🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 6 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
3. మనోరూపేక్షు కోదండా పంచ తన్మాత్ర సాయకా నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మండమండల
🌻 11. 'పంచతన్మాత్రసాయకా' - 2 🌻
పై తెలిపిన నాలుగు మకరములు పరతత్త్వము నాలుగు స్థితుల లోనికి దిగివచ్చుటకు దేవి ఏర్పరచు వాహనములు. స్వామిత్వము కలవాడు ఈ వాహనముల నధిష్టించి విహరించు చుండును.
అది లేనివాడు వాహనములకు పట్టుబడును. “అత్యంత కాంతివంతమైన తెల్లని మొసలిపై వరుణదేవత ఆకాశమున త్రిశూలధారియై విహరించుచున్నాడని” వేదము తెలుపుచున్నది. అనగా అశ్విని దేవతయైన వరుణుడు మిత్రునితో కలసి సమస్త సృష్టిని అధిష్ఠించి విహరించు చున్నాడని తెలియవలెను. ఈ నాలుగు మకరములకు నాలుగు వర్ణములు కలవని కూడ తెలియవలెను.
అందు మొదటిది తెల్లని మకరము లేక దీనిని నీలముగ కూడ తెలుపుదురు. రెండవది ఎరుపు వర్ణము కలది, మూడవది పసుపు వర్ణము కలది, నాలుగవది గోధుమ వర్ణము గలది. ఈ నాలుగు మకరములు జీవ చైతన్యము నధిష్ఠించి లేక దానికి లోబడి యుండు నాలుగు స్థితులు. వీటినే “ధ్యాన్” అను హీబ్రూ గ్రంథమున నాలుగు గుఱ్ఱములని కూడ పేర్కొనిరి.
ఈ మకరములను అంతర్యామి సాధనముననే అధిష్ఠించుట వీలగును. ఇతర మార్గముల వీలుపడదు.
జ్యోతిశ్చక్రమున గల మకర రాశి ఈ సందర్భమున ప్రాముఖ్యము వహించును. మకరముల నుండి మోక్షణము పొందుటకు మకరరాశి తత్త్వము ఎంతయు ఉపయోగకరము.
ఇది కారణముగ కూడ మకర మాసమును పుణ్యకాల మందురు. ప్రతి సంవత్సరము మకర మాసమున
సూర్యోదయమున భూమిని, భూమి జీవులను ఊర్ధ్వముఖులుగ ప్రచోదన మొనరించుటకు సూర్యకిరణముల నుండి ఉద్ధారకమైన తత్త్వము
ప్రసరింపబడుచుండును. ఉత్తరాయణ పుణ్యకాల మనగా జీవులను మకర బంధముల నుండి ఉద్ధరించు పుణ్యకాలముగ భావించవలెను.
అటులనే జ్యోతిశ్చక్రమున ఐదవ రాశియైన సింహరాశి, అపసవ్య మార్గమున ఐదవ రాశియైన ధనుస్సు రాశి కూడ మకరముల నుండి ఉద్ధరింపబడుటకు సహకరించగలవు. జీవుని జాతక చక్రమున ఐదు, పది రాశులలో గల గ్రహముల నుండి తాననుసరించ వలసిన ప్రవర్తనము సూచింపబడుచున్నదని కూడ గ్రహింపవలెను.
ఇట్లు మకరవిద్య అతి విస్తారముగ ఋషులచే వివరింపబడినది. ఇది ఒక ప్రత్యేక విద్యగ సాధన చేయు బృందములు గలవు. ఈ సందర్భమున భాగవత మందలి ఒక పద్యమును ఇచ్చట ప్రస్తుతి చేయుచున్నాము.
మకర మొకటి రవిఁ జొచ్చెను
మకరము మఱియొకటి ధనదు మాటున డాఁగెన్
మకరాలయమునఁ దిరిగెడు
మకరంబులు కూర్మరాజు మఱువన కరిగెన్.
పై పద్యమును ధ్యానము చేసి మకర రహస్యముల నెరుగవలెను.
అట్లే సంఖ్యా శాస్త్రమున ఐదు (5) అంకెకు అత్యంత ప్రాముఖ్యము కలదు. ఈ ప్రాముఖ్యత ముందు నామములలో వివరింపబడును.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi
WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
28 Sep 2020
No comments:
Post a Comment