దేవాపి మహర్షి బోధనలు - 73


🌹. దేవాపి మహర్షి బోధనలు - 73 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 54. తప్పుడు కోట 🌻


కలియుగమున తప్పులు సులభముగ మన్నింతురని, ఒప్పులను శ్లాఘింతురని, మంచి కొంచెమైనను ఫలిత మెక్కువగ నుండునని, చెడు ఎక్కువైనను కొంత క్షమింపబడునని నానుడి కలదు. ఇందలి సత్యము నేతిబీరకాయ వంటిది. మీకు తెలుసునా! ఈ భూమిపై కద్రు స్థానమున “తప్పుడు కోట” ఒకటి గలదు. (కద్రు' స్థానమనగా అధర్మమును ప్రేరేపించు ప్రజ్ఞా కేంద్రము) ఈ కోట కట్టడము తప్పుడుగ జరిగినది. దాని నిర్మాణము తప్పుడు ప్రదేశమున చేయబడినది.

కోట యందలి రాజు తప్పుడు వివాహమాడెను. అతడు తప్పుడు యుద్ధములు గూడ చేసెను. అతని మంత్రులు కూడ తప్పుడు సలహాలనే ఇచ్చెడివారు. రాజు తప్పుడు జూదము లాడెడివాడు. అతనికి తప్పుడు రోగములు వచ్చినవి. అకాలముగ మరణించినాడు. తప్పులు కొంతవరకే సహింపబడగలవు.

పై తెలిపిన తప్పుడు కోటను కలి ఆవరించిన మానవుని శరీరముతో సరిపోల్చవచ్చును. అందలి జీవునకు కోటలోని రాజునకు పోలికయున్నది. కలి ఆవరించిన జీవుని జననమే తప్పుడుగ జరుగును. పోషణము అపవిత్రమగు ఆహారముతో జరుగును. వివాహము గుణముతో సంబంధములేక జరుగును. అతని జీవన పోరాటము తప్పుల సంకులము. అతని మిత్రులు, సలహాదారులు కూడ తప్పుడు సలహాల నిత్తురు. మధ్యవయస్సుననే రోగములు మీదపడి అకాలమరణము సంభవించును. కలి ఆవరించిన వాని శరీరము కద్రు స్థానములోని తప్పుడు కోట వంటిది.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


17 Apr 2021

No comments:

Post a Comment