గీతోపనిషత్తు -151
🌹. గీతోపనిషత్తు -151 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚
శ్లోకము 4
🍀 4 - 1. సంకల్ప సన్యాసము - మానవ ప్రజ్ఞ బాహ్యములోనికి ప్రవేశించుటకు, అనగా ప్రపంచముతో సంబంధ మేర్పరచు కొనుటకు యింద్రియములు దైవ మేర్పరచిన సౌకర్యము. ఇంద్రియముల ద్వారా బహిరంగ విషయములను వినుట, చూచుట, రుచి చూచుట, వాసన చూచుట, స్పర్శను తెలియుట జరుగుచుండును. ఇట్లు బాహ్యమున చూచునపుడు కొన్ని విషయములం దాసక్తి కలుగుట, కొన్ని విషయములం దనాసక్తి కలుగుట జరుగు చుండును. ఇట్టి ప్రజ్ఞ ప్రథమముగ వెనుకకు మరల్చబడవలెను. పురోగమించు ప్రజ్ఞకు తిరోగమనము కూడ సంకల్ప మాత్రమున కలుగవలెను. అట్లే ప్రజ్ఞ ఆరోహణ క్రమమున సాగుటకు సర్వసంకల్పములను విసర్జించుట ఆవశ్యకము. 🍀
యదా హి చేంద్రియార్డేషు న కర్మ స్వనుషజ్జతే |
సర్వసంకల్ప సన్న్యాసీ యోగారూఢ స్తదోచ్యతే || 4
యోగవిద్య సాధన చేయుచున్నప్పుడు ప్రజ్ఞ ఆరోహణ క్రమమున సాగుటకు యింద్రియార్థముల ద్వారా బాహ్యమునకు ఊరక చనుచుండుట వర్జనీయము. అట్లే సర్వసంకల్పములను విసర్జించుట ఆవశ్యకము.
సాధారణముగ మానవులు బాహ్య ప్రపంచమున నిమగ్నులై యుందురు. మునిగియుందురు. మానవ ప్రజ్ఞ బాహ్యములోనికి ప్రవేశించుటకు, అనగా ప్రపంచముతో సంబంధ మేర్పరచు కొనుటకు యింద్రియములు దైవ మేర్పరచిన సౌకర్యము.
ఇంద్రియముల ద్వారా బహిరంగ విషయములను వినుట, చూచుట, రుచి చూచుట, వాసన చూచుట, స్పర్శను తెలియుట జరుగుచుండును. ఇట్లు బాహ్యమున చూచునపుడు కొన్ని విషయములం దాసక్తి కలుగుట, కొన్ని విషయములం దనాసక్తి కలుగుట జరుగు చుండును.
బాహ్య విషయములను గ్రహించుచు, బాహ్యమునకు ప్రతిస్పందించుచు సామాన్య జీవితము సాగుచుండును. ఇంద్రియము లందించు సుఖము తాత్కాలికమే అయినను మరల మరల వానిని కోరు స్వభావ మేర్పడి వినుట, చూచుట, తినుట, స్పర్శించుట, మాట్లాడుటగ దినమంతయు సాగీ రాత్రివేళకు ప్రజ్ఞ బలహీనపడును.
ప్రకృతి నిద్ర ద్వారా ప్రజ్ఞను తిరోగమింపజేసి, మరునాటి ఉదయమునకు బలముగను, ఉత్సాహవంతముగను ఏర్పరచును. నిద్ర ప్రకృతి అందించిన వరము. నిదుర నుండి లేచిన మానవ ప్రజ్ఞ మరల బహిరంగమున ఉత్సుకతతో ప్రవేశించును. ఐదు ఇంద్రియముల ద్వారా, జననేంద్రియము ద్వారా, వాక్కు ద్వారా ఏడు విధములుగ ప్రజ్ఞ బహిర్గతమగుచు, జీవుడు నిర్వీర్యు డగుచుండును. క్రమముగ మరణము సమీపించును.
బలీయముగ బహిర్గతము లోనికి యింద్రియముల ద్వారా ప్రజ్ఞ ఏడు విధములుగ యీడ్చబడుచుండును. పశువును అన్ని విధములుగ బంధించి, బలీయముగ లాగుకు పోవునట్లు, మానవ ప్రజ్ఞ మేల్కాంచినది మొదలు బహిరంగమున చేరుటకు కారణము యింద్రియములు రుచి చూపించిన విషయములందు ఏర్పడిన అమితమగు ఆసక్తియే.
ఇట్టి ప్రజ్ఞ ప్రథమముగ వెనుకకు మరల్చబడవలెను. పురోగమించు ప్రజ్ఞకు తిరోగమనము కూడ సంకల్ప మాత్రమున కలుగవలెను. కళ్ళెములేని గుఱ్ఱమువలె పరిగెత్తు ప్రజ్ఞకు గంతల కళ్ళెము ఏర్పరచినట్లు వెనుకకు మరల్చ గల పటుత్వ మేర్పడవలెను. బహిరంగమున గల ఆసక్తిచే బహిరంగములోనికి తీరుబడిలేక ప్రజ్ఞ ప్రసార మగుచున్నది గదా! విషయములం దాసక్తియే దీనికి కారణము.
ఈ ఆసక్తి అనాసక్తిగా ఎట్లు మారగలదు? ఇంద్రియ విషయముల కన్న రుచికరమైన విషయము ఒకటున్నదని తెలియుట వలన, దానియందాసక్తి పెరుగుచుండుట వలన చిల్లర విషయములం దాసక్తి తగ్గుచు నుండును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
16 Feb 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment