శ్రీ శివ మహా పురాణము - 244



🌹 .   శ్రీ శివ మహా పురాణము - 244   🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

55. అధ్యాయము - 10

🌻. బ్రహ్మకు జ్ఞనోదయమగుట - 2 🌻

నేను నీ మాయచే మోహితుడనై ఆమెను చెడుదృష్టితో చూచితిని. వెంటనే శివుడు వచ్చి నన్ను, మరియు నా కుమారులను నిందించెను. (24). హే నాథా! తాను పరమాత్మ, జ్ఞాని, యోగి, విషయలాలసత లేని జితేంద్రియుడు అని భావించే శివుడు అందరినీ ఉద్దేశించి ధిక్కారమును చేసెను (25).

హే హరీ! నాకుమారుడైన ఈ రుద్రుడు వీరందరి యెదుట నన్ను నిందించినాడని నాకు గొప్ప దుఃఖము కలిగినది. నేను నీ యెదుట సత్యమును చెప్పితిని (26). ఆయన వివాహమాడినచో నాకు దుఃఖము తొలగి సుఖము కలుగును. హే కేశవా! దీనికొరకై నేను నిన్ను శరణు జొచ్చితిని (27).

ఈ నా మాటను విని మధుసూదనుడు నవ్వి సృష్టికర్త, బ్రహ్మ అగు నాకు ఆనందమును కలిగించు వాడై, వెంటనే ఇట్లు పలికెను (28).

విష్ణువు ఇట్లు పలికెను -

హే బ్రహ్మన్‌ ! భ్రాంతులనన్నిటినీ తొలగించునది, వేద శాస్త్రములన్నింటి పరమార్థ సారము అగు నామాటను వినుము (29). హే బ్రహ్మన్‌! నీవీనాడు ఇంత పెద్ద మూర్ఖుడవు ఎట్లు కాగల్గితివి? వేద ప్రవర్తకుడవు, సర్వ జగత్తును సృష్టించినవాడవు అగు నీకు దుర్బుద్ధి ఎట్లు కలిగినది?(30).

ఓ తెలివతక్కువ వాడా! నీ జడత్వమును వీడుము. ఇట్టి ఆలోచనను చేయకుము. కొనియాడదగిన వేదములన్నియూ ఏ పరమాత్మతత్త్వమును బోధించుచున్నవో, దానిని సద్బుద్ధితో స్మరింపుము (31). ఓరీ దుష్టబుద్ధీ! పరమేశ్వరుడగు రుద్రుని నీ కుమారుడని తలపోయుచుంటివి. హేబ్రహ్మన్‌! నీవు వేద ప్రవర్తకుడవే అయిననూ, విజ్ఞానమునంతనూ మరచిపోయితివి (32).

శంకరుని దేవతలలో ఒకనిగా తలంచి నీవు ద్రోహమును చేయుచున్నావు. ఈనాడు నీకు మంచి బుద్ధి లుప్తమై, దుర్బుద్ధి పుట్టినది (33). ఈశ్వరతత్త్వమును గురించిన సిద్ధాంతమును వినుము. సద్బుద్ధిని కలిగియుండుము. వేదములలో ప్రతిపాదింపబడిన తీరులో వాస్తవమగు సృష్టికర్తను నిర్ణయించుకొనుము (34).

సర్వమును సృష్టించి, రక్షించి, హరించునది శివుడే. ఆయనయే పరాత్పరుడు, పరబ్రహ్మ, పరమేశ్వరుడు. ఆయన నిర్గుణుడు మరియు నిత్యుడు (35). వికారములు లేని శివుని ఇదమిత్థముగా నిర్దేశించలేము. ఆయన అద్వితీయ, అవినాశి, అనంత పరమాత్మ. ప్రలయకర్తయగు ప్రభువు. సర్వవ్యాపకుడగు పరమేశ్వరుడు ఆయనయే (36).

ఆప్రభువు రజస్సత్త్వ తమోగుణ ప్రధానుడై బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అను పేర్లతో సృష్టిస్థితి లయములను చేయుచుండును (37). మాయను స్వవశములో నుంచుకునే ఆ మాయావి కంటె వేరుగా మాయ లేదు. ఆయన ఆప్తకాముడు.ఆయన సగుణుడే అయినా నిర్గుణుడు. ఆయన స్వతంత్రుడు, ఆనందఘనుడు (38).

ద్వంద్వములకు అతీతుడగు శివుడు తనయందు తాను రమించే జ్ఞాని. ఆయన భక్తులకు వశుడై, దివ్యమంగళ విగ్రమహమును ధరించియుండును. ఆ మహాయోగి నిత్యము యోగనిష్ఠుడుగా నుండి, భక్తులను యోగమార్గమున చూపును (39). ఆ లోక ప్రభువు దుష్టుల గర్వమునడంచును. ఆయన సర్వకాలములలో దీనులపై దయను చూపును. ఇట్టి ఆ స్వామిని నీవు నీ కుమారుడని భావించుచున్నావు (40).

నీవు ఈ దుష్ట భావనను వీడి, ఆయనను శరణు జొచ్చుము. సర్వ విధములుగా శంభుని భజించుము. ఆయన సంతసించి నీకు సుఖమును కలిగించగలడు (41).

హే బ్రహ్మన్‌! శంకరుడు భార్యను స్వీకరించవలెననే ఆలోచన నీ హృదయములో నున్నచో, ఉమను ఉద్దేశించి శివుని స్మరించుచూ మంచి తపస్సును చేయుము (42). నీవు హృదయములో మన్మథుని ఉద్దేశించి ఉమను ధ్యానించుము. ఆ దేవదేవి ప్రసన్నురాలైనచో, నీకోర్కెలనన్నిటినీ ఈడేర్చగలదు (43).

ఆ శివాదేవి సగుణయై అవతారమునెత్తి లోకములో మనుష్య దేహముతో ఎవరో ఒకరి గృహములో జన్మించినచో, నిశ్చయముగా శివునకు పత్ని కాగలదు (44). హే బ్రహ్మన్‌! శివుని కొరకు కన్యను కనుటకై దక్షుడు భక్తితో ప్రయత్న పూర్వకముగా తపస్సును చేయవలెను. కాన ఆతనిని ఆజ్ఞాపించుము (45).

వత్సా! పరబ్రహ్మ స్వరూపులగు ఆ ఉమాపరమేశ్వరులు భక్తసులభులు. వారి స్వరూపమును భక్తిచే తేలికగా తెలియవచ్చును. వారు తమ ఇచ్ఛతే సగుణ రూపమును స్వీకరించెదరు (46).

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఇట్లు పలికి విష్ణువు వెను వెంటనే తన ప్రభువగు శివుని స్మరించెను. ఆయన కృపచే ఆయన స్వరూపము నెరింగి తరువాత నాతో నిట్లనెను (47).

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము


Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


10 Oct 2020

No comments:

Post a Comment