శ్రీ శివ మహా పురాణము - 431


🌹 . శ్రీ శివ మహా పురాణము - 431🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 26

🌻. బ్రహ్మచారి రాక - 1 🌻

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఆ మునులు తమ లోకమునుకు వెళ్లగానే సృష్టికారణడగు శంకర ప్రభుడు పార్వతీ దేవియొక్క తపస్సును స్వయముగా పరిక్షింపగోరెను.(1).శంభుడు పరీక్షయను నెపముతో ఆమెను చూడగోరి, సంతోషముతో గూడిన మనస్సు గలవాడై, జటాధారియగు విప్రుని రూపమును ధరించి పార్వతి తపస్సు చేయుచున్న వనమునకు వెళ్ళెను.(2). సంతసముతో నిండిన మనస్సుగల ఆ శివుడు తన తేజస్సుచే ప్రకాశించువాడు, కర్రను గొడుగును పట్టుకున్నవాడు, మిక్కిలి ముదుసలి యగు బ్రహ్మణుని వేషమును ధరించి యుండెను(3). ఆయన సఖురాండ్రచే చుట్టువార బడి, తపోవిదికపై స్వచ్ఛమగు చంద్రకళవలె ప్రకాశించుచున్న ఆ పార్వతీదేవిని చూచెను.(4)

భక్తవత్సలుడగు ఆ శంభుడు బ్రహ్మచారి రూపమును ధరించినవాడై ఆ దేవిని చూచి, అపుడు ప్రేమతో సమీపమునకు వెళ్లెను.(5) అద్భుతమగు తేజస్సుతో ప్రకాశిస్తూ అచటకు విచ్చేసిన బ్రహ్మణుని చూచి అపుడా పార్వతీదేవి ఆయనను సర్వోపచారములతో మరియు బహుమానములతో పూజించెను(6). పార్వతీదేవి పరమానందముతో యరియుఏ చక్కగా అమర్చబడిన పూజా ద్రవ్యములతో ఆ బ్రాహ్మణుని పూజించి ఆదరముతో ప్రేమతో కుశలము అడిగెను(7).

పార్వతి ఇట్లు పలికెను: వేదవేత్తలలో శ్రేష్ఠమైనవాడా! బ్రహ్మచారి రూపములో నున్న నీవు ఎవరివి? ఈ వనము నీచే ప్రకాశించుచున్నది చెప్పుము (8)

ఆ బ్రాహ్మణుడిట్లు పలికెను

నేను ఇచ్చవచ్చిన చోట సంచరించే వృద్ధ బ్రాహ్మణుడను,విద్వాంసుడను, తపశ్శాలిని. నేను ఇతరులకు ఉపకారమును చేసి సుఖమును కలిగించెద ననుటలో సందియము లేదు.(9) నీ వెవరు? ఎవరి కుమార్తెవు? నిర్జనమగు ఈ వనములో నిలబడి తపస్సును చేయు మునులు కూడ చేయ శక్యము కాని తపస్సును ఎందులకు చేయుచున్నావు? (10). నీవు చిన్న పిల్లవు కాదు. వృద్ధురాలవు కాదు నీవుఅందమగు యువతివి యని స్పష్టమగు చున్నది భర్త తోడు లేకుండగా ఈవనములో ఉగ్రమగు తపస్సును ఏల చేయుచున్నావు? (11) ఓ మంగళస్వరూపులారా! తపస్సును చేయుచున్న నీవు ఎవని భార్యవు ? ఆ అభాగ్యుడు నిన్ను పోషించుటలేదు. ఓ దేవీ! అతడు నిన్ను వీడి మరియోక చోటకు వెళ్ళినాడా యేమి?(12)


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


24 Jul 2021

No comments:

Post a Comment