శ్రీ శివ మహా పురాణము - 268


🌹 . శ్రీ శివ మహా పురాణము - 268 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

62. అధ్యాయము - 17

🌻. సతీ కల్యాణము -3
🌻

అపుడు ప్రసన్నమగు చిత్తము గల దక్షుడు సర్వేశ్వరుడగు హరునకు సర్వశ్రేష్ఠమగు ఆసనమును స్వయముగా నిచ్చి విధి విధానముగా పూజించెను (28).

తరువాత ఆతడు మంచి భక్తితో సరియగు విధానములో నున్న, విష్ణువును బ్రహ్మణులను, సర్వ దేవతలను, మరియు రుద్రగణములను పూజించెను (29).,

పూజ్యులగు మహర్షులతో కూడియున్న వారికి యథా యోగ్యమగు పూజను చేసి దక్షుడు మరల నా మానసపుత్రులగు మునులతో సంప్రదించెను (30).

తరువాత నా కుమారుడగు ఆ దక్షుడు ప్రీతితో తండ్రినగు నాతో 'ప్రభో!వివాహ కర్మను నీవే జరిపింపుము' అని పలికి ప్రణమిల్లెను (31).

నేను కూడా సంతసిల్లిన అంతఃకరణము గలవాడనై, సరే అని పలికి, లేచి ఆ కార్యమునంతనూ నిర్వర్తించితిని (32). అపుడు శుభముహూర్తమునందు గ్రహబలముతో కూడిన లగ్నములో దక్షుడు ఆనందముతో తన కుమార్తె యగు సతిని శంభునకిచ్చెను (33).

అపుడా వృషభధ్వజుడు ఆనందించి యథావిధిగా వివాహ కర్మను అనుష్ఠించి సుందరియగు దాక్షాయణితో పాణి గ్రహణమును చేసెను (34).

నేను, విష్ణువు, నీవు, ఇతరమునులు, దేవతలు, శివగణములు అందరు ఈశ్వరునకు నమస్కరించి గొప్ప స్తుతులచే సంతోషపెట్టిరి (35).

గొప్ప ఉత్సవము జరిగెను. నాట్యములు గానములు నిర్వహించబడెను. ముని గణములు, దేవతలు అందరు పరమానందమును పొందిరి (36).

నా కుమారుడగు దక్షుడు ఆనాడు కన్యాదానమును చేసి కృతార్ధుడాయెను. ఉమా పరమేశ్వరులు ప్రసన్నులైరి. సర్వము మంగళ నిధానమాయెను.(37).

శ్రీశివ మహాపురాణములో రెండవది యగు సతీఖండములో కన్యాదాన వర్ణనమనే పదునెనిమిదవ అధ్యాయము ముగిసినది (18).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


09 Nov 2020


No comments:

Post a Comment