గీతోపనిషత్తు -231


🌹. గీతోపనిషత్తు -231 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚

శ్లోకము 15

🍀 14. పరమపదము - పరమపదము చేరినవారు సర్వ విధముల పూర్ణత్వము చెందుటవలన పునర్జన్మలకు కారణ ముండదు. దుఃఖము లనుభవించుటకు కారణ మసలే యుండదు. అక్షరము, పరము, బ్రహ్మము అయిన స్థితిని పొందినవారిని బ్రహ్మర్షులని పిలుతురు. వారు లోకములందు జనించుటకు వ్యక్తిగతముగ కారణము లేకున్నను దివ్య సంకల్పము ననుసరించి దేహములను ధరింతురు. 🍀

మా ముపేత్య పునర్జన్మ దుఃఖాలయ మశాశ్వతమ్ |
నాప్నువంతి మహాత్మావ స్పంసిద్ధిం పరమాం గతాః || 15


తాత్పర్యము : 'నన్ను' పై విధముగ పొందిన మహాత్ములు పరమపదము చేరి శాశ్వత సిద్ధియందుందురు. వారు శాశ్వతము, దుఃఖము గల జన్మలను మరల పొందరు.

వివరణము : పరమపదము చేరిన వారికి పూర్ణజ్ఞానము, పూర్ణానందము సిద్ధించి యుండును. కనుక వారు మరల మరల పరిపూర్ణత కొరకై దేహములు ధరించ పనియుండదు. ఇతరులు అపరిపూర్ణులగుట వలన పరిపూర్ణతకై జన్మలెత్తుదురు. వారు జన్మ లెత్తుటకు కారణమున్నది. పరమపదము చేరినవారు సర్వ విధముల పూర్ణత్వము చెందుటవలన పునర్జన్మలకు కారణ ముండదు. దుఃఖము లనుభవించుటకు కారణ మసలే యుండదు.

అక్షరము, పరము, బ్రహ్మము అయిన స్థితిని పొందినవారిని బ్రహ్మర్షులని పిలుతురు. వారు లోకములందు జనించుటకు వ్యక్తిగతముగ కారణము లేకున్నను దివ్య సంకల్పము ననుసరించి దేహములను ధరింతురు. అట్లు ధరించినను వారి నిజస్థితి మరువరు. బ్రహ్మమునందే ప్రజ్ఞ స్థిరపడి యుండును గనుక, దేహధారణము వలన శాశ్వతత్త్వము కోల్పోవుట, దుఃఖములు చెందుట యుండదు.

బ్రహ్మర్షులగు వశిష్ఠుడు, అగస్త్యుడు, గౌతముడు వంటి వారు దివ్య కారణములకై దేహములందున్నారు. ప్రజాపతులు కూడ బ్రహ్మము నెరిగినవారే అయ్యున్నను, దేహములు ధరించి సృష్టికార్యమున సహకరించుచున్నారు. మనువులు కూడ అట్టివారే. దుఃఖముల నిలయమగు జన్మలుకాక, దివ్య సంకల్పమున జన్మలెత్తుట యొకటి సృష్టిలో గలదు. అట్టివారన్ని గోళముల యందు ఉన్నారు. భూమిపై కూడ గలరు.

ఈ భూమి పై పరబ్రహ్మ పదమును పొందిన సిద్ధులు ఇరువది నాలుగు (24) మంది భౌగోళికముగ వ్యాప్తి చెంది మానవజాతి నుద్ధరించుటకై కృషి సలుపు చున్నారని ఆర్యోక్తి. అట్టివా రెప్పుడును సహజ సమాధి యందే యుందురు. బ్రహ్మానుభూతియందే యుందురు. వారిని దుఃఖము లంటవు. శరీరములు మార్చుకొనుచున్నను, వారి నిజస్థితికి అవస్థితి యుండదు. అట్టివారు దేహములందున్నను ముక్తులే.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


24 Jul 2021

No comments:

Post a Comment