🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 72 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము -02 🌻
అనాహత శబ్దము నీ యందు ఓంకార శబ్దము, ప్రణవ నాదము, నీ హృదయస్థానము నుంచి ఉత్పన్నమై, నీ శరీరమంతా వ్యాపించి 72 వేల నాడులను శక్తి వంతం చేస్తున్నది. ఏ చోటైతే నాదము యొక్క ఆద్య స్థానము ఉన్నదో, నాదము యొక్క పుట్టుక స్థానము ఉన్నదో అదే హృదయాకాశము. ఇట్టి హృదయాకాశమును ఎవరైతే కనుగొన గలుగుతారో సాధన పూర్వకంగా అనగా అర్థమేమిటి?
ప్రస్తుతము మనలో ఉన్నటు వంటి శరీరము, ప్రాణము, మనస్సు, బుద్ధి బహిర్ముఖముగా చైతన్యవంతమై చేతనవంతమై పనిచేస్తున్నవి. అంతరంగంలోనేమో చైతన్యం పరమాణు స్వరూపముగా ప్రకాశిస్తూ ఈ ఇంద్రియములన్నిటినీ ఈ నాడులన్నిటినీ, ఈ అవయవములన్నిటినీ చేతనవంతముగా చేస్తుంది.
ఇవి బహిర్ముఖముగా వ్యవహరిస్తువున్నాయి. ఈ బహిర్ముఖ వ్యవహారమునంతా విరమించగా విరమించగా... ఎక్కడికి విరమించాలట? తన లోపలికే విరమించాలట. తన లోపలికి అంటే ఎక్కడికి విరమించాలట?
అవి పుట్టేటటువంటి, అవి శక్తిని గ్రహిస్తున్నటువంటి ఆధారభూత స్థానం వైపుగా గనక నీవు చూపును మరలించినట్లయితే, నీ దృష్టిని మరలించినట్లయితే, కనుగొనే ప్రయత్నం చేసినట్లయితే, ప్రాణమనోబుద్ధుల యొక్క పుట్టుక స్థానాన్ని నువ్వు తెలుసుకో గలిగినట్లయితే, అంటే అర్థం ఏమిటంటే? వీటి యొక్క కదలికలను తగ్గించుకుని రాగా, తగ్గించుకుని రాగా, తగ్గించుకుని రాగా అవి హృదయస్థానము నుండి ఉద్భవిస్తున్నట్లుగా నీవు గుర్తించగలుగుతావు.
అటువంటి గుర్తింపును సాధించడము చాలా ముఖ్యము. దీని కొరకే సమస్త సాధనలు చెప్పబడ్డాయి. ఆటువంటి ఆత్మను హృదయాకాశంలో మాత్రమే సాక్షాత్కారము చేసుకొనుటకు ఒక యజ్ఞం చేస్తున్నావట అక్కడ నువ్వు. ఆ క్రతువు, ఇది ప్రతి రోజూ చేయవలసినటువంటి క్రతువు. మానవుడు చేయవలసినటువంటి నిత్య యజ్ఞము, జ్ఞాన యజ్ఞము హృదయస్థానములో చేయాలి.
తన ఇంద్రియములను, ఇంద్రియార్థములైనటువంటి విషయములను, తన శబ్దాది విషయములను అన్నిటినీ ఈ క్రతువు నందు హవిస్సులుగా సమర్పించాలి. అనగా అర్థమేమిటి? వాటిని లేకుండా చేయాలి. విరమించాలి. అవి అందులో వ్యవహరించకుండా చేయాలి. అట్లా వెనక్కి తీసుకునేటటువంటి యజ్ఞాన్ని, విరమించేటటువంటి యజ్ఞాన్ని ఎవరైతే హృదయస్థానంలో చేసి, హృదయాకాశ స్థితిని గ్రహించగలుగుతాడో అనుభూతం అవ్వాలట.
నీవు బాహ్యముగా ఉన్నటువంటి ఏ నేనైతే ఉన్నదో, నామరూపాత్మకమైనటువంటి ఏ నేనైతే వుందో ఆ నేను హృదయాకాశ స్థానము నందు లేదు. యథార్థ నేను ఒక్కటే ఉన్నది. అసత్యనేను లేదక్కడ. ఇట్టి యజ్ఞాన్ని ఎవరైతే ఏకాగ్రతతో ధ్యానంలో చేయగలుగుతారో, ఎవరైతే అంతర్ముఖ ప్రయాణంగా చేయగలుగుతారో, ప్రవృత్తి నుండి నివృత్తి దశగా మార్చుకోగలుగుతారో, భయం దిశ నుంచీ, అభయం దిశగా మార్చుకోగలుగుతారో, బంధం నుంచీ మోక్షం దిశగా మార్చుకోగలుగుతారో, ఈ రకంగా ఒక్కొక్కదానిని విరమించుకుంటూ ఈ ఆంతరిక యజ్ఞాన్ని ఎవరైతే చేస్తారో, ఈ అంతఃక్రతువు, ఈ క్రతువు ఎటువంటిదంటే అంతః క్రతువు, ఇది చేయడం వలన ఫలితం ఏమటండీ?
బాహ్యముగా ఏ ఫలితమూ రాదు. బహిర్ వ్యవహారమునందు ఏ ఫలితములు రావు. కాకపోతే ఆత్యంతిక శ్రద్ధ ఏర్పడుతుంది. ఉత్తమమైన శ్రద్ధ ఏర్పడుతుంది. ఉత్తమమైన నైపుణ్యం ఏర్పడుతుంది. ఉత్తమమైనటువంటి గుణాతీత లక్షణం ఏర్పడుతుంది. ఉత్తమమైనటువంటి సాక్షిత్వం ఏర్పడుతుంది. ఉత్తమమైనటువంటి అసంగత్వం ఏర్పడుతుంది.
ఉత్తమమైనటువంటి నిర్విషయపద్ధతి ఏర్పడుతుంది. ఉత్తమమైనటువంటి నిష్కామకర్మ పద్ధతి ఏర్పడుతుంది. ఈ ఉత్తమమైనటువంటి లక్షణాలన్నీ ఏర్పడుతాయి ఈ ఆంతరిక యజ్ఞం చేయడం ద్వారా.
తద్వారా బహిరంగంలో కొద్దిగా నిర్వ్యాపార స్థితి ఏర్పడినట్లుగా అయినప్పటికినీ ఉత్తమమే. అంటే ఫుల్‌గా వైబ్రంట్ గా వుండడు అన్నమాట. విపరీతంగా వ్యవహార స్థితిలో మునిగి పోయిన స్థితిలో వుండడు వీడు. - విద్యా సాగర్ స్వామి
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కఠోపనిషత్ #చలాచలబోధ
Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
10 Oct 2020
No comments:
Post a Comment