🌹2. మేలుకొలుపు - కర్తవ్యము నందు నిలబడు 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 2 📚
ఎట్టి పరిస్థితుల యందును క్లైబ్యమును పొందవలదని, హృదయ దౌర్బల్యము వలదని, అది క్షుద్రమైనదని, కర్తవ్యము నందు నిలబడుమని, పారిపోవలదని, భగవానుడు మరియొక శాసనము చేయుచున్నాడు.
క్లైబ్యం మాస్మగమó పార్థ నైతత్త్వ య్యుపపద్యతే |
క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిషస పరంతప || 3
నరుడు సహజముగ తేజోవంతుడు. కావున క్రీనీడలు లేక చీకట్లు క్రమ్ముటకు అవకాశములేదు. ఎంత నల్లమబ్బు అయినను తాత్కాలికమే కాని సూర్యునివలె శాశ్వతము కాదు.
తాత్కాలికమగు సంఘటనల యందు తన సహజత్వమును కోల్పోవుట అజ్ఞానము.
అర్జునుడు సహజముగ తేజోవంతుడు. పరాక్రమవంతుడు. పరంతపుడు అనగా శత్రువులను తపింప చేయువాడు మరియు పరమును గూర్చి తపించువాడు. అనగా దైవమును గూర్చి తపించువాడు. అట్టి తపము కారణముగ లోపల, బయట శత్రువులు జయింపబడుదురు. దైవము అనగా విశ్వ వ్యాప్తమైన తేజము.
దానిని గూర్చి తపించువానికి ధైర్యమెట్లు కలుగగలదు. దాని నుండి విడివడుట, తాత్కాలిక సన్నివేశమునకు ముడిబడుట కారణముగ అధైర్యము, మనో దుర్బలత్వము కలుగును. దైవమును ఆశ్రయించుటయే అట్టి సమయమున పరిష్కారము.
''పరంతపుడవైన ఓ నరుడ! కర్తవ్యమున మేల్కొనుము. క్షుద్రమైన హృదయ దౌర్బల్యమును వీడుము. అధైర్యమును పొందకుము. ఇది నీకు తగదు'' అని భగవానుడు శాసించు చున్నాడు.
గమనిక : ఈ శ్లోకమున భగవానుడు నరుని 'పరంతపుడని' సంబోధించుటలో గంభీరార్థము కలదు.
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment