకములు రాగ, ఆటంకముల వలన మనసునందు రకరకముల సంశయములు మొలకెత్తుచు నుండును. సంశయము అశ్రద్ధను పోషించుచుండగ, అశ్రద్ధ సంశయమును ప్రోత్సహించు చుండును. అశ్రద్ధ వలన పనులు చెడును. శ్రద్ధ లేనివాడు ఏ కార్యమును అనుస్యుతముగ నిర్వర్తింపలేడు. శ్రద్ధ, విశ్వాసము పురోగతికి కారణములు కాగ, అశ్రద్ధ, సంశయము తిరోగతి కలిగించును 🍀

అజ్ఞశ్చా శ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి |
నాయం లోక్కో స్తి న పరో న సుఖం సంశయాత్మనః || 40


అజ్ఞాని ఇహలోకమున గాని, పరలోకమున గాని సుఖమును పొందలేడు. కారణమేమనగ అతడు రెండు గుణములచే బద్ధుడు. ఒకటి అశ్రద్ధ, రెండు సంశయము.

అశ్రద్ధ వలన పనులు చెడును. శ్రద్ధ లేనివాడు ఏ కార్యమును అనుస్యుతముగ నిర్వర్తింపలేడు. మనసు లగ్నము చేసి పనులను నిర్వర్తింపలేడు. పనులన్నియు అరకొరగనే జరుగు చుండును.

శ్రద్ధ లేమివలన పనులయందాటంకములు రాగ, ఆటంకముల వలన మనసునందు రకరకముల సంశయములు మొలకెత్తుచు నుండును. సంశయము అశ్రద్ధను పోషించుచుండగ, అశ్రద్ధ సంశయమును ప్రోత్సహించు చుండును. సర్వసామాన్యముగ వైఫల్యములకు ఈ రెండు అంశములే కారణముగ తెలియ వచ్చును.

ఇట్టివారు క్రమముగ పురోగమించుట జరుగకపోగ, తిరోగమించుట జరుగుచు నుండును. ఈ శ్లోకమున సంశయాత్మకుడు నశించును అని చెప్పుటలో 'వినశ్యతి' అను పదము వాడబడినది.

అనగ అట్టివాని పతనము ఘోరముగ నుండునని తెలియవలెను. శ్రద్ధ, విశ్వాసము పురోగతికి కారణములు కాగ, అశ్రద్ధ, సంశయము తిరోగతి కలిగించును సుమా అని అర్థము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


26 Dec 2020

No comments:

Post a Comment