అన్నింటా చైతన్యం రావాలి


🌹. అన్నింటా చైతన్యం రావాలి 🌹

🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀

✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ


అలాంటి ధ్యానం నుంచి ఎలాంటి బలవంతాలు లేని క్రమశిక్షణ భావన ఎవరూ నేర్పకుండా దానంతటదే సహజ సుమవికాసంలా మీలో కలిగినట్లు మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అప్పుడు మీ జీవితం, మీ ఉనికి పూర్తిగా మీ సొంతమవుతాయి. వాటి కలయికలో ఉదయించేదే అసలైన స్వేచ్చ. అదే నిర్వాణం.

🌻. తిరుగుబాటు కాదు విప్లవం: 🌻

ప్రభుత్వాలనేవి లేని సమాజస్థాయికి మనిషి చేరుకోలేదు. ‘క్రోపోట్కిన్’ లాంటి అరాచక వాదులందరూ ప్రభుత్వానికి, చట్టానికి వ్యతిరేకులే. నేను కూడా అతనిలా అరాచక వాదినే. కానీ, నా విధానం అతనికి పూర్తిగా వ్యతిరేకమైనది. ప్రభుత్వాలను, చట్టాలను రద్దుచెయ్యాలన్నాడు ‘క్రోపోట్కిన్’.

ఎవరూ హత్యలకు, మానభంగాలకు, హింసలకు, చిత్రహింసలకు గురికాని స్థాయికి మానవ చైతన్యం ఎదగాలని నేను కోరుకుంటున్నా. అప్పుడు పోలీసులకు పని లేక, చట్టాలు, న్యాయమూర్తుల అవసరం లేక, న్యాయస్థానాలు ఖాళీ అవడంతో, ప్రభుత్వాలు వృథా అనిపిస్తాయి. కానీ, మనిషి ఎంత అసహ్యకరమైన ఆటవికుడంటే, అతనిని బలవంతంగా అడ్డుకోకపోతే, మొత్తం సమాజాన్ని అతను గందరగోళంలోకి నెట్టేస్తాడు. నేను దానికి పూర్తిగా వ్యతిరేకిని.

ప్రపంచంలోని మానవులందరూ ఎవరినీ అధిగమించాలని కోరుకోకుండా, తాము అందరి కంటే చాలా ప్రత్యేకమనే భావనను త్యజించి, చాలా గొప్పవారుగా నిరూపించుకునే ప్రయత్నాన్ని మానుకుని, ఆత్మస్తుతి, పరనిందలు చెయ్యకుండా, ఎలాంటి ఆత్మన్యూనతా భావానికి, అపరాధ భావనకు గురికాకుండా, చాలా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ధ్యానం చేస్తూ పరమానందంతో ఆడుతూ, పాడుతూ, సమరస భావనతో కలిసిమెలసి జీవించేందుకు సిద్ధపడాలి. అదే నా కోరిక. అప్పుడు ప్రభుత్వాలు వాటంతటవే అదృశ్యమవుతాయి. అది వేరే విషయం. కానీ, అంతవరకు ప్రభుత్వాల అవసరం ఎంతైనా ఉంది. నిజానికి, కొన్ని ముఖ్యమైన అవసరాలను ప్రభుత్వాలు చాలా చక్కగా నెరవేరుస్తున్నాయి. కాబట్టి, నేను వాటికి వ్యతిరేకిని కాను.

ఒక చిన్న విషయం. మీకు జబ్బు చేస్తే మందులు అవసరమవుతాయి. ‘క్రోపోట్కిన్’ లాంటి అరాచక వాదులందరూ వాటిని నాశనం చెయ్యాలంటారు. వారిలా నేను మందులకు వ్యతిరేకిని కాదు. కానీ, మందులు అవసరమయ్యే మానవాళి రోగాలకు నేను పూర్తిగా వ్యతిరేకిని. ఎందుకంటే, మందులన్నీ చాలా ప్రమాదకరమైనవి. పైగా, వాటిలో చాలా మందులు విషపూరితాలే.

అందుకే అందరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను.

ముఖ్యంగా, జన్యుపరమైన మార్పులు చెయ్యడం ద్వారా పుట్టుక తోటే మనుషులు జీవితాలలో ఎప్పుడూ ఎలాంటి రోగాలు రాకుండా చెయ్యవచ్చు.

అప్పుడు ఎవరికీ మందులు, వైద్యుల అవసరముండదు. అందువల్ల మందుల దుకాణాలు, వైద్య కళాశాలలు మూసుకుపోతాయి. వైద్యులు ఎక్కడా కనిపించరు. ఇవన్నీ కేవలం నేను వాటిని వ్యతిరేకించినందు వల్ల జరగవు.

మనుషులందరూ సంపూర్ణ ఆరోగ్యవంతులైనప్పుడు ఫలితాలు అలాగే ఉంటాయి. నాకు ఒకే భాష, ఒకే ప్రభుత్వం, ఒకే ధార్మికత కలిగిన మానవాళితో కూడిన ఒకే ప్రపంచం కావాలి. మానవ చైతన్యం నిజంగా ఆ స్థాయికి ఎదిగినప్పుడే అది సాధ్యపడుతుంది.

ప్రభుత్వమనేది గొప్పలు చెప్పుకునేదిగా ఉండకూడదు. అది చాలా అవమానకరమైన విషయం. మీరు ఇంకా ఆటవికులుగానే ఉన్నారని, నాగరికత ఇంకా ఏర్పడలేదని దాని అస్తిత్వమే స్పష్టం చేస్తోంది కదా లేకపోతే మిమ్మల్ని పాలించేందుకు ప్రభుత్వం అవసరమేముంది? ఎవరైనా మిమ్మల్ని అన్యాయంగా దోచుకుంటారని, హత్య చేస్తారనే భయాలు లేనప్పుడు, అసలు ఎలాంటి నేరాలూ జరగనప్పుడు పెత్తందారీ ప్రభుత్వంతో మీకు పనేముంటుంది? కాబట్టి, దానిని మీరు కొనసాగించలేరు. ఎందుకంటే, దేశ ఆర్థిక వ్యవస్థకు అది పెద్ద భారంగా తయారై, పెరిగి పెద్దదవుతూ ఉంటుంది. పరంపరానుగత ఆధిపత్యాల వైఖరి ఎప్పుడూ అలాగే ఉంటుంది.

- ఇంకాఉంది.

🌹 🌹 🌹 🌹 🌹


05 Mar 2021

No comments:

Post a Comment