శ్రీ శివ మహా పురాణము - 466


🌹 . శ్రీ శివ మహా పురాణము - 466 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 33

🌻. సప్తర్షుల ఉపదేశము - 3 🌻


ఓ పర్వత రాజా! నీతి శాస్త్రము ఇట్టి మూడు రకముల వచనములను నిరూపించి యున్నది. వీటి మధ్యలో ఎట్టి వచనమును నేను చెప్పవలయునని నీవు కోరుచున్నావు? (34) దేవదేవుడు అగు శంకరుడు బాహ్యసంపదలు లేనివాడే అయినా, తత్త్వజ్ఞానమనే సముద్రము నందు ఆయన మనస్సు మునకలు వేయుచుండును (35). జ్ఞానఘనుడు, ఆనందఘనుడు అగు శివునకు బాహ్యవస్తువుల యందు కోరిక ఎట్లు ఉండును? గృహస్థుడు తన కుమార్తెను రాజ్యము, సంపదలు గలవానికి ఇచ్చును (36).

దుఃఖితునకు తన కుమార్తెను ఇచ్చిన తండ్రి ఆ కన్యను సంహరించినట్లే యగును. కాని శంకరుడు దుఃఖియని ఎవనికి తెలియును? ఆయనకు కుబేరుడు కింకరుడు (37). నిర్గుణుడు, పరమాత్మ, పరమేశ్వరుడు, ప్రకృతికి అతీతుడు అగు ఆయన కనుబొమల కదలికచే మాత్రమే సృష్టిస్థితిలయములను చేయ సమర్థుడు (38).

సృష్ఠి కార్యమును నిర్వహించే శివుని మూడు రకముల మూర్తులు సృష్టి స్థితిలయములను చేయును. ఆ మూర్తులకు బ్రహ్మవిష్ణురుద్రులని పేరు (39). బ్రహ్మ లోకమునందుండే బ్రహ్మ, క్షీర సముద్రమునందుండే విష్ణువు, కైలాసమునందు నివసించే రుద్రుడు అను ముగ్గురు శివుని విభూతులు మాత్రమే (40)

శివుని నుండి పుట్టిన ప్రకృతి కూడ అనేక రూపములుగా వ్యక్తమైననూ, సృష్టి కార్యమునందు తన లీలచే మూడు విధముల మూర్తులను తన అంశచే ధరించి యున్నది (41). ముఖము నుండి పుట్టినది, వాక్కునకు అధిష్ఠాన దేవత అయినది అగు సరస్వతి ఒకమూర్తి. వక్ష స్థలము నుండి పుట్టినది, సర్వ సంపత్స్వరూపురాలు అగు లక్ష్మి రెండవది (42). మూడవది యగు ఉమ దేవతల తేజస్సు నుండి ఆవిర్భవించినది. ఆమె రాక్షసుల నందరినీ సంహరించి దేవతలకు సంపదలను ఒసంగినది (43).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


27 Oct 2021

No comments:

Post a Comment