🌹 . శ్రీ శివ మహా పురాణము - 387 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 16
🌻. బ్రహ్మ దేవతల నోదార్చుట - 1 🌻
బ్రహ్మఇట్లు పలికెను-
అపుడా దేవతలందరు తారకునిచే పీడింపబడిన వారై ప్రజాపతిని మహాభక్తితో ప్రణమిల్లి స్తుతించిరి.(1) సత్యము, మనోహరమునగు దేవతల స్తుతిని విని నేను మిక్కిలి ప్రసన్నుడనై దేవతలకు ఇట్లు బదులిడితిని(2). దేవతలారా! స్వాగతము. మీ మీ అధికారములు విఘ్నములు లేకుండా కొనసాగుచున్నవా? మీరందరు ఇచటకుఏల వచ్చితిరి? చెప్పుడు(3). ఆ దేవతలందరు ఈ నామాటను విని ప్రణమిల్లి తారకుని బెడదచే దీనులుగా నున్నవారై నాతో నిట్లనిరి(4).
దేవతలిట్లు పలికిరి-
హే లోకనాథా! నీవు ఇచ్చిన వరముచే గర్వితుడైన తారకాసురుడు మమ్ములను బలాత్కారముగా మాపదవుల నుండి వెళ్లగొట్టి ఆపదవులను తానే ఆక్రమించెను(5), మాకు కలిగిన ఈ విపత్తు గురించి నీకు తెలియనే లేదా? మేము నిన్ను శరణు జొచ్చితిమి. మా దుఃఖమును వెంటనే దూరము చేయుము(6). మేము ఎచ్చట నున్ననూ మమ్ములనీ దుఃఖము రాత్రింబగళ్లు పీడించుచున్నది. మేము ఎచటకు పారిపోయిననూ, తారకుడచటనే మాకు ప్రత్యక్షమగుచున్నాడు(7). హే సర్వేశ్వరా! తండ్రీ తారకుని వలన మాకు సంప్రాప్తమైన దుఃఖముచే మేమందరము మిక్కిలి పీడింపబడి దుఃఖితులమై యున్నాము(8)
అగ్ని, యముడు, వరుణుడు, నిర్ ఋతి, వాయువు, మరియు ఇతర దిక్పాలకులందరు వానికి వశులై(9), మనుష్యులవలె సంచరించుచూ, వివిధ పరికరములను చేతబట్టి, ఆ మహాసురుని సేవించుచున్నారు. వారికి ఒక క్షణమైననూ స్వాతంత్ర్యము లేకున్నది (10). ఇట్లు వానిచే పీడింపబడిన దేవతలందరు అన్ని కాలములయందు వానికి వశులై, వానికోరికకు అనురూపమగు పనులను చేయుచూ, వాని సేవకులై జీవించుచున్నారు.(11) వారి యువతులు అందరు, మరియు అప్సరస స్త్రీలు ఎవరు గలరో, వారిని అందరినీ మహాబలశాలియగు ఆ తారకాసురుడు తన వశము చేసుకొనెను(12)
యజ్ఞములు ఆగిపోయినవి . తాపసులు తపస్సును చేయుటకు లేదు. లోకములలో దాన ధర్మాదికము లేమియూ జరుగుట లేదు (13) వాని సేనాపతి, మహా పాపి అగు క్రౌంచుసురుడొకడు గలడు. వాడు ప్రతి దినము పాతాళ లోకమునకు వెళ్లి ప్రజలను బాధించుచున్నాడు (14) ఓ జగత్కర్తా! కఠిన హృదయుడు పాపియగు ఆ తారకుడు హఠాత్తుగా ఈ ముల్లోకముల రాజ్యమును మానుండి అపహరించినాడు.(15) హే లోకనాథా! ఆ రాక్షసుడు మా స్థానములకు మేము వెళ్లకుండగా వారించుచున్నాడు. నీవు మాకు ఒక స్థానమును నిర్దేశించుము. మేము అచటకు వెళ్లి స్వస్థులమై ఉండెదము.(16)
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
18 Apr 2021
No comments:
Post a Comment