🌹 సిద్దేశ్వరయానం - 101 🌹
💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
🏵 రాధాసాధన - 4 🏵
ఆంధ్రప్రదేశ్ గవర్నరు దంపతులు ఆధికారిక కార్యక్రమం మీద గుంటూరువచ్చారు. గవర్నరు భార్య మంత్ర శాస్త్రాన్ని గురించి తన సందేహాలు నన్నడిగి తీర్చుకొన్నది. అప్పటికింకా నేను సన్యాసిని కాదు. ఆమె తనతో అమరావతి రమ్మని ఇంకా కాసేపు మాట్లాడుతూ తన సాధనకు సలహాలిమ్మని అడిగింది. సరేనని వెళ్ళాను. అమరావతిలో స్వామిదర్శనమైన తర్వాత బాలచాముండేశ్వరీదేవి ముందు ఎర్రని తివాచీ పరచారు. గవర్నరు దంపతులు కూర్చున్నారు. అధికారులు చేతులు కట్టుకొని నిల్చుని ఉన్నారు. ఆమె నన్ను కూచోమని కోరింది కూర్చున్నాను. నెమ్మదిగా తనకు దేవి దర్శనం కలిగేలా ఆశీర్వదించమని అభ్యర్థించింది. అప్పుడూ ఇలానే చిక్కున పడ్డాను. కండ్లుమూసుకొని చూస్తే ఆమె వెనుక ఒక సన్యాసి ఉన్నాడు. యోగ్యత కనిపించింది. ధ్యానంచేయమన్నాను. కాసేపు ధ్యానించి ఆమె అమ్మవారి పాదదర్శనమైంది, పూర్ణదర్శనం కాలేదన్నది. ఇప్పటికీ అనుగ్రహం కలిగింది గదా! ఆమె దయ నెమ్మదిగా ఇంకా లభిస్తుంది లెమ్మన్నాను. ఈ విధంగా పరమేశ్వరి చిత్రవిచిత్ర లీలలు ప్రదర్శిస్తున్నది.
పూర్వకర్మానుగుణంగా ఏవో ఇబ్బందులు ఆటంకాలు, అనారోగ్యాలు వస్తూ ఉండేవి. వాటిని నివారించడానికి తన సఖులలోని ఒక గోపికను రాధాదేవి పంపించేది. వారి వలన రాబోయే ఆపదలు తెలిసేవి, తొలగిపోయేవి. ఒక్కోసారి తానే వచ్చేది. ఒక పర్యాయం బృందావనం నుండి గుంటూరు రైలులో ప్రయాణం చేస్తున్నాము. తీవ్రమైన జ్వరం వచ్చింది. అప్పుడు బృందావనేశ్వరి అర్థనిద్రావస్థలో వచ్చి పాలు త్రాగించిన అనుభూతి కల్గింది. జ్వరం వెంటనే తగ్గిపోయింది. చాలాసార్లు వెంట తోడుగా ఒక గోపిక వస్తూండడం తెలుస్తూ ఉండేది. ఇటువంటి అనుభవాలు కలుగుతూ ఉంటే ఆ గోపికలతో ఆత్మీయత పెంచుకోవాలన్న కోరికతో సిద్ధగోపీసాధన చేశాను. దానివల్ల మొదట సువర్ణకాకలి అన్న గోపిక పరిచయమయింది. ఆమె ద్వాపర యుగాంతం నాటి రాధాసఖులలో ఒకరు. మరికొంత కాలానికి హల్లీసఖి అనే మరొక గోపికతో అనుబంధం ఏర్పడింది. ఆమె అయిదువందల సంవత్సరముల క్రింద మానవ శరీరంతో ఉండి ఆనాడు నాతో పరిచయ మేర్పడి భావాత్మకమైన తీవ్రసాధన చేసి రాధాసఖీమండలంలోకి చేరకల్గింది. వందల ఏండ్లు గడచినా ఆమె మనస్సులో ఈ స్మృతి మిగిలి ఉన్నందువల్ల నా దగ్గరకు మళ్ళీ వచ్చింది. రాసమండలిలో సువర్ణకాకలి అప్పుడప్పుడు పాటలు పాడే అవకాశం పొందుతున్నది. హల్లీసకి రాధాదేవికి అలంకారము చేయటం, ఎప్పుడైనా రాధాకృష్ణుల ముందు నాట్యం చేయడం జరుగుతూ ఉన్నది. ఈ విధంగా బృందావనధామంతో అనుబంధం అనేక విధాలుగా పెరుగుతున్నది.
దేవకార్యపద్ధతి చిత్రంగా ఉంటుంది. బృందావనంలో ఒక రోజు రాత్రి రాధామంత్ర ధ్యానం చేస్తున్నాము పూర్వాశ్రమంలో ఉన్నపుడు జరిగిన సంఘటన ఇది. ఇద్దరు ముగ్గురు ఆ గదిలో కాసేపు ధ్యానం చేసి పడుకొన్నారు. నేను కండ్లు మూసుకొని ధ్యానం చేస్తూనే ఉన్నాను. ఇంతలో ఉన్నట్లుండి హనుమంతుడు వచ్చి నిల్చున్నాడు. ఇదేమిటి ? రాధామంత్రము చేస్తూ వుంటే హనుమంతుడు ఎందుకు వచ్చాడు అనుకొంటూ కండ్లు తెరిచాను. సరిగ్గా ఆ సమయానికి నిద్రపోతున్న వ్యక్తులలో ఒకరు లేచి నా మీదకు చెయ్యి ఎత్తి దూకుతున్నాడు. దగ్గరికి వచ్చిన ఆ చేతిని పట్టుకొన్నాను. అతనికి మెళకువ వచ్చింది. ఇదేమిటి ? నే నెందుకు ఇలా వచ్చాను? అన్నాడు అతడు ఆందోళనతో. ఏమిలేదులే! పోయి పడుకో అన్నాను. అసలు జరిగిందేమిటంటే, ఆవ్యక్తి పిశాచగ్రస్తుడు. అతనిలో ఉన్న ఆ దుష్టగ్రహానికి నేను రాధామంత్రము చేయటం బాధ కలిగించింది. దానితో అతడు తనకు తెలియకుండానే నా మీదకు వచ్చాడు. రాధాదేవి హనుమంతుని నాకు రక్షగా పంపించింది. దానివలన ఇబ్బంది తొలగిపోయింది. హనుమంతుడు బృందావన క్షేత్రరక్షకుడు అన్న సంగతి తెలుసుకొన్నాను. పూజ్యశ్రీ రాధికాప్రసాద్మహరాజ్ గారు కూడా బృందావనంలోని ఆశ్రమానికి కొందరు వ్యక్తులవల్ల ఇబ్బంది కల్గినపుడు రాధాదేవితో మనవి చేస్తే ఆమె "హనుమాన్తో చెపుతాను లే! అతడు చూస్తాడు" అన్నది. ఆ సమస్య వెంటనే పరిష్కారం అయింది.
( సశేషం )
🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment