✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాసయోగము 📚
🍀. ముఖ్య సూత్రములు - 3 🍀
12. మేఘము క్రమ్మినపుడు సూర్యుడు గోచరింపడు. నిజమునకు సూర్యుని దరిదాపులయందు మేఘ ముండదు. భూమి పరిసరముల యందే మేఘ ముండును. భూమి జీవులు సూర్యుని మేఘము క్రమ్మినదని భావింతురు. అది వారి భ్రమ. సూర్యుని మేఘము క్రమ్మలేదు.
అట్లే ప్రకృతిబద్ధులైన జీవులకు అజ్ఞాన మను మేఘము క్రమ్మును. కాని ప్రతి జీవియు నిజముగ ఒక సూర్యుడే. పరబ్రహ్మము నందు నిష్ఠతో బుద్ధిని నిలిపి, అతని స్మరణమున తన్మయము చెందువారిని కల్మష పూరితమగు అజ్ఞాన మంటదు.
13. అట్టివారికి కుక్కమాంసము నందు, దానిని తిను చండాలుని యందు, ఏనుగునందు, ఆవునందు విద్యావినయ సంపద గల బ్రాహ్మణుని యందు, సృష్టియందలి సమస్త వస్తు జాల మందు బ్రాహ్మ దర్శనమే జరుగుచుండును. వారిని సమదర్శనులు అందురు.
14. బ్రహ్మమునందు స్థిరపడిన మనసు కలవారు దేహము నందున్నను వారిని జనన మరణాదులు గాని, సంసారము గాని అంటదు.
15. అట్టివాడు స్థిరబుద్ధి కలిగి యుండుటచే మోహపడడు. అతనికి ప్రియముగాని, అప్రియముగాని యుండదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
05 Jan 2021
No comments:
Post a Comment