శ్రీ శివ మహా పురాణము - 365
🌹 . శ్రీ శివ మహా పురాణము - 365 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
95. అధ్యాయము - 07
🌻. పార్వతి బాల్యము - 2 🌻
బంధువులకు ఇష్టురాలు, మంచి శీలముతో గుణముతో కూడియున్నది అగు ఆమెను బంధుజనులు కులమునకు తగిన 'పార్వతి' అను పేరుతో పిలువజొచ్చిరి (15). ఆ ఉమాదేవి హిమవంతుని గృహములో వర్షకాలమందలి గంగవలె, శరత్కాలమందలి వెన్నెలవలె ప్రకాశించెను (16).
ఓ మహర్షీ! భవిష్యత్తులో ఆ కాళి తపస్సునకు పక్రమించగా, తల్లి 'ఉమా (అబ్బే, వద్దు)' అని నిషేధించును. అప్పటి నుండియూ ఆ సుందరికి ఉమ అను పేరు లోకములో ప్రసిద్ధిని గాంచెను (17). హిమవంతుడు పుత్రసంతానము గలవాడే. అయిననూ, సర్వసౌభాగ్యవతి యగు పార్వతియను పుత్రికను ఎంత చూచిననూ, ఆతనికి తనివి తీరలేదు (18).
వసంతర్తువు యందు అనంత సంఖ్యలో పుష్పములున్ననూ, తమ్మెదల దండు మామిడి చెట్టు పై విశేష ప్రీతిని కలిగియుండును గదా! ఓ మహర్షీ! (19) సంస్కారవంతమగు వాక్కుచే విద్వాంసుడు వలె ఆ హిమవంతుడు ఆమెచే పవిత్రితుడాయెను. మరియు అలంకృతుడాయెను (20).
గొప్ప కాంతులను విరజిమ్మే అగ్ని శిఖతో దీపమువలె, మందాకిని (పాలపుంత)తో బ్రహ్మండములోని నక్షత్ర మార్గమువలె, హిమవంతుడు గిరిజతో కూడి ప్రకాశించెను (21). ఆమె బాల్యమునందు సుఖురాండ్రతో గూడి గంగానది యొక్క ఇసుకతిన్నెలపై బంతులతో, ఆట బొమ్మలతో చిరకాలము క్రీడించెను (22).
ఓ మహర్షీ! తరువాత ఆ శివాదేవి విద్యా రంభ సమయములో ఆరంభించి, సద్గురువు వద్ద నుంచి పరమ ప్రీతితో మనస్సును లగ్నము చేసి విద్యలను స్వీకరించి పఠించెను (23).
ఓ మహర్షీ! ఈ తీరున నేను అనిర్వచనీయమగు శివాలీలను చక్కగా వర్ణించితిని. మరికొన్ని లీలలను చెప్పగలను. నీవు ప్రేమపూర్వకముగా వినుము (25).
శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహితయందు పార్వతీ ఖండలో పార్వతీ బాల్యలీలల వర్ణనమనే ఏడవ అధ్యాయము ముగిసినది (7).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
05 Mar 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment