భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 154



🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 154 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. నారద మహర్షి - 28 🌻


197. దురాత్ములు, పాపం చేస్తున్న వాళ్ళు కూడా కొందరు, చిరంజీవులుగా ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు పుణ్యం చాలా ఉంటుంది. అది పూర్వపుణ్యం.

198. ఇప్పుడు చేసేదే పాపం, వాడి చిట్టాలో ఉన్న అపరిమితమయిన పుణ్యం క్షయిస్తే తప్ప వాడిని ఎవరూ ఏమీ చెయ్యలేరు. ఆ పుణ్యంకూడా పోవాలంటే వాడిచేత ఏదో తక్షణమైన మహాపాపం ఒకటి చేయించాలి.

199. అట్టి పాపం చేసినపుడు పూర్వపుణ్యం వెంటనే ఖర్చయేటటువంటి పాపచిమితన వాడిలో ప్రవేశపెట్టి, వాడిచేత ఏదో పెద్దపాపం చేయించి వాడిపుణ్యం ఖర్చు పెట్టించి, వాడిని చంపించి లోకోపకారం చేస్తారు నారదమహర్షి వంటి కర్మతత్త్వవిదులు.

200. “ఈ లోకంలో మనుష్యుడు జీవితకాలంలో, ఎప్పుడైనా ఒక్కమారైనా ముక్తిని కోరకపోతే, ఆ మునుష్యుడు ప్రతీజన్మలోకూడా ముక్తికి దూరమైపోతూ ఉంటాడు. ‘నేను ఇప్పుడు బాగానే ఉన్నాను కదా!’ అని ముక్తికోరకపోతే, అది ఏ నాటికీ లభించదు.

201. ‘నేను పుణ్యాలు చేస్తూనే ఉన్నాను, యజ్ఞాలు చేస్తున్నాను. నాకు ప్రతీజన్మలోనూ ఆయుర్దాయం బాగానే ఉంది. సుఖంగానే ఉన్నాను. నాకు ముక్తెందుకు?’ అని ఎవరైనా అనుకుంటే పొరపాటే.

202. వాడు ఆ ముక్తికి మరింతగా దూరమైపోతూనే ఉంటాడు. కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు ఏ కొంచమైనా కోరిక ఉండితీరాలి. అలా ముక్తియందు కోరికలేనివాళ్ళకు, ఆ కోరికను వాళ్ళ హృదయాల్లో కలుగజేయవలసిన ధర్మం బ్రహ్మణులదే సుమా! ఎప్పుడో వినగవినగా ముక్తియందు వాళ్ళకు కాంక్ష కలుగవచ్చు.

203. అయినా ఆ వెంటనే వాళ్ళు అందుకు ఉద్యుక్తులు కాకపోవచ్చు. ఆ భావనలో ప్రవేశించకపోవచ్చు. ఎప్పుడో ఒక్కక్షణం, అపరిమితమైన దుఃఖం కలిగినప్పుడు, లేదా ఇతరుల దుఃఖాన్ని చూచినప్పుడు, ‘ఈ జన్మకు ముక్తి ముఖ్యంకదా, దానికంటే గొప్పవస్తువు లేదు’ అనే ఒకభావం నువ్వు కలిగించాలి. అది నీ ధర్మం” అని శుకుడికి బోధచేసాడు నారదమహర్షి.

204. తీసుకోవటం అనేది సంసారంలో మోక్షానికి వ్యతిరేకదిశలో వెళ్ళే మార్గం. మోక్షానికి సమీపవర్తి కాదు. ‘సర్వారంభ పరిత్యాగం’ అనేది సులభమైన మాటకాదు. భగవద్గీతలో భగవంతుడు వాడిన మాట అది.

205. సర్వారంగ పరిత్యాగం అంటే, ఏ కార్యక్రమమూ ఆరంభించని సోమరితనం అని అర్థం కాదు. ఫలమందు అనాసక్తి, తానుకర్తగా ఆరంభించనివాడని అర్థం. అట్టివాడు ఉత్కృష్టమైన జ్ఞానస్థితికి వెళతాడు. ఎందుకంటే, నేను చేస్తున్నాననే భావన పుణ్యాన్నో, పాపాన్నో ఇస్తుంది.

206. అందుకే మోక్షేఛ్ఛఉన్నవాడికి, మనస్సులో నిస్సంగుడివై ఉండమని బోధించడమే సరియైనది అని చెప్పాడు నారదుడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹



Facebook, WhatsApp & Telegram groups, WordPress:
https://incarnation14.wordpress.com/2020/10/30/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/



Blogs, Websites:
https://incarnation14.wordpress.com/2020/11/04/spiritual-blogs-websites/


06 Nov 2020

No comments:

Post a Comment