గీతోపనిషత్తు -349


🌹. గీతోపనిషత్తు -349 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 32 📚


🍀 32-3. తత్వదర్శనులు - పై ఆవరణ లెట్లున్నను లోపల జీవుడు దైవముయొక్క దివ్య ప్రతి బింబమే. బాహ్య ఆవరణములు లోపలి జీవునికి అంతరాయము కలుగ నేర్చవు. అగ్ని జ్యోతనము జరిగినపుడు అవరణలు అవరోధములు కానేరవు. అనన్యభక్తి సాధనమున అగ్నిజ్యోతనము సులభముగ జరుగును. అట్టి వానికి దైవానుగ్రహము శీఘ్రముగ లభించును. 🍀

32. మాం హి పార్థ వ్యపాశ్రిత్య యే2 పి స్యుః పాపయోనయః I
స్త్రియో వైశ్యాస్తథా శూద్రాస్తే పి యాంతి పరాం గతిమ్ ॥

తాత్పర్యము : అనన్యభక్తి మార్గమున నన్నాశ్రయించు వారు నిశ్చయముగ నన్నే పొందుచున్నారు. అట్టివారు స్త్రీలైనను, వైశ్యులైనను, శూద్రులైనను అంతర మేమియు ఉండదు.

వివరణము : జీవుడు లోపల జ్యోతిర్లింగము వలె వెలుగుచునే యుండును. దేవాలయము ఆవరణ లెట్లుండినను లోనగల జ్యోతిర్లింగము ఆరాధనీయము. అట్లే పై ఆవరణ లెట్లున్నను లోపల జీవుడు దైవముయొక్క దివ్య ప్రతి బింబమే. జీవులుగ అందరును దేవుని సంతానమే. ఆవరణలు ఆడంబరముగ నుండవచ్చును లేదా అతి సామాన్యముగ నుండ వచ్చును. శిథిలమైపోయి గూడ యుండవచ్చును. కాని లోపలి జీవుడు ఎప్పటికిని తేజోవంతుడే. బాహ్యావరణములు లోపలి జీవునికి అంతరాయము కలుగ నేర్చవు.

అగ్ని స్వరూపుడగు జీవుని చుట్టును గల ఆవరణలు అగ్ని ప్రజ్వలనము కాకున్నప్పుడే ఆవరణలుగ యుండును. అగ్ని జ్యోతనము జరిగినపుడు అవరణలు అవరోధములు కానేరవు. అనన్యభక్తి సాధనమున అగ్నిజ్యోతనము సులభముగ జరుగును. అట్టి వానికి దైవానుగ్రహము శీఘ్రముగ లభించును. అగ్ని స్వరూపుడగు జీవుడు స్త్రీయు కాదు, పురుషుడు కాదు. వైశ్యుడు కాదు. శూద్రుడు కాదు. అవియన్నియు ఆవరణములు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


10 Apr 2022

No comments:

Post a Comment