🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. దధీచిమహర్షి-సువర్చల - 3 🌻
14. ఎంతటివాడినైనా స్నేహం ఏవిధంగా బాధిస్తుందో, వైరంకూడా అలాగే బాధిస్తుంది. లేడిపిల్ల కోసమని బెంగపెట్టుకుని చచ్చిపోయి, లేడిపిల్లగా పుట్టాడు ఒక ఋషి. అదీ దోషమే! ఇతరజీవులతో మనం పెట్టుకున్న, వైరములాంటి ఎలాంటి సంబంధ మైనాకూడా, మనకు బంధనమే! అటువంటప్పుడు మరి ఇతరుల మీద మనకు మోహమో, క్రోధమో ఉంటే ఇక చేప్పేదేముంది.
15. తీవ్రమయిన కక్షకాని, కోపంకాని, కోరికకాని, దుఃఖంకాని ఆర్యులకు ఏది వచ్చినా ఆనాడు ఒక్కటే శరణ్యం! అదే తపస్సు! అది ఆర్యజాతి యొక్క లక్షణం. ఒకడి మీద కక్షవస్తుంది. వాడిని ఏమీచెయ్యలేరు. చాలా బాధికుడు వాడు! ఏం చేస్తారు! వెళ్ళి తపస్సు చేస్తారు.
16. అంతేగాని దైన్యంతో ఏడుస్తూ పడుకుని, కడుపులో బాధతో కుమిలిపోవడం ఆర్యలక్షణం కాదు. వెంటనే తపస్సుకు వెళ్ళిపోతాడు ఆర్యుడు. అవమానం భరించలేకపోతే తపస్సు. కోరిక తీరకపోతే తపస్సు. అన్నిటికీ ఒకటే మార్గం. దినిలో సూక్ష్మం ఏమిటంటే, అంతర్యామిగా ఈశ్వరుడు లోపల ఉంటాడు. సర్వేశ్వరుడు. లోపలికివెళ్ళి ఆయనను అడగటమే ఈ మార్గం.
17. ఆతడిని అడిగితే సాధ్యంకానిది ఏముంటుంది! ఆ రహస్యం త్రికరణశుద్ధిగా నమ్మి, ఆ ఫలం పొందినవాళ్ళు ఆర్యులు! అందుకని తపస్సే ఆర్యుల మార్గం. ఎవరైనా సరే! ఎంత సామన్యుడయినా, ఎంతటి అల్పుడయినా సరే! ప్రపంచంలో ఏకోరిక తీర్చుకోవటానికైనా – తపస్సేమార్గం. ‘సర్వం తపస్సాధ్యం’. తపస్సుచేత సర్వమూ సాధ్యమే! ఇదీ మన సూత్రం.
18. బ్రాహ్మణుడు ఒక్కటే కోరతాడట! అది నమస్కారం. ఇంకేమీ అఖ్ఖరలేదు. దానికే సంతోషిస్తాడు. భోజనం అఖ్ఖరలేదు. ధనం అఖ్ఖరలేదు. సద్బ్రాహ్మణుడికి ఒక నమస్కారం చాలు. అది అతడి లక్షణంలోనే ఉంది. దేహంలోంచి, అలా ఇఛ్ఛానుసారంగా వెళ్ళిపోగలిగినవాడే యోగి. సాధారణుల మృత్యువు సందర్భంలో, రోగగ్రస్తమయిన-పాడైపోయిన శిథిలమైపోయిన శరీరంలోంచీ, ఇక ప్రాణాలు ఉండటానికి బలం లేక, జీవుడు బలవంతంగా బయటికిపోతాడు.
19. జీవుడిని, శరీరాన్ని కలిపికట్టి ఉంచిన పాశములు(తాళ్ళు) ప్రాణములు. శరీరం బలంగా లేకపోతే, ప్రాణములు జీవాత్మతో శరీరాన్ని బంధించి, కట్టిపెట్టి ఉంచలేవు. అటువంటి స్థితిలో శరీరం జీర్ణంకావటంచేత; ప్రాణములు, శక్తి నశించటంచేత; ప్రాణములులేని శరీరంలో తాను ఉండలేని స్థితిలో, జీవుడు శరీరంలోంచి వెళ్ళిపోవలసి వస్తుంది. దానినే మనం మృత్యువు అంటాం.
20. ప్రాణాలకు ఎప్పుడూ బలం ఉంటుంది. ఎప్పుడూ ప్రాణాలకు బలహీనతరాదు. శరీరానికి తీవ్ర రుగ్మత వచ్చినప్పుడు, ఇక ప్రాణాలు శరీరంలో వ్యాపించి ఉండలేకపోతాయి. మట్టిలో చెట్టు వ్రేళ్ళు ఎలాగైతే వ్యాపించి ఉంటాయో, అలా ప్రాణములు శరీరంలో వ్యాపించి ఉంటాయి. వేళ్ళబలం మట్టిలో ఉండే దారుఢ్యాన్ని బట్టి ఉంటుంది. వేళ్ళు బలంగా ఉండాలంటే మట్టిలో బలం ఉండాలి. వేళ్ళు బలంగాఉంటే చెట్టు బాగుంటుంది. ప్రాణములు శరీరంలో బాగా బలంగా ఉండాలంటే శరీరం బాగుండాలి. అలా ఉంటేనే ప్రాణములు జీవుడిని శరీరంలో నిక్షేపించి ఉంచుతాయి. శరీరం రోగగ్రస్తంకావటంతో విధిలేక జీవుడు వెళ్ళిపోతాడు.
21. శరీరం బలంగానే ఉన్నా, మృత్యువులోవలె ప్రాణతంతువులు తెగకుండా, తనంతటతాను వాటినుండి విడివడి జీవుడు స్వేఛ్ఛచేత ఎప్పుడంటే అప్పుడు బయటకు వెళ్ళగలిగినస్థితినే యోగము అంటారు. స్వఛ్ఛందమరణం అంటే అదే. ఎవడైతే శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళ్గలుగుతాడో వాడే ధీరుడు, ఆర్యుడు. వాడే తపస్వి, యోగి. అలాచేయటం సంకల్పబలంచేత, యోగంచేత సాధ్యమే.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
26 Dec 2020
No comments:
Post a Comment