శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 31

🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 31 🌹
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. సిద్ధయ్యకు జ్ఞానోపదేశం చేయడం - 1 🌻

ఒకరోజు సిద్ధయ్య వీర బ్రహ్మేంద్రస్వామితో చర్చను ప్రారంభించాడు.

“స్వామీ ఈ సమస్త సృష్టికి కారణభూతుడెవరు? ఆయనను మనం ఎలా కనుగొంటాం?” అని సిద్ధయ్య ప్రశ్నించాడు.

అప్పుడు వీరబ్రహ్మేంద్రస్వామి సిద్ధయ్యకు ఇలా వివరించారు.

“ఈ ప్రపంచంలో మన అనుభూతికి, జ్ఞానానికి అందని ఒక అద్భుత శక్తి వుంది. దానినే సర్వేశ్వరుడు అని మనం పిలుస్తాం. దీనిని వేర్వేరు మతాలకు చెందినవారు వేర్వేరుగా గుర్తిస్తారు. కానీ,ఆ శక్తిమంతుడు ఒక్కడే! అతడే భగవంతుడని ఆస్తికులంటారు.అది మన జ్ఞానానికి అతీతమైన సర్వోన్నత శక్తి అని, పుట్టుక, మరణము లేని శక్తి అనీ నాస్తికులంటారు.దానిని మనం అన్వేషణ ద్వారా కనుగొనవచ్చు”

“మన కళ్ళకు కనిపించే ఈ ప్రపంచము మొత్తము పూర్తిగా కల్పితమైనదే! అంటే ఇది అశాశ్వతమైనది. ఇది నశించక తప్పదు. అయితే, మరి మనకి కనబడుతున్న ఈ జీవులు, జీవం లేని వస్తువులు శాశ్వతం కాదా అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ ఉద్భవించవచ్చు. ఈ శరీరమే అశాశ్వతం. అలాంటప్పుడు మనకి గోచరమయ్యే ఈ చరాచర వస్తువులన్నీ కూడా నాశనమవుతాయి.

జీవుల జ్ఞానానికి, దృష్టికి అందని ఒకే అంశం, తత్త్వం ఈ సృష్టికి ముందు నుంచీ వుంది. ఇప్పుడు కూడా వుంది. తర్వాత కూడా వుంటుంది. దానినే మూల తత్త్వమనీ, భగవంతుడనీ రకరకాల పేర్లతో పిలుస్తాం. కొలుస్తాం. దాని స్వభావాన్ని గ్రహించటం అనేది దాదాపు అసాధ్యం. అది సాధారణ భావనకు అందనిది.

సమస్త సృష్టికీ కారణభూతమే ఈ అంశం. ఇది పరిపూర్ణమైనది. అణువు మొదలు బ్రహ్మాండం వరకు అన్నీ ఇందులోంచే ఉద్భవించాయి. తిరిగి ఇందులోనే లయమైపోతాయి.శ్రీ కృష్ణుడు తన విశ్వరూపం గురించి చెప్పిన సందర్భంలో కూడా దీని గురించే చెప్పాడు.

ఈ ప్రపంచంలో జీవులు అనుభవించే అనుభూతులకు అతీతమైనది అది. తన కర్మకు తాను నిర్వరిస్తూ పోతుంది. తప్ప ఎవ్వరి అనుజ్ఞ కోసం, ప్రార్థనల కోసమూ ఆగదు. దానిని మనం భగవంతుడని పిలుస్తూ, అనుగ్రహం కోసం ప్రార్థనలు చేస్తూ వుంటాం.

భగవంతుడికి లేదా ఈ అనంతత్వానికి ఒక రూపం లేదు. గుణం లేదు. చావు లేదు. పుట్టుక లేదు.అతడు ఆది లేనివాడు.అనంతమైన వాడు. అన్నింటిలోనూ వుంటాడు. అన్నీ తానై వుంటాడు. కానీ ఇందులో ఏ ఒక్కటీ భగవంతుని గురించి లేదా ఈ ఏకత్వం గురించి చెప్పలేదు.

కేవలం మొక్కుబడిగా చేసే పూజలు, చదివే మంత్రాలతో ఎవరూ భగవంతుడిని ప్రసన్నం చేసుకోలేదు. అలాగే స్వార్థం కోసం చేసే యజ్ఞాలతోనూ మనం భగవంతుని చూడలేం. నిర్మలమైన మనస్సుతో చేసే పనుల వల్ల మాత్రమే, ఎలాంటి యజ్ఞాలు చేయకపోయినా మంత్రాలు చదవకపోయినా భక్తులు సర్వేశ్వరుడిని చూడగలరు.

భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు దైవం తెలీదు. ఈ చర్మ చక్షువులతో భగవంతుని ఎవ్వరూ దర్శించలేరు, గుర్తించలేరు. ఎంతమంది భక్తులున్నప్పటికీ అతి కొద్దిమంది మాత్రమే భగవంతుని చేరుకోగలరు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment