శ్రీ శివ మహా పురాణము - 486


🌹 . శ్రీ శివ మహా పురాణము - 486 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 37

🌻. పెళ్ళి హడావుడి - 5 🌻

ఓ మహర్షీ! హిమవంతుడు పూర్వమే వారిని ఆనందముతో ఆహ్వానించి యుండెను. పార్వతీ పరమేశ్వరుల వివాహము గనుక వారందరు ప్రేమతో విచ్చేసిరి (41). అపుడు శోణా, భద్రా మొదలగు గొప్ప శోభగల నదులన్నియూ పార్వతీపరమేశ్వరుల వివాహము గనుక మహానందముతో విచ్చేసిరి (42).

నదులన్నియూ దివ్యరూపములను ధరించి అనేకములగు అలంకారములను పెట్టుకొని పార్వతీశివుల వివాహమను కారణముచే ప్రీతితో విచ్చేసిరి (43). గోదావరి, యమునా, సరస్వతి, మరియు వేణి అను నదులు పార్వతీ పరమేశ్వరుల వివాహమును దర్శించుటకై హిమవత్పర్వతమునకు విచ్చేసిరి (44)

గంగానది పార్వతీ పరమేశ్వరుల వివాహమును దర్శించుట కొరకై దివ్యరూపమును ధరించి అనేకములగు భూషణములతో అలంకరించుకొని మహానందముతో విచ్చేసెను (45). రుద్రుని కుమార్తె, గొప్ప నదియగు నర్మద పార్వతీ పరమేశ్వరుల వివాహమను కారణముచే మహానందముతో శీఘ్రముగా విచ్చేసెను (46).

అన్ని వైపులనుండి విచ్చేసిన వారందరితో హిమవంతుని దివ్య నగరము అంతటా నిండియుండెను. ఆ నగరము సర్వవిధముల శోభలతో నలరారెను (47). అచట

మహోత్సవము ప్రవర్తిల్లెను. జెండాలు, ధ్వజములు, తోరణములు అధికముగా నుండెను. చాందినీల విస్తారముచే సూర్యకాంతి చొరకుండెను. అయిననూ, అనేక కాంతులతో ప్రకాశించెను (48).

హిమవంతుడు మిక్కిలి ప్రీతితో ఆ పర్వతములకు, నదులకు యథోచితముగా సాదరముగా సన్మానమును చేసెను (49). వారినందరిని వేర్వేరు గృహములలో నివసింపజేసి సమస్త సామగ్రుల నేర్పాటుచేసి వారిని సంతోషపెట్టెను (50).

శ్రీ శివ మహాపురాణములోని రుద్రసంహిత యందు పార్వతీ ఖండలో పెళ్లి ఏర్పాట్లును వర్ణించే ముప్పది ఏడవ సర్గ ముగిసినది (37).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


07 Dec 2021

No comments:

Post a Comment