🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀
✍️. భరత్, 📚. ప్రసాద్ భరద్వాజ
ఉన్నపళంగా ఆ గుర్తింపును వదులుకుని ‘‘మీరెవరు?’’అనే వాస్తవాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించాలంటే మీకు చాలా భయంగానే ఉంటుంది.
ఎందుకంటే, రోజురోజుకి మృత్యువుకు దగ్గరవుతున్న మీరు ఇంతవరకు మీకున్న గుర్తింపును వదులుకుని ఇప్పుడు కొత్త పాఠం నేర్చుకోవడం మొదలుపెట్టాలి. మరణించలోగా మీరు ఆ పాఠాన్ని పూర్తిగా నేర్చుకోగలరో లేదో ఎవరికి తెలుసు? ఆ ప్రయత్నంలో మీరు మీ పాత గుర్తింపును కోల్పోవచ్చు.
కొత్త పాఠం నేర్చుకుని కొత్త గుర్తింపును సాధించేందుకు కావలసిన సమయం, ధైర్యం, శక్తి మీకు లేకపోవచ్చు? అలా జీవిత చరమాంకంలో మీరు పాత గుర్తింపును కోల్పోయి, కొత్త గుర్తింపును సాధించలేక, చివరికి ఏ గుర్తింపు లేకుండా, కుంగి కృశించిన హృదయంతో పిచ్చిగా జీవిస్తూ, మరణించవచ్చు.
అందుకే ‘‘ఇంతవరకు కష్టపడి సాధించిన పాత గుర్తింపుతో అంతా బాగానే జరిగింది కదా! చివరివరకు అలాగే గడిపేస్తే సరిపోతుంది’’ అని మీరు భావించవచ్చు. ఇప్పుడు నేను ఆ భావనను విడిచి పెట్టాలంటున్నాను. ఎందుకంటే, మీరు మీ పాత గుర్తింపులో ఉన్న వ్యక్తి కాదు. మిమ్మల్ని మీరు తెలుసుకోవాలంటే మీలో ఎలాంటి భావాలు ఉండకూడదు. నిజానికి, మీలో ఉన్న భావాలన్నీ త్యజించినప్పుడే మీరెవరో మీకు తెలుస్తుంది.
భయపడడం సహజం. దానిని మీరు తప్పుగా భావిస్తూ ఖండించకండి. నిరాకరించకండి. సామాజిక ఎదుగుదలలో అది ఒక భాగం. దానిని మనం ఏమాత్రం ఖండించకుండా, పూర్తిగా అంగీకరిస్తూనే దానిని అధిగమించాలి. కాబట్టి, మీరు చాలా నిదానంగా, ఒక క్రమ పద్ధతిలో, అంచెలంచెలుగా బయటపడుతూ ఉండండి. దూకుడుతో పనిలేదు. దానితో మీరు ఏమీ సాధించలేరు.
అలా చేస్తూ ఉంటే, త్వరలోనే మీరు సత్యం రుచి తెలుసుకుంటారు. అప్పుడు అరవై ఏళ్ళపాటు మీరు మీ జీవితాన్ని ఎలా వృథాచేసుకున్నారో మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. దానితో మీరు మీ పాత గుర్తింపును కోల్పోయి, నూతన దార్శనికభావాలతో నిండిన నవీన మానవునిగా తయారవుతారు.
ఆ మార్పు గుర్తింపు గణాంకాలలోకి రాదు. ఎందుకంటే, అప్పుడు మీరు పలికే ‘‘నేను’’అనే పదం వెనకాల ఏదీ ఉండదు. అది మీకు తెలుసు. ఒకవేళ ఏదైనా ఉంటే మీరు ఆ పదాన్ని పలుకలేరు. కాబట్టి, కేవలం సౌకర్యంకోసమే మీరు ఆ పదాన్ని వాడతారు. దాని వెనకాల ఒక విశాలమైన, పవిత్రమైన, అనంతమైన సముద్రముంటుంది. అందువల్ల మీరెప్పుడూ మరొక గుర్తింపును సాధించాలనుకోరు, సాధించరు.
మీ పాత గుర్తింపుపోవడంతో తొలిసారిగా మీరు దివ్య సముద్రంలోకి కెరటమైనట్లుగా భావించడం ప్రారంభిస్తారు. అది ఎలాంటి గుర్తింపు కాదు. ఎందుకంటే, అందులో మీరు లేరు. దివ్యత్వం మిమ్మల్ని ఆవరించింది. అందులో మీరు అదృశ్యమయ్యారు. మీరు అసత్యంతో పోరాడితే సత్యం మీకు దక్కుతుంది. అది చాలా విలువైనది.
ఎందుకంటే, ఏమీ లేని దానితో పోరాడినా ఎంతో విలువైనది మీకు దక్కుతోంది. అంతకన్నా కావలసినదేముంది? నాతో విసిగిపోయిన నేను నిస్సారమని తెలుసుకున్నాను. మీరేమో మనం ఎలాంటివారమైనా, మనని మనం అంగీకరించాలంటారు. అంతర్గత ఆనందాన్ని కోల్పోతున్నట్లు తెలుసుకున్న నేను ఈ జీవితాన్ని అంగీకరించ లేకపోతున్నాను. ఇప్పుడేం చెయ్యాలి?
- ఇంకాఉంది.
🌹 🌹 🌹 🌹 🌹
16 Feb 2021
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #ఓషోబోధనలు
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram, FB group 🌹
https://t.me/ChaitanyaVijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
No comments:
Post a Comment