నారద భక్తి సూత్రాలు - 108


🌹.   నారద భక్తి సూత్రాలు - 108   🌹 

✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,

🌻. చలాచలభోధ

📚. ప్రసాద్ భరద్వాజ

పంచమాధ్యాయం - భక్తి మహిమ - సూత్రము - 78

🌻 78. అహింనా సత్య శౌచ దయాస్తిక్వాది చారిత్ర్యాణి పరిపాలనీయాణి ॥ 🌻

అహింస, సత్యం, శౌచం, దయ, ఆస్తికం మొదలైనవి కూడా భక్తిని నిలుపు కోవడానికి ఉపయోగపదే సాధనలు.

అహింస అంటే తన వలన ఇతరులకు ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని ఏ విధమైన బాధ కలుగకుండుట. ఇతరులు బాధ పెట్టినా, ప్రతీకారంగా చెసేది కూడా హింసే అవుతుంది. ఇతరుల మనస్సుకు భక్తుడి వలన ఎట్టి బాధ కలుగకూడదు. సాధకుడు రజోగుణం విడిచి, సాత్వికుదైతే గాని భక్తి నిలవదు.

సాధకుడి వ్రతం అహింస గనుక, తన కారణంగా ఇతరులకు బాధ కలుగక పోయినా తన తలపులలో కూడా ఇతరులకు బాధను కలిగించే ఆలోచన రాకూడదు. అంతేకాదు, శత్రువును కూడా ప్రేమించ గలగాలి.

జిల్లళ్ళమూడి అమ్మ బాధల గురించి ఏమి నిర్వచించారో చూడండి. “శరీరానికి తగిలితే నొప్పి, మనస్సుకు తగిలితే బాధ. మనస్సుకు బాధ ఉంది అనుకుంటే ఉంది, లేదు అనుకుంటె లేదు. సుఖంగా బాధను అనుభవిస్తే బాధ బాధ కాదు. బాధంటే చైతన్యమే. బాధ లేకపోతే స్థాణువై పోతాడు. బాధలు అనుభవిస్తున్నా అది బాధ అనిపించనప్పుడు సహజ సహనమవుతుంది. సర్వకాల సర్వావస్థలందు సహజ సహనమె సమాధి. సమాధి అంటే మోక్షమే కదా !

అహింసకు అమ్మ చెప్పిన భాష్యమేమంటే బాధలుండడం భగవంతుని దయ. ఎందుకంటె బాధలు సహించుకోవడాన్ని సహజం చేసుకోవడానికి పరీక్ష అవసరం. ఆ పరిక్ష కోసమే బాధలున్నాయి. కనుక ప్రతిచర్య హింస అవుతుంది.

సత్యం అంటే అబద్దములాడకుండుట. సత్య వాక్పరిపాలనకు శ్రీరామచంద్రుడు, హరిశ్చంద్రుడు ఉదాహరణీయం. సత్యవ్రతం అంటే సత్యం జ్ఞానం అనంతం అయిన భగవంతునితో అనుసంధానం చేసుకోవడం. అనిత్య వస్తువుల యెడ ఆసక్తి వీడి, సత్యమైన భగవంతుని మీద అనురాగం పెంచుకోవడం. స్వార్ధాన్ని త్వాగం చేయదం సత్యమే అవుతుంది.

అంతఃకరణ శుద్ధి భక్తికి కావలసిన ఉత్సాహం బాహ్య శౌచం వలన కలుగుతుంది. సర్వ జీవులందు వాటి దీనత్వాన్ని బట్టి కలిగేది దయ. నా వారు, ఇతరులు అనే భేదం లేకుండా కలిగేది దయ.

భక్తి చేసేవాడికి “భగవంతుడున్నాడు, తప్పక అనుగ్రహిస్తాడు” అనె విశ్వాసం ఉండాలి. దీనినే ఆస్తిక్యము అంటారు. ఇట్టి దృఢ విశ్వాసం లేకపోతే భక్తి సఫలం కాదు.

అహింస, సత్యం, శౌచం, దయ, ఆస్తికం ఉన్నప్పుడు, గొణభక్తి ముఖ్యభక్తిగా పరిణమిస్తుంది. రాగద్వేష అసూయలున్న వారికి భక్తి అనేది, కపట ప్రదర్శనే అవుతుంది. కనుక భక్తిని నిజాయితీగా సలపడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


28 Sep 2020

No comments:

Post a Comment