రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
83. అధ్యాయము - 38
🌻. క్షువదధీచుల వివాదము - 4 🌻
క్షువ మహారాజు ఇట్లు పలికెను -
హే భగవన్! ధర్మములు తెలిసినవాడు, వినయముతో నిండిన మనస్సు గలవాడు, దధీచుడని పేరు బడిసినవాడు అగు ఒకానొక బ్రాహ్మణుడు నాకు పూర్వము మిత్రుడుగ నుండెడివాడు (54). మృత్యుంజయుడు, దోషరహితుడు, మహాదేవుడు అగు శంకరుని ఆరాధించి ఆతడు ఆ ప్రభావముచే సర్వకాలములయందు సర్వులకు వధింప శక్యము కాని వాడుగా అయినాడు (55).
మహాతపస్వియగు ఆ దధీచి సభామధ్యమునందు అవమానకరముగా తన ఎడమకాలితో నా శిరస్సుపై వేగముగా తన్నెను (56). మరియు 'నేను మృత్యుంజయుని వద్దనుండి మంచి వరములను పొందియున్నాను గాన, నేను దేనికీ భయపడను ' అని ఆతడు గర్వముతో పలికెను. హే విష్ణో! ఆతడు అతిశయించిన గర్వము కలిగియున్నాడు (57).
బ్రహ్మఇట్లు పలికెను -
అపుడు మహాత్ముడగు దధీచుని ఎవ్వరైననూ సంహరించలేరను సత్యమును భావన చేసిన శ్రీహరి మహేశ్వరుని సాటిలేని మహిమను స్మరించుకొనెను (58). ఇట్లు స్మరించి శ్రీహరి బ్రహ్మపుత్రుడగు క్షువునితో వెంటనే ఇట్లనెను; ఓ రాజా శ్రేష్ఠా! బ్రాహ్మణులకు ఎచటనైననూ లేశ##మైననూ భయము లేదు (59).
ఓ రాజా! ప్రత్యేకించి రుద్రభక్తులకు భయము లేనే లేదు. ఆ బ్రాహ్మణునకు దుఃఖమును కలిగించినచో, ఆతడు దేవతనగు నాకు కూడ శాపము నీయగల్గును (60). ఆయన శాపముచే దక్షయజ్ఞములో దేవదేవుడగు శివుని వలన నాకు వినాశము కలుగును. ఓ రాజేంద్రా! నాకు మరల అభివృద్ధి కూడ కలుగ గలదు (61).
ఓ రాజేంద్రా! కావున నేను నీతో కలిసి సర్వయత్నములు చేసిననూ వ్యర్థము. నీకు దధీచిపై విజయము లభించుటకై నేనే యత్నించెదను (62). విష్ణువు యొక్క ఈ మాటను విని క్షువ మహారాజు 'సరే' అనెను. ఆ కోరిక (దధీచిపై విజయము) యందు ఉత్కంఠతో గూడిన మనస్సు గల క్షువుడు విష్ణువుయందలి ప్రీతితో అచటనే ఉండెను (63).
శ్రీ శివమహాపురాణములో రెండవదియగు రుద్ర సంహితయందు రెండవదియగు సతీఖండలో క్షువ దధీచి వివాద వర్ణనమనే ముప్పది ఎనిమిదవ అధ్యాయము ముగిసినది (38).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
24 Jan 2021
No comments:
Post a Comment