గీతోపనిషత్తు -187
🌹. గీతోపనిషత్తు -187 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚
శ్లోకము 28
🍀 28. అత్యంత సుఖము - ఎల్లప్పుడును ఆత్మతోనే సాయుజ్యము చేయుచు యోగమున నిలచినవాడు బ్రహ్మస్పర్శ లభించుటచే అత్యంత సుఖమును పొందుచున్నాడు. శారీరక సుఖము కన్న యింద్రియ సుఖము గొప్పది. ఇంద్రియ సుఖము కన్న మనో సుఖము గొప్పది. మనో సుఖము కన్న బుద్ధి లోక సుఖము గొప్పది. అంతకన్న గొప్పది ఆత్మ సుఖము. ఆత్మ బ్రహ్మస్పర్శతో పొందునది పూర్ణ సుఖము. ఇట్టి సోపానక్రమమున ప్రాథమిక సుఖములు అశాశ్వతములు. మాధ్యమిక సుఖములు శాశ్వతములు. ఉత్తమ సుఖములు శాశ్వత సుఖములలో కూడ ఉత్తమ శ్రేణికి చెందినవి. ఇట్టి సోపాన సుఖమును అవగాహన చేసుకొనుట బుద్ధిమంతుల కావశ్యకము. 🍀
యుంజన్నేవం సదా22 త్మానం యోగీ విగతకల్మషః |
సుఖేన బ్రహ్మసంస్పర్శ మత్యంతం సుఖ మశ్నుతే || 28
ఎల్లప్పుడును ఆత్మతోనే సాయుజ్యము చేయుచు యోగమున నిలచినవాడు బ్రహ్మస్పర్శ లభించుటచే అత్యంత సుఖమును పొందుచున్నాడు. ఈ శ్లోకము ముందు శ్లోకమునకు కొనసాగింపే. ఆత్మతో బాగుగ రతి చెందిన చిత్తము సమస్తము నందు దానినే దర్శించుచు,
బ్రహ్మము స్పర్శను పొందుచు, బ్రహ్మానందము పొందుచు నుండును. అట్టివాడు విగత కల్మషుడని, సుఖవంతుడని ముందు శ్లోకములలోనే చెప్పబడినది. మరల మరల చెప్పుటలో సుఖ మెంత సుఖమో తెలుపుచున్నారు. సుఖము పొందునని, ఉత్తమ సుఖము పొందునని, అత్యుత్తమ సుఖము పొందునని, సోపాన క్రమమున సుఖమును గూర్చి గీతాచార్యుడు తెలుపుచున్నాడు.
శారీరక సుఖము కన్న యింద్రియ సుఖము గొప్పది. ఇంద్రియ సుఖము కన్న మనో సుఖము గొప్పది. మనో సుఖము కన్న బుద్ధి లోక సుఖము గొప్పది. అంతకన్న గొప్పది ఆత్మ సుఖము. ఆత్మ బ్రహ్మస్పర్శతో పొందునది పూర్ణ సుఖము. ఇట్టి సోపానక్రమమున ప్రాథమిక సుఖములు అశాశ్వతములు. మాధ్యమిక సుఖములు శాశ్వతములు. ఉత్తమ సుఖములు శాశ్వత సుఖములలోకూడ ఉత్తమ శ్రేణికి చెందినవి.
అందువలన అత్యంత సుఖమని ఈ శ్లోకమున చెప్పబడుచున్నది. ఆత్మసుఖము కలవానికి ఇతర సుఖములు లేనిచో ఇబ్బంది లేదు. అట్టి వానికి మనస్సేంద్రియ శరీరములు ఉన్నను లేకున్నను ఒక్కటియే. మనస్సేంద్రియ శరీర సుఖములు స్థిరములు కావు. బుధ్యాత్మ సుఖములు స్థిరము.
ఇట్టి సోపాన సుఖమును అవగాహన చేసుకొనుట బుద్ధిమంతుల కావశ్యకము. కేవలము అన్నపానాదులు, హాస నిద్రాదులు మాత్రమే సుఖ మనుకొనువారు పసివారు. మానవుల యందు వీరే ఎక్కువ. ఉత్తమోత్తమ సుఖములు తెలిసినవారు ఇట్టి పసివారికి కూడ అత్యుత్తమ సుఖము కలుగవలెనని ఆరాట పడుచుందురు. వారి ఆరాటమునకు విశ్వప్రేమయే కారణము కాని, తాపత్రయము కారణము కాదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
18 Apr 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment