దేవాపి మహర్షి బోధనలు - 11


🌹. దేవాపి మహర్షి బోధనలు - 11 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻 4. అశ్వవిద్య - 3 🌻


సంవత్సర చక్రమును ప్రవర్తింప చేయుచున్న శక్తి అశ్వమే. అది సూర్య కేంద్రితమైన శక్తి. అందుండియే సర్వము నందును విత్తనములు మొలక రూపమున మరల మరల బహువిధముగ జన్మించుచున్నవి.

మరల మరల పునరావృతమైన వర్షించు పర్జన్య శక్తి కూడ అశ్వమే. అనగా సూర్య కేంద్రకమైన సంవత్సర చక్రమున అగ్ని అశ్వ స్వరూపుడు. దాని నారోహించి పర్జన్య శక్తి వర్తించు చుండును.

భూమి సూర్యుని చుట్టూ వృత్తాకారముగ తిరుగు నపుడు ఏర్పడు అక్షరములన్నియు తేజోమయములు. సూర్యుని నుండి భూమికి చేరు ఈ కిరణములన్నియు భూమికిని సూర్యునికి వెలుగు మార్గము లేర్పరచుచున్నవి.

సూర్యుని నుండి భూమికి గమనము చేయుచు వ్యాపించి యన్నవి. అనగా అశ్వములుగ నున్నవి. ఈ వెలుగు కిరణముల నాధారము చేసుకొని భూలోకము నుండి సూర్యులోకమునకు చేరవచ్చును. మహాభారతమున ఉదంకోపాఖ్యానమున ఈ రహస్యమునే సూచన ప్రాయముగ వేదవ్యాసుడు తెలిపినాడు.

పాతాళమున బంధింపబడిన ఉదంకుడు అశ్వము యొక్క తోకను ఆధారముగ గొని శ్వాసను పూరించి, అశ్వము యొక్క ముఖము ద్వారా ఊర్థ్వమున కేతెంచి, గురు సాన్నిధ్యమున నిలచును. ఇచ్చట సంకేతింపబడిన అశ్వము కిరణమే.

పదార్థమునందు బద్ధులైన జీవులు కూడ వెలుగు కిరణముల నాధారముగ చేసుకొని, ఊర్థ్వముఖముగ వెలుగు పుట్టు చోటులో చేరుటకు సాధన మార్గము సంకేతింపబడినది.

తన యందలి హృదయము లేక భ్రూమధ్యము అను వెలుగు కేంద్రములపై సాధకుడు మనస్సు లగ్నముచేసి శ్వాస నాధారముగ ఆ కేంద్రములను చేరుట అశ్వవిద్య యొక్క రెండవ సందేశము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


24 Jan 2021

No comments:

Post a Comment