శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 188 / Sri Lalitha Chaitanya Vijnanam - 188


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 188 / Sri Lalitha Chaitanya Vijnanam - 188 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀. పూర్తి శ్లోకము :

నిస్తులా, నీలచికురా, నిరపాయా, నిరత్యయా |
దుర్లభా, దుర్గమా, దుర్గా, దుఃఖహంత్రీ, సుఖప్రదా ‖ 50 ‖


🌻 188. 'దుర్లభా' 🌻

లభింప శక్యము కానిది శ్రీమాత అని అర్థము.

శ్రీమాత లభించుట అనగా దర్శన, స్పర్శన, సంభాషణాదులు ఆమెతో జరుగుట, ఎవ్వరునూ సాధింపదగిన విషయము కాదు. ఎటువంటి సాధనలచేతకూడా ఆమె సాధ్యపడదు. అసాధ్యురాలు. ఆమెకై ఆమె అనుగ్రహింప వలెను గాని, తానుగా ఎవ్వరూ ఆమెను పొందలేరు.

శ్రీమాత లభ్యమగుటకు చేయు ప్రయత్నములన్నియూ అహంకార పూరితములే కదా! అహంకారమున్నప్పుడే ప్రయత్నముండును. అది తామసికముగాని, రాజసికముగాని, సాత్వికముగాని అయివుండును. సాత్విక అహంకారములకు కూడ ఆమె లభించుట అసాధ్యము. ఆలిచిప్పలో ముత్యపు చినుకు పడుట ఆలిచిప్ప వశమున లేదు. సూర్యోదయపు వేళ మబ్బులు అడ్డు రావచ్చును. వేచి యుండుటయే కమలము పని. సాత్వికమగు సాధనయే భక్తుల కర్తవ్యము.

సిద్ధి వారి ఆధీనములో లేదు. పై విధముగనే సమస్త కార్యముల నిర్వర్తనమునకు, అవి సిద్ధించుటకు, నడుమ తెలియనిదొకటి యున్నది. పరీక్షలు వ్రాసినను, ఫలితములకై వేచి ఉండవలెను కదా! మృష్టాన్న భోజనము ఎదురుగా ఉన్ననూ భుజించుటకు వీలుపడని సన్నివేశములున్నవి కదా! సంపద లున్ననూ, సుఖపడవలెనను నియమమేమియూ లేదు. ఆరోగ్యమున్ననూ ఆయుర్దాయము మనచేతిలో లేదు.

ఇట్లన్ని విషయము లందు దుర్లభత్వము గోచరించుచుండును. దైనందిన జీవితమంతయూ ప్రాప్తాప్రాప్తములుగా నడచును. లభించుట, లభింపకపోవుట జీవుల అధీనములో లేదు. ఎంత స్వాధీనుల మనుకున్ననూ జీవులు పరాధీనులే. శ్రీమాత అనుగ్రహమే ప్రాప్తమునకు కారణము. జీవునికి వలసినవి లభించినపుడెల్ల, ఇందువలన లభించినవి అనుకొనుట ఒక తెలివి.

ఆ తెలివి సత్యము కాదు. ఇందువలన, అందువలన అని భావించువారికి, ఎందువలనో తెలియని సన్నివేశము లేర్పడును. తనకు లభించినవి దైవమిచ్చినవని భావించుచూ, సంతుష్టిపడుట నిజమగు భక్తుల లక్షణము. అట్టివారు కర్తవ్య నిర్వహణమున శ్రద్ధ వహింతురు. లభించుట, లభింపక పోవుట దైవమునకే వదలి వేయుదురు. లభించిననూ, లభింపకపోయిననూ దైవానుగ్రహముగ భావింతురు.

ఎవనికెప్పుడేమి లభించునో, ఏమి లభింపదో ఎవరికినీ తెలియదు. ఆ సమస్తమును శ్రీమాత ఆధీనమున నున్నది. ఆమె అనుగ్రహము తెలియుట దుర్లభము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 188 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj



🌻 Durlabhā दुर्लभा (188)🌻

She does not transgress Her limits. It has already been seen that She functions as per the law of karma-s, the law of the Lord. Law of karma is enacted by Her, and She does not transgress Her own laws. She sets an example for others to follow.


Continues...
🌹 🌹 🌹 🌹 🌹


24 Jan 2021

No comments:

Post a Comment