శ్రీ శివ మహా పురాణము - 266


🌹 .   శ్రీ శివ మహా పురాణము - 266  🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

62. అధ్యాయము - 17

🌻. సతీ కల్యాణము -1 🌻

నారదుడిట్లు పలికెను -

నీవు రుద్రుని వద్దకు వెళ్లిన తరువాత ఏమి వృత్తాంతము జరిగినది? తండ్రీ! హరుడు స్వయముగా ఏమి చేసినాడు?(1)

బ్రహ్మఇట్లు పలికెను -

తరువాత నేను ప్రసన్నుడనై పరమేశ్వరుడగు శివుని దోడ్కొని వచ్చుటకై, హిమవత్పర్వము నందున్న ఆ మహాదేవుని వద్దకు వెళ్లితిని (2). సృష్టి కర్తనగు నేను వచ్చుచుండుటను గాంచి ఆ వృషభధ్వజుడు తన మనస్సులో సతీ దేవిని పొందే విషయములో అనేక సంశయములకు దావిచ్చెను (3). అపుడు హరుడు ప్రాకృత జనుని వలె లోకపు తీరును పాటించే లీలను చే గొన్నవాడై సతీదేవియందలి ప్రేమతో, నన్ను ఉద్దేశించి ప్రీతిపూర్వకముగా వెంటనే ఇట్లు పలికెను (4).

ఈశ్వరుడిట్లు పలికెను -

దేవతలలో పెద్దవైన ఓ బ్రహ్మా! నా మనస్సు వియోగ దుఃఖముచే బ్రద్దలు కాకముందే చెప్పుము. నీ కుమారుడు సతీ విషయములో ఏమి చేయును?(5).

హే సురజ్యేష్ఠా! ఈ సతీవియోగము తన్మూలకమగు జ్వరము అధికముగా పెరుగుచున్నదై నన్ను చాల హింసించుచున్నది. ఇట్టి దుఃఖము ఇతర ప్రాణులను వీడి నన్ను పట్టుకున్నది (6).

హే బ్రహ్మన్‌! నేను నిరంతరము సతినే ధ్యానించుచున్నాను. నేనేమి చేయవలయునో చెప్పుము. చేసెదను. నేనామెకు దూరము గాకుండా వెంటనే ఆమెను పొందే విధానమును ఆచరింపుము (7).

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ నారదమహర్షీ! ఈ తీరున లోక ప్రవృత్తితో నిండియున్న రుద్రుని మాటను విని నేనా శివుని ఓదార్చుచూ ఇట్లు పలికితిని (8).

హే వృషభధ్వజా! సతి విషయములోనా కుమారుడు చెప్పిన మాటల నాలకింపుము. నీకు సాధ్యము కానిది లేదు. ఈ కార్యము సిద్ధించిన దని నిశ్చయించుము (9).

నా కుమార్తె శివుని కొరకై తనువును దాల్చినది. ఆమెను ఆయనకు సమర్పించవలెను. ఈ కార్యము నాకు అభిష్టము. నీ ఆదేశము చే అది మరింత అభిష్టమగు చున్నది (10).

నా కుమార్తె దీని కొరకై స్వయముగా శంభుని ఆరాధించి యున్నది.ఆ శివుడు కూడా నన్ను సతి కొరకు ప్రార్థించుచున్నాడు. కాన ఆమెను శివునికిచ్చి వివాహమును చేయవలెను (11).

హే బ్రహ్మన్‌! శంభుడు శుభలగ్నములో సుమహూర్తములో కన్యా భిక్ష కొరకు నా వద్దకు వచ్చు గాక! నేను నా కుమార్తెను ఇచ్చి వివాహమును చేయగలను(12).

హే వృషభధ్వజా!దక్షడు నాతో ఇట్లు పలికినాడు. కాన నీవు శుభముహూర్తములో ఆతని గృహమునకు వెళ్లి ఆమెను తీసుకురమ్ము(13). ఈ నా మాటను విని భక్తవత్సలుడగు రుద్రుడు లోకప్రవృత్తి నాశ్రయించి నవ్వెను. ఓ మహర్షీ! ఆయన నాతో ఇట్లనెను (14).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


Facebook, WhatsApp & Telegram groups, WordPress:
https://incarnation14.wordpress.com/2020/10/30/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/



Blogs, Websites:
https://incarnation14.wordpress.com/2020/11/04/spiritual-blogs-websites/


06 Nov 2020

No comments:

Post a Comment