గీతోపనిషత్తు - 69

🌹. గీతోపనిషత్తు - 69 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀
7. రక్షణ - అవతరించుటకు కాలధర్మము నిష్పత్తి చెందుటయే కారణము. అపుడు జరుగునవి మూడు కార్యములు. దుష్ట శిక్షణ, శిష్టరక్షణ, ధర్మ సంస్థాపనము. అవతరించనపుడు కూడ సాధు జనులకు రక్షణ యున్నది. అపుడు దైవము తాత్కాలికముగ జీవులలో ప్రవేశించి, శిష్టరక్షణ చేసి అంతర్జాన మగుచుండును. 🍀

📚. 4. జ్ఞానయోగము - 8
📚


పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్

ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే || 8


“సాధుజనులను పరిరక్షించుటకు, దుష్కృత్యములు చేయువారిని నిర్మూలించుటకు, ధర్మ సంస్థాపనము చేయుటకు ప్రతి యుగమునందు నేనవతరించు చున్నాను" అని భగవానుడు పలికెను.

సాధుజనులనగా సన్మార్గమున నడచు వినయవంతులు. వీరియందు అహింస, ఋజు ప్రవర్తనము, దొంగబుద్ధి లేకుండుట, కాని వాని కాశపడకుండుట, శుచి, శౌచము, సంతోషము, జ్ఞానాసక్తి, ఈశ్వరునికి సమర్పణ చెంది జీవించుట సహజముగ నుండును. అట్టివారు సాధువులు. వారిని భగవంతుడు పరిరక్షించును. పరి అను పదము కారణముగ సర్వకాలముల యందు అని అర్థము. ఇట్టి వారిని అధర్మము హింసించ లేదు.

దండకవనమున గల ఋషులలో అగస్త్యాది ఋషులను అధర్మము తాకలేదు. ఇతర తపస్వి జనులను, మునులను తాకినది. ఇందలి రహస్యమును తెలియవలెను. అగస్త్యాది ఋషులకు పరిరక్షణమున్నది. ఇతరులకు రక్షణము కలుగుచు, కలుగక యుండును.

కారణము వారి యందలి సత్వగుణము యొక్క స్థితి. సత్వగుణము కూడ త్రిగుణములలో నొకటియే. కావున ఆసురీ తత్వమగు రజస్తమస్సులు తాకును. ముముక్షుజనులు సత్యాతీతమగు నిత్య సత్వమందుందురు. అట్టి వారిని రజస్సు, తమస్సులు స్పృశించలేవు. భగవంతుడు పరిరక్షణ చేయును. ఇందు తెలుపబడిన పరిరక్షణ ఎల్లప్పుడు నుండును. ధర్మాధర్మముల పాళ్ళు తప్పినపుడు దానికి కారణమగు దుర్మార్గులను శిక్షించి, సత్వగుణులను కాపాడును.

అవతరించుటకు కాలధర్మము నిష్పత్తి చెందుటయే కారణము. అపుడు జరుగునవి మూడు కార్యములు. దుష్ట శిక్షణ, శిష్టరక్షణ, ధర్మ సంస్థాపనము. అవతరించనపుడు కూడ సాధు జనులకు రక్షణ యున్నది. అపుడు దైవము తాత్కాలికముగ జీవులలో ప్రవేశించి, శిష్టరక్షణ చేసి అంతర్జాన మగుచుండును.

ఉదాహరణకు సత్పురుషుడొకడు, కర్మవశాత్తు అపాయమునకు గురియై మార్గ మధ్యమున స్పృహతప్పి పడియున్నప్పుడు ఆ మార్గమున బోవు జీవులలో ధర్మము ప్రవేశించి, వానిని గొనిపోయి సురక్షితముగ ఒక వైద్యాలయములో ప్రవేశింప జేయుదురు.

అట్లే దొంగ యొకడు సత్పురుషుని ధనము దొంగిలించుకొని పారిపోవు చున్నప్పుడు పలువురి రూపమున దైవమే దొంగను పట్టి, దండించి, ధనమును సత్పురుషున కిచ్చును. సృష్టి అంతయు వాసుదేవరూపమే గనుక వాసుదేవుడెప్పుడును ఇట్లు జీవులను రక్షించుచునే యుండును. ఇట్టి రక్షణ కవతార మక్కరలేదు.

పై తెలిపిన అపాయములు దుష్టులకు జరిగినచో అట్టి సహాయము లభించదు. పై కారణముగ సత్ప్రవర్తన కలిగియున్న వారికి రక్షణ ఎప్పుడును కలుగును. అవతారము మాత్రము ధర్మగ్లాని కారణముగనే దిగివచ్చునని తెలియవలెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


Facebook, WhatsApp & Telegram groups, WordPress:
https://incarnation14.wordpress.com/2020/10/30/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


Blogs, Websites:
https://incarnation14.wordpress.com/2020/11/04/spiritual-blogs-websites/


06 Nov 2020

No comments:

Post a Comment