శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 160 / Sri Lalitha Chaitanya Vijnanam - 160


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 160 / Sri Lalitha Chaitanya Vijnanam - 160 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

47. నిశ్చింతా, నిరహంకారా, నిర్మోహా, మోహనాశినీ |
నిర్మమా, మమతాహంత్రీ, నిష్పాపా, పాపనాశినీ ‖ 47 ‖



🌻160. 'నిశ్చింతా'🌻

చింతలకతీతమైనది శ్రీమాత అని భావము. చింతలు లేనిది. చింతలు లేనిది అనగా సృష్టి చింత కూడా లేనిది. శ్రీమాత సృష్టించి, పోషించుట బాధ్యతాయుతమైన విషయము. సృష్టినే నిర్మించుచూ, పోషించుచూ, రక్షించుచూ లోకులను, లోకపాలకులను, లోకములను అధిష్ఠించి యుండుటకన్న మించిన బాధ్యత సృష్టిలో ఏమున్నది? అట్టి బాధ్యత వహించుచూ కూడ శ్రీమాత చింతపడదు. అది ఆమె సామర్థ్యము, స్వామిత్వము కూడ.

సర్వముపై స్వామిత్వము కలిగినవారు అట్టి స్థితి యందు క్రీడార్థమై యుండుట పరాకాష్ఠ. ఈ విషయమున శ్రీమాతకు ఆమెయే సాటి. త్రిమూర్తులు సహితము కలవరపడ్డ సన్నివేశములు సృష్టి యందు జరిగినవి. కానీ శ్రీమాత! కలవరపడిన సన్నివేశములకు సృష్టి నిర్వహణ భారమంతయూ స్మిత వదనయై నిర్వర్తించుచున్నది. ఇది అరుదైన కళ్యాణగుణము.

సృష్టి యందు శ్రీకృష్ణుడు ఒక్కడే అట్లు జీవించి చూపినాడు. జీవులు చింతాలోలురు. జీవితమంతయూ చింతలతోనే గడిచిపోవును. మనోబుద్దీంద్రియములు, శరీరము కూడ చింతలతో శుష్కించి పోవుచుండును. వారి చింతలకంతు లేదు. అందునా బాధ్యత కలవారి చింతలధికము. బాధ్యత పడుచున్న కొలది చింతలు పెరుగు చుండును. ఇట్టి చింతాపరులగు జీవులకు శ్రీమాత ఆరాధనమే శరణ్యము. చింతలు లేని శ్రీమాత భక్తులు జీవులకు మార్గదర్శకులు.

వారు జీవితమును ఎట్లు నిర్వర్తించుకొనిరో చూచి నేర్చుకొనుట, శ్రీమాతను ఆరాధన చేయుట ఈ రెండు అంశముల అభ్యాసము జీవులను చింతల నుండి తరింపచేయును. భాగవోతోత్తముల జీవిత చరిత్రలు, శ్రీమాత లీలలు (లీలార్థమై ఆమె నిర్వహించిన మహత్కార్యములు) చింతాపరులకు ఉపశమనము కలిగించ గలవు. పరిష్కారములు చూపగలవు. పరమపదమును చేర్చగలవు. చింతలు మనస్సున ఆవేశించినప్పుడు శ్రీమాత పాదములను ఆశ్రయించుట ఉపాయము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 160 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 Niścintā निश्चिन्ता (160) 🌻

She is without worries. Worries arise out of recollecting the past.

Since She transcends time and space, She does not have a past. It can also be said that in spite of the responsibility of administering the universe, She is without worries because, She has intelligently delegated Her work to Her ministers like Vārahī and Śyāmalā. This can be known while worshipping Śrī Cakra through navāvaraṇa pūja. This is in confirmation of nāma 155 Nīriśvarā,

Continues...

🌹 🌹 🌹 🌹 🌹


26 Dec 2020

No comments:

Post a Comment