40. గీతోపనిషత్తు - బ్రహ్మ నిర్వాణము - అంతటిలో నిండిన తత్త్వమును బ్రహ్మము అందురు




🌹. 40. గీతోపనిషత్తు - బ్రహ్మ నిర్వాణము - అంతటిలో నిండిన తత్త్వమును బ్రహ్మము అందురు. ఈ తత్త్వమును దర్శించిన వాని స్థితి బ్రాహ్మీ స్థితి. ఇది పొందినవానికి తాను కానిది ఏమియు కనపడదు. 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 72 📚

ఇది సాంఖ్యయోగమను అధ్యాయమునకు చిట్టచివరి శ్లోకము. ఈ శ్లోకమున భగవంతుడు అంతకుముందు శ్లోకములలో వివరించిన సోపాన క్రమమునకు గమ్యమును నిర్వర్తించు చున్నాడు.

ఏషా బ్రాహ్మీస్థితి: పార్థ ! నైనాం ప్రాప్య విముహ్యతి |
స్థిత్వాం స్యా మంతకాలే పి బ్రహ్మనిర్వాణ మృచ్ఛతి || 72

అర్జునుడు ప్రజ్ఞయందు స్థితి గొన్నవాని లక్షణములను గూర్చి నాలుగు ప్రశ్నలు శ్రద్ధాభక్తులతో శ్రీకృష్ణుని అడిగెను.

స్థితప్రజ్ఞుని లక్షణము లేవి? అతడేమి పలుకును? ఏ రీతిగ నుండును? ఎట్లు సంచరించును? అనునవి ఆ ప్రశ్నలు. ఈ ప్రశ్నలన్నిటికిని సమాధానములు వివరించుచు శ్రీకృష్ణుడు క్రమశః 71వ శ్లోకము చేరునప్పటికి నిరహంకార స్థితిని ఆవిష్కరించెను.

నిరహంకార స్థితి చేరినవారికి సమస్తము వ్యాపించియున్న తత్వమే తానుగా నున్నదనియు, మరియు సమస్త జగత్తు అదియే నిండియున్నదనియు తెలియును.

అంతటిలో నిండియున్నది, అన్నిటియందు నిండినది, తనయందు కూడ నిండియుండుటచే తాను, ఇతరము అను భేదము నశించును.

అంతటిలో నిండిన తత్త్వమును బ్రహ్మము అందురు. ఈ తత్త్వమును దర్శించిన వాని స్థితి బ్రాహ్మీ స్థితి. ఇది పొందినవానికి తాను కానిది ఏమియు కనపడదు.

తానే సమస్తమై యుండుటచే మరియు సమస్తమే తానుగ నుండుటచే మరియొకటి లేని స్థితి ప్రాప్తించుటచే మోహము, అంత్య కాలము అనునవి కూడ లేకుండును.

మరియొకటి లేని స్థితిని గూర్చి భగవానుడు భాషణము చేయుచున్నాడు. ఇదియొక అద్భుతమైన స్థితి. అనిర్వచనీయమైన స్థితి. అంతకుముందున్నవి అపుడుండవు. అంతకుముందు గోచరించిన సత్యములు కూడ నుండవు.

స్వప్నమున అనేకానేక రూపములను, సన్నివేశములను, భావములను అనుభూతి చెందుచున్న జీవుడు మేల్కాంచినపుడు స్వప్నము లోని విశేషములన్నియు, మేల్కాంచినపుడు ఎట్లు లేవో, అట్లే బ్రహ్మమునందు మేల్కాంచినవానికి ఈ సమస్త సృష్టియు, అందలి జీవులు, లోకములు స్వప్నమని తెలిసి నవ్వు కొనగలడు. అతని ఆనందమునకు అవధులు లేవు. అదియే బ్రహ్మానందము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


28 Sep 2020

No comments:

Post a Comment