రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
76. అధ్యాయము - 31
🌻. ఆకాశవాణి - 1 🌻
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఓ మహర్షీ! ఇంతలో నచట దక్షుడు, దేవతలు మొదలగువారు వినుచుండగా ఆకాశవాణి సత్యమును పలికెను (1).
ఆకాశవాణి ఇట్లు పలికెను -
ఓరీ దక్షా!దుష్టుడా !నీవు దంభము కొరకై యజ్ఞమును చేయుటయందు నిష్ఠగలవాడవు. ఓరీ మహమూర్ఖా! హానిని కలిగించే ఈ కర్మను ఏల చేసితివి? (2) ఓరీ మూర్ఖా !శైవ శిఖామణియగు దధీచి యొక్క మాటను ప్రమాణముగా స్వీకరించిక పోతివి. ఆయన మాటను పాటించినచో, సర్వులకు ఆనందము, శుభము కలిగి యుండెడిది (3). ఆ బ్రాహ్మణుడు సహింప శక్యముగాని శాపమునిచ్చి, నీ యజ్ఞమును వీడి నిష్క్రమించినాడు. కాని మూర్ఖడవగు నీకు అప్పుడైననూ బుద్ధి రాలేదు (4).
నీ కుమార్తె, మంగళ స్వరూపురాలు అగు స్వతి స్వయముగా నీ గృహమునకు రాగా, ఆమెను గొప్పగా ఆదరించవలెను. నీవు అట్లు చేయక పోవుటకు కారణమేమి?(5)ఓరీ అజ్ఞానీ !సతీ శివులను నీవు అర్చించవైతివి. కాణమేమి? బ్రహ్మపుత్రుడననే గర్వముచే మోహితుడవైతివి. నీ గర్వము వ్యర్థము (6).
ఆ సతిని నిత్యము ఆరాధించవలెను. ఆమె పుణ్య ఫలముల నన్నిటినీ ఇచ్చును. ఆమె ముల్లోకములకు తల్లి. మంగళస్వరూపురాలు. శంకరుని అర్థ శరీరమును పొందినది (7). ఆ సతిని నిత్యము ఆరాధించవలెను. ఆ మహేశ్వర పత్ని తన భక్తులకు సమస్త సౌభాగ్యములను, సర్వమంగళములను ఇచ్చును (8).
ఆ సతిని నిత్యము అర్చించువానికి సంసార భయము నాశమగును. ఆ దేవి మనస్సులోని కోర్కెలనీడేర్చి, సమస్త విపత్తులను తొలగించును (9). నిత్యము ఆరాధిచువారికి ఆమె కీర్తిని, సంపత్తులను, భుక్తిని, ముక్తిని ఇచ్చును. పరమేశ్వరుని అర్థాంగియగు ఆమె పరమ తత్త్వమగు బ్రహ్మస్వరూపిణి (10).
ఆ సతియే జగత్తును సృష్టించును, జగత్తును రక్షించును. అనాది శక్తియగు ఆమె కల్పాంతమునందు జగత్తును ఉపసంహరించును (11). ఆ సతియే జగన్మాత. ఆ జగదేక సుందరి విష్ణు, బ్రహ్మ, ఇంద్ర, చంద్ర, అగ్ని, సూర్యాది దేవతలకు తల్లియని మహర్షులు చెప్పుచున్నారు (12).
శంభుని శక్తి, దుష్టవినాశిని, పరాత్పరయగు ఆ సతీ మహాదేవియే తపస్సు, ధర్మము దానము మొదలగు వాటి ఫలముల నిచ్చును (13). ఇట్టి సతీదేవి ఎవని పత్నియో, ఎవని నిత్యప్రియురాలో, అట్టి శివునకు మూఢుడు, దుష్ట బుద్ధి అగు నీవు యజ్ఞములో భాగము నీయలేదు (14).
శంభువు పరమేశ్వరుడు. సర్వజగత్తులకు ప్రభువు. పరాత్పరుడు. విష్ణుబ్రహ్మాదులు ఆయనను సేవింతురు. ఆయన అందరికీ కల్యాణమును చేయును (15). ఈ శివుని దర్శించు కోరికతో సిద్ధులు తపస్సును చేయుదురు. ఈ శివుని దర్శించు కాంక్షతో యోగులు యోగము నభ్యసింతురు (16). అనంత ధన ధాన్యములను పొందుటకంటె, యజ్ఞాది పుణ్యకర్మల ఫలము కంటె శంకరుని దర్శనము యొక్క ఫలమే గొప్పదియని చెప్పబడినది (17).
శివుడే జగత్కారణము. సర్వవిద్యలకు మూలము ఆయనయే. సర్వ సమర్థుడగు ఆయనయే వేద విద్యకు శ్రేష్ఠమగు ప్రభువు. ఆయన మంగలములన్నిటిలో మంగళుడు (18). దుష్టుడా !ఆయన శక్తికి నీవీనాడు సత్కారమును చేయకుంటివి. ఈ కారణముగా ఈ నీ యజ్ఞము వినాశమును పొందగలదు (19).
పూజింప దగిన వారిని పూజించనిచో, నిశ్చయముగా అమంగళము కలుగును. శివుని పత్ని అందరిలో అధికముగా పూజార్హురాలు. కాని ఆమెకు పూజ జరుగలేదు (20). శేషుడు ఎవని పాదధూళిని నిత్యము వేయి పడగలతో ప్రీతితో ధరించుచున్నాడో, అట్టి శివుని శక్తియే సతీదేవి (21).
ఎవని పాదపద్మములను నిత్యము ధ్యానించి, ఆదరముతో పూజించి విష్ణువు విష్ణుపదవిని పొందినాడో, అట్టి శంభునకు సతీదేవి ప్రియురాలు (22). ఎవని పాదపద్మమును నిత్యము ధ్యానించి, ఆదరముతో పూజించి బ్రహ్మ సృష్టికర్త అయినాడో, అట్టి శంభునకు సతీదేవి ప్రియురాలు (23).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
26 Dec 2020
No comments:
Post a Comment