✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మ విచారణ పద్ధతి - 28 🌻
బుద్ధి సూక్ష్మతని ఈ విచారణా క్రమములో మానవులందరూ తప్పక సంపాదించాలి. కారణం ఏమిటంటే అత్యంత సూక్ష్మమై, సూక్ష్మతరమై, సూక్ష్మతమమైనటువంటి పరబ్రహ్మమును గోచరింపచేసుకొనుట - అంటే కళ్ళకు కనబడేట్టుగా చేసుకొనడమనేది చాలా కష్ట తరమైనటువంటి పని. అది సాధ్యమయ్యేపని కాదు.
ఎందుకంటే అది నిరాకార నిర్గుణ నిరంజన నిరుపమాన స్వరూపం అది. మరి అన్ని నకార శబ్దములతో కూడుకున్నటువంటి లక్షణాలతో ఉన్నటువంటి పరబ్రహ్మమును సరాసరిగా చూడగలగడం అనేది సాధ్యం కావడం లేదు. కాబట్టి అటువంటి పరబ్రహ్మమును తెలుసుకొనగోరేవారందరికీ కూడా ఒక మార్గముండాలి కదా. ఆ మార్గము పేరే ఓంకారము.
ఓంకారమనే శబ్దమును ఆశ్రయించి ఉపాసన చేసేటటువారందరూ ఈ ఓంకారమును వాచికముగా గ్రహించి పరబ్రహ్మను వాచ్యముగా గ్రహించగలుగుతారు. ‘నీవెరుగగోరిన తత్వము ఇదియే’ అని నిశ్చయముగా తెలియజేస్తున్నారు.
నాయనా! నీవు మరణానంతరం ఏముంది అన్న ప్రశ్నను అడిగావు గానీ, అసలు నువ్వు తెలుసుకోదలచుకున్నది ఏమిటయ్యా అంటే సర్వకాల సర్వావస్థలయందును మార్పుచెందక వుండేటటువంటి పరబ్రహ్మ తత్వమేదైతే వుందో అటువంటి పరబ్రహ్మ తత్వమును తెలుసుకొనగోరుతున్నావు కాబట్టి దాని గురించి నీకు తెలియజేస్తున్నాను.
అది నాశము లేనిది అనేటటువంటి మొదటి లక్షణం చెప్పాడు. నశించేటటువంటివన్నీ జగత్తులోనివే. నశించేవన్నీ సృష్టిలోనివే. ఆద్యంతములు కలిగినటువంటివన్నీ పిపీలికాది బ్రహ్మపర్యంతము వుండేటటువంటివే అనేటటువంటి నిర్ణయాన్ని చెబుతూ ఇంకా రెండు ఉపమానాలని అందిస్తున్నాడు. అత్యంత సూక్ష్మమైనది.
సూక్ష్మము అంటే ఎంత సూక్ష్మమండి. అణువుకంటే అణువు. మహత్తు కంటే మహత్తు. “అణోరణీయాన్ మహతో మహీయాన్” అనేటటువంటి సూత్రాన్ని కూడా ఇక్కడ అందిస్తున్నారనమాట. అయితే సూక్ష్మాతి సూక్ష్మం ఎంతండీ అంటే ఒక కణాన్ని బేధించుకుంటూ బేధించుకుంటూ బేధించుకుంటూ చిట్టచివరికి వెళ్ళిపోయాం. మైనస్ మైనస్ మైనస్ మైనస్ మిల్లీ మైక్రానులదాకా కూడా వెళ్ళిపోయాం.
అప్పుడు ఏదైతే వున్నదో అది గానీ, లేదా పెంచుకుంటూ పెంచుకుంటూ పెంచుకుంటూ వెళ్ళాం, విశ్వ వ్యాపకంగా పెంచుకుంటూ వెళ్ళాం. కాస్మోసిస్ ఎంత వుందో అంత మేరకు పెంచుకుంటూ వెళ్ళాం. పెంచుకుంటూ వెళితే ఎంతయితే వున్నదో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వ్యాపించి వున్నది ఏదైతే వున్నదో అదంతా కూడా బ్రహ్మము. దానవతల పరబ్రహ్మము.
కాబట్టి ముందు దేనిని తెలుసుకోవాలటా? ఈ అణోరణీయాన్ మహతో మహీయాన్ గా వున్నటువంటి బ్రహ్మమును ఎరిగి, దానవతల అనేటటువంటి నిర్ణయాన్ని ఎవరైతే తెలుసుకుంటున్నారో వారు పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందినటువంటి వాళ్ళు అవుతున్నారు.
ఇంకేమిటటా నీకు ప్రయోజనం అంటే ఈ అణువు నుండి మహత్తు వరకూ వున్నటువంటి సమస్తమును ఎరిగినటువంటి వారికి కామ్య సిద్ధి కలుగుతుందట.
ఇదేమిటండీ అసలు కోరికలు త్యజిస్తేనే ఆత్మ విచారణకి పనికొస్తావని అంతకుముందు చెప్పి ఇప్పుడు మరలా కోరికలన్నీ సిద్ధిస్తాయి అంటారేమిటీ అంటే ఎవరైతే బ్రహ్మమును ఎరుగగోరుచున్నారో వారియొక్క లక్ష్యము పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందగోరడం. అది ఆ ఒక్క కామ్యమే మిగిలివున్నది. ఇంకే కామ్యములు వారియందు మిగిలి లేవు. మోక్ష కాంక్ష. ముక్తి కాంక్ష. ఒక్క కోరిక మాత్రమే మిగిలి వుంది.
ఈ జన్మమునందే నేను ముక్తిని పొందాలి. ఈ జన్మమునందే జనన మరణ రాహిత్యాన్ని పొందాలి అనేటటువంటి బలీయమైన ఆకాంక్ష ఒక్కటే తీవ్ర మోక్షేచ్చ ఒక్కటే మిగిలివున్నది కాబట్టి తప్పక దానిని పొందగలుగుతారు అనేటటువంటి ఆశీర్వచన వాక్యాన్ని ఇక్కడ “కోరికలన్నియూ తీరును“ అనేటటువంటి రూపంలో తెలియజేస్తున్నారు.
ఈ రకంగా నచికేతునికి ఓంకార తత్వముయొక్క విశేషం “ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ” అనేటటువంటి సూత్రమును ఆశ్రయించి బోధించడం ప్రారంభించారు. - విద్యా సాగర్ స్వామి
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కఠోపనిషత్ #చలాచలబోధ
WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
28 Sep 2020
No comments:
Post a Comment