భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 132


🌹.   భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 132   🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. నారద మహర్షి - 6 🌻

45. చీకటి పడితే నక్షత్రాలెలా కనబడతాయి? అక్కడ ఉన్నవే కనబడతాయి. మళ్ళీ ఈ వెలుగు రాగానే, అది మన కళ్ళమీద పడగానే, యథార్థం కనబడటం మానేసింది. అది కృత్రిమకాంతి. మరి ఉన్న నక్షత్రములను కనపడకుండా చేసేది వెలుగవుతుందా? అయితే, సృష్తిలో బ్రహ్మ ఈ ప్రజాపతులైన నారదాదులకు ఉపదేశించిన విద్యయొక్క స్వరూపం ఎట్లాంటిదంటే; సత్యాన్ని మరుగుపరచి అస్త్యరూపమయిన ప్రపంచాన్ని సృష్టించటమే – దాన్నే సత్యమనుకుని దాన్నే సృష్టించటం మొదలుపెట్టటమే.

46. బ్రహ్మ బ్రహ్మజ్ఞానము, శివతత్త్వజ్ఞానము తనయందే ఇముడ్చుకున్నాడు. మనకుండే అవిద్య అక్కడ ప్రారంభమయింది. ఆయన సృష్టిలో భాగం కాబట్టి, ఉన్న సద్వస్తువుయొక్క పరిజ్ఞానం, ప్రజ్ఞ మనకులేక బ్రహ్మ తనలో ఉంచేసుకున్నాడు. కానీ మనం పొందకుండా దానిని నిషేధించలేదు. లోపల సత్యం ఉన్నది.

47. కాని సత్యమున్నదనే జ్ఞానంమాత్రమే లేదు మనకు. సత్యం ఎక్కడినుంచో సంపాదించుకునే పనిలేదు; లోపల ఉన్నదే! ఉన్న వస్తువును తెలుసుకోవటానికి ఏంప్రయత్నం చెయ్యాలి? ఉన్నదని తెలివిలేకపోవటానికి, ఆ అవరోధానికి ఏమేమి హేతువులున్నాయో, లక్షణాలు ఉన్నాయో; ఆ లక్షణములను నిర్మూలించటమే అవిద్యను నిర్మూలించటం.

48. కాని విద్యను ‘సంపాదించటమనేది’ కాదది. సంపాదించటం అంటే, నిన్నలేనిది ఇవాళ రావటం. అలా వచ్చింది మళ్ళీ రేపు పోతుంది. అంటే ఇవాళ లేని జ్ఞానం వస్తే, మళ్ళీ రేపు పోవచ్చు కదా! ఇప్పుడు ఉన్నది(మన స్థితికి) అవిద్య. పోవలసింది అవిద్య. మిగలవలసింది అవిద్య.

49. నారదుడు మరుత్తులు పరిపాలించే లోకాలకు వెళ్ళాడు. అక్కడ వాయుదేవుడు దర్శనమిచ్చి “నాయనా! నువ్వు శారదాదేవి దగ్గర సంగీతాన్ని నేర్చుకున్నావు. ఇతర విద్యలన్నీ నేర్చుకున్నావు.

50. నీకు ‘మహతి’ అనే వీణను ఇస్తున్నాను” అని అంటూ మహతిని ఇచ్చాడు. నారదుడు తన కంఠాన్ని ఆ వీణతో లయంచేసాడు. నారదుడు – స్థాయి, సంచారి, ఆరోహణ, అవరోహణ రూపాలతో; వాది, సంవాది అనే పాదభేదములతో తన మహతిని చక్కగా సారించాడు. అంటే అది సనాతనమైన భారతదేశ సంగీతం.

51. ఆ స్థాయి, ఆంత్ర, సంచారి – ఈ ప్రకారం ఆయన వీటియందు నిర్ధిష్టమైన ఆ పాదభేదములతో సారితములైనటువంటి మధ్యమ, పంచమ, గాంధార, ఋషభ, దైవత, షడ్జ, నిషాదములనేటువంటి సప్తస్వరాలుగా ఆ నాదమును ఏడుభాగాలుగా చెయ్యగలిగాడు. సంగీతానికి ఆయన తండ్రి. నారదుడూ, తాను సృష్టించిన ఈ రాగములను ఎప్పుడయితే విభాగం చేసాడో, వాటికి సమీకరణాలు పుట్టాయి.

52. అంతకుముందు బ్రహ్మదేవుడికి, ఇతర దేవతలకు తెలిసినటువంటి నాదం ప్రణవనాదం ఒకటే! అది తప్ప వాళ్ళకు ఇంకొకటేమీ కనబడటంలేదు సృష్టిలో.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద


Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


10 Oct 2020

No comments:

Post a Comment