గీతోపనిషత్తు -165


🌹. గీతోపనిషత్తు -165 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚


శ్లోకము 10

🍀 10. ఆత్మజ్ఞానము -1 - ఏకాకి, రహసి స్థితః : రహస్యముగ, ఏకాంత స్థితియందు ఉండవలెను. దీని కొరకు పూర్వము ఆత్మసంయమము కొరకు యోగసాధకులు గుహలలో ఏకాంతముగ నుండెడివారు. ఏకాంత ప్రదేశమున కేగుట వలన కొంత మనసు కుదుటపడునని కొందరు భావింతురు. కాని కుదురు గల మనస్సు ఎచ్చటనైనను కుదురుగనే యుండును. గుహలకు, అడవులకు పోనవసరము లేదు. తన గృహమునందు సాధకుడు ఒక నిర్ణీత ప్రదేశమున ఏకాంతముగ ఆశీనుడై యుండవచ్చును. మనస్సంతర్గతమై హృదయము నందు నిలిపినచో ఏకాంతము లభించును. హృదయగుహలో అను నిత్యము జరుగు హృదయ స్పందన యందు మనస్సు లగ్నము చేయుట ప్రధానము. 🍀


యోగీ యుంజీత సతత మాత్మానం రహసి స్థితః |
ఏకాకీ యతచిత్తాత్మా నిరాశీ రపరిగ్రహః | 10


రహస్య ప్రదేశమున ఏకాంతముగ స్థితిగొని అంతర్ముఖమైన చిత్తము గలవాడై, ఆశ లేనివాడై యోగి సతతము ఆత్మయందు మనస్సును లగ్నమొనర్చును. ఈ శ్లోకమున ఆత్మసంయమము గావించు విధానము తెలుపబడినది. అది ఇట్లున్నది.


1. ఏకాకి, రహసి స్థితః :

రహస్యముగ, ఏకాంత స్థితియందు ఉండవలెను. దీని కొరకు పూర్వము ఆత్మసంయమము కొరకు యోగసాధకులు గుహలలో ఏకాంతముగ నుండెడివారు. ఏకాంత ప్రదేశమున కేగుట వలన కొంత మనసు కుదుటపడునని కొందరు భావింతురు. కాని కుదురు గల మనస్సు ఎచ్చటనైనను కుదురుగనే యుండును.

గుహలకు, అడవులకు పోనవసరము లేదు. తన గృహమునందు సాధకుడు ఒక నిర్ణీత ప్రదేశమున ఏకాంతముగ ఆశీనుడై యుండవచ్చును. మనస్సంతర్గతమై హృదయము నందు నిలిపినచో ఏకాంతము లభించును. హృదయగుహలో అను నిత్యము జరుగు హృదయ స్పందన యందు మనస్సు లగ్నము చేయుట ప్రధానము.

స్పందనమందు మనస్సునకు గల ఆసక్తి వలన ప్రజ్ఞ లచ్చట నిలుపుటకు వీలుపడును. అపుడు చిత్తము అంతర్ముఖ మగును. స్పందన పై నియమించబడి యుండును. లేదా మనో ప్రజ్ఞను భ్రూమధ్యమందు లగ్నముచేసి అచట వెలుగు దర్శనము చేయుటకు ప్రయత్నింప వలెను. మనస్సు అటు నిటు పోగలదు. కాని మరల మరల ప్రజ్ఞను భ్రూమధ్య మందలి వెలుగు దర్శనమునకు ప్రోత్సహించవలెను.

పై రెండు విధములతో జీవలక్షణమును బట్టి ఏ విధానము సులభమో దాని నవలంబించ వచ్చును. విధాన మేదైనను జరుగ వలసిన సాధన నిరంతరము కావలెను. ఒకే ప్రదేశమున నిర్వర్తించుట వలన ప్రకృతి ఆ ప్రదేశమున సహకరించగలదు. నిర్ణీత కాలము కూడ పాటించినచో ప్రయత్నమునకు సిద్ధి కలుగుటకు కాలము కూడ తోడ్పడును.

ముందు శ్లోకములలో తెలిపినట్లు సమబుద్ధి ఏర్పడుట వలన చిత్త మంతర్గత మగుటకు గల అవరోధ ములు తగ్గును. ఒకే ప్రదేశము, ఒకే కాలము తోడగుట వలన అవరోధములు మరింత తగ్గును. అంతరంగమునందు ప్రజ్ఞ నిలుపుటవలన సాధన రహస్యముగ సాగును. అంతరంగమున తానే కాంతుడు గనుక ఏకాంతము సిద్ధించును. 


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


05 Mar 2021

No comments:

Post a Comment