గీతోపనిషత్తు -267


🌹. గీతోపనిషత్తు -267 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚

శ్లోకము 8-2

🍀 8. ప్రకృతి మాయ -2 - తామే చేయుచున్నామను మెర మెరయే గాని ఏ జీవునిచే ఎప్పుడు ఏమి చేయించవలెనో, వానిచే అట్లు చేయించునది ప్రకృతి. తన ఊహ కతీతముగ తమయందలి ప్రకృతి తమను అనేక విధములుగ ప్రోత్సహించి పనిచేయించును. నిజమునకు జీవుల స్వామిత్వ మేమియు లేదు. కనుక పరమాత్మతో కూడి ప్రకృతి మాయను దర్శించుచు యుండుట యోగ్యము. అపుడపుడు తాము కూడ మాయలో పడవచ్చునని తెలిసి యుండుట ముఖ్యము.🍀


ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః |
భూత గ్రామ మిమం కృత్స్న మవశం ప్రకృతే ర్వశాత్ || 8

తాత్పర్యము : ప్రాణి సముదాయ మంతయు స్వతహ ప్రకృతిచే నియమింపబడువారు అగుటచే నిశ్చయముగ అవశులు. అనగ తమ వశమున తాముండలేరు. ప్రకృతి ఎట్లాడించిన, అట్లాడుదురు.

వివరణము : తామే చేయుచున్నామను మెర మెరయే గాని ఏ జీవునిచే ఎప్పుడు ఏమి చేయించవలెనో, వానిచే అట్లు చేయించునది ప్రకృతి. వేద ద్రష్ట, వేదమునకు స్వర మేర్పరచిన వాడు, మహా జ్ఞానియగు రావణుని ద్వారా అనూహ్యమగు కార్యములు జరిగినవి. పరమప్రీతి ఎల్లప్పుడు రాముని ఎడలగల కైకేయిచే రాముని వనవాసమున కంపినది. దిక్పాలకు లందరికి అధి నాయకుడగు ఇంద్రునికి అహల్యపై మోహము కలిగించినది.

తన ఊహ కతీతముగ తమయందలి ప్రకృతి తమను అనేక విధములుగ ప్రోత్సహించి పనిచేయించును. నిజమునకు జీవుల స్వామిత్వ మేమియు లేదు. ఎవరిని అందల మెక్కించునో, ఎవరిని అధోలోకములకు తొక్కునో ఎవ్వరునూ చెప్పలేరు. తెలివితక్కువ వాడు తెలివిగలవాని పై అధికారియగును. చిత్ర అతివిచిత్రముగ జీవుల కథ నడుపుచుండును. కవి చేతిలోని కథా పాత్రలవలె ప్రకృతి చేతిలో జీవుల కథలు నడుచు చుండును.

ఇది ఇట్లు జరుగునని ఎవ్వరును చెప్పలేరు. ఈ మొత్తము సృష్టి వ్యాపారమును దర్శించిన ఋషులు ప్రకృతికి రెండక్షరముల పేరు పెట్టిరి. అదియే “మాయ”. ఆ మాయకు తాము లోబడుట కూడ వారు దర్శించుటచే వారు నిజముగ ఋషులైరి. అట్టి మాయా రూపమగు ప్రకృతి తన నుండే వెలువడి, తన లోనికే జొరబడి, హృదయమున నివాసముండునని పరమాత్మ తెలుపు చున్నాడు.

కనుక పరమాత్మతో కూడి ప్రకృతి మాయను దర్శించుచు యుండుట యోగ్యము. అపుడపుడు తాము కూడ మాయలో పడవచ్చునని తెలిసియుండుట ముఖ్యము. మాయని పడని జీవుడు లేడు. సనకసనందనాదులు, దేవర్షియగు నారదుడు మాయనుబడిన సందర్భములుండగ మాయను దాటితిమని ఎవరు చెప్పగలరు?


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


27 Oct 2021

No comments:

Post a Comment