గీతోపనిషత్తు -132


🌹. గీతోపనిషత్తు -132 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాస యోగము 📚

శ్లోకము 17


🍀. 15. అపునరావృత్తి - సర్వమునకు ఆధారమైన తత్వము నందు తమ బుద్ధిని నిలుపువారు, నేను' అను అహంకారమును, నేను' అను సర్వాంతర్యామి ప్రజ్ఞయందు స్థిరముగ నిలుపువారు ఆ తత్వము నందే నిష్ఠగలవారు, అదియే తానైన వారు. పునరావృత్తిలేని స్థితిని పొందు చున్నారు. జ్ఞాన మనగ ఆ తత్త్వముతో ముడిపడుటయే అట్టి వారిని పాపము లంటవు. ఉన్నది యొకటే. దానినే సత్యమందురు. అన్నిటి యందున్నను, అన్నిటికి అతీతముగ నుండునది, అన్నిటికి ఆధారమై యుండునది ఈ తత్త్వము. దానితో ముడిపడి యుండుట నిజమగు జ్ఞానము, నిజమగు భక్తి, నిజమగు యోగము, నిజమగు సన్న్యాసము, వైరాగ్యము. బుద్ధి చేతను, స్మరణ చేతను, నిష్ఠ చేతను దానియందు స్థిరపడినవారు శాశ్వతులు. అట్టివారిని త్రిగుణాత్మకమగు ప్రకృతి ఆరోహణ, అవరోహణ క్రమములకు గురిచేయదు. వీరు సహజ జ్ఞానులు. వారి స్థితి సహజ సమాధి స్థితి. 🍀

దద్బుద్ధయ స్తదాత్మాన సన్నిస్తత్పరాయణా |
గచ్ఛంత్యపునరావృత్తం జ్ఞాననిర్దూత కల్మషాః || 17

సర్వమునకు ఆధారమైన తత్వము నందు తమ బుద్ధిని నిలుపువారు, నేను' అను అహంకారమును, నేను' అను సర్వాంతర్యామి ప్రజ్ఞయందు స్థిరముగ నిలుపువారు ఆ తత్వము నందే నిష్ఠగలవారు, అదియే తానైన వారు. పునరావృత్తిలేని స్థితిని పొందు చున్నారు. జ్ఞాన మనగ ఆ తత్త్వముతో ముడిపడుటయే అట్టి వారిని పాపము లంటవు. ఉన్నది యొకటే. దానినే సత్యమందురు.

ఉండుట సృష్టి యందు అన్ని స్థితుల యందు ఉన్నది. సృష్టికి పూర్వము కూడ నున్నది. అందుండే కాలము, ప్రకృతి, శక్తి, త్రిగుణములు, పంచ భూతములు పుట్టుచున్నవి. త్రిగుణముల నుండియే సర్వజీవ రాశులు పుట్టుచున్నవి. అన్నిటి యందు ఉండుటగ ఆ పరతత్వ మున్నది. అదియే సత్యము. రాయి రప్ప కూడ ఉండుట యను స్థితియందున్నది. అన్నిటి యందున్నను, అన్నిటికి అతీతముగ నుండునది, అన్నిటికి ఆధారమై యుండునది ఈ తత్త్వము.

దీనినే పరమాత్మయని, అంతర్యామియని సంబోధింతురు. నిజమునకు అందరికిని, అన్నిటికిని అదే మూలము. దానితో ముడిపడి యుండుట నిజమగు జ్ఞానము, నిజమగు భక్తి, నిజమగు యోగము, నిజమగు సన్న్యాసము, వైరాగ్యము.

బుద్ధి చేతను, స్మరణ చేతను, నిష్ఠ చేతను దానియందు స్థిరపడినవారు శాశ్వతులు. అట్టివారిని త్రిగుణాత్మకమగు ప్రకృతి ఆరోహణ, అవరోహణ క్రమములకు గురిచేయదు. సనక సనంద నాదులు, వశిష్ఠ అగస్త్యులు అట్టివారు.

తత్వముతో ముడిపడిన వారిని ప్రకృతి గుణములు సృశించవు గనుక, పాపపుణ్యములు పునర్జన్మలు వారి కుండవు. వీరు సహజ జ్ఞానులు. వారి స్థితి సహజ సమాధి స్థితి.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


24 Jan 2021

No comments:

Post a Comment