శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 170 / Sri Lalitha Chaitanya Vijnanam - 170


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 170 / Sri Lalitha Chaitanya Vijnanam - 170 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము 

48. నిష్క్రోధా, క్రోధశమనీ, నిర్లోభా, లోభనాశినీ |
నిఃసంశయా, సంశయఘీ, నిర్భవా, భవనాశినీ ‖ 48 ‖


🌻170. 'నిర్లోభా' 🌻

'భగుణము లేనిది శ్రీదేవి అని అర్థము.

లోభము సర్వ సద్గుణములను రూపుమాపునని, లోభి ఇహ లోక సంతోషమునకే నోచుకొన లేడని, పరలోకానుభూతి అతనికి దుర్లభమని శ్రుతులు తెలుపుచున్నవి. లోభగుణము నింద్యమైనదని, అది కలవాడు వికాసము చెందలేడని తెలియనగును. దానము లోభమునకు విరుగుడు. ఇచ్చినవారికే వచ్చునని ప్రకృతి ధర్మమొకటి కలదు. పంచువారికే సమృద్ధి యుండునని, అనంతమగు సృష్టియందు సర్వ సమృద్ధియే గాని, అయిపోవుట ఉండదని తెలిసినవాడు ఇచ్చుటకు జంకడని పురాణ గాధలు తెలుపు చున్నవి.

సృష్టి అంతము లేదు. అంతమే ఆరంభము; ఆరంభమే అంతముగా అనంతముగ సృష్టి సాగుచున్నది. అందు శక్తులు, సంపదలు కూడ అనంతమే. త్రాగునీరు అయిపోకముందే మరల నీరు వచ్చును. తటాకమునుండి, నదినుండి త్రాగునీరు వచ్చు చుండగా, తటాకములకు, నదులకు వర్షము నీరిచ్చుచున్నది. వర్షములకు నీరు మేఘము లిచ్చుచున్నవి. మేఘములకు సముద్రము నీరిచ్చుచున్నది. ఇట్లు భూమి జీవులకు మూడు కోట్ల సంవత్సరములుగా నీరందుచునే ఉన్నది. అయిపోవుట, అంతమగుట సృష్టి యందు లేదు.

అట్లే ఓషధులును. ప్రతి సంవత్సరమూ జీవులకు వలసిన ఆహారము, నీరు గాలి, సూర్యరశ్మి అనంతముగ అందుచునే యున్నవి. సంపదలన్నియూ అట్టివే! కేవలము మానవ మనస్సునందే అంతము అగునని, అయిపోవునని భావన యుండి అతనిని లోభిని చేయును.

దేహము పోయిననూ మరల దేహము వచ్చును. పోవుట వచ్చుట కొఱకే. వచ్చుట పోవుట కొఱకే. అన్నియూ వచ్చిపోవు చుండగా అందు జీవుడు శాశ్వతుడై ఉండును. వచ్చినవానిని ఎంత పట్టుకొనిననూ కాలము రూపమున అవి జరుగును.

సంపదలు, భార్యాబిడ్డలు, బంధువులు, మిత్రులు పుట్టుకతో లేరు. జీవన యానమున ఒక్కొక్క మజిలీ యందు ఒక్కొక్కటి చేరుచుండును. అట్లే పోవుచునుండును కూడ. కాలమును, కర్మమును బట్టి వచ్చి చేరుట, జారిపోవుట జరుగుచు నుండును. ఇది తెలిసినవారికి లోభత్వముండదు.

హరిశ్చంద్రుడు, శిబి, ధర్మరాజు, నలుడు సర్వమును కోల్పోయి మరల సర్వమును పొందిరి. లోభికి దేనిపై పట్టు ఉండునో ఆ విషయమే అతనిని పట్టి ఉంచును. కొందరు సంపదను పట్టుకొని ఉందురు. వారు సంపదచే బద్ధులు. కొందరు కీర్తిప్రతిష్ఠలకు ప్రాకులాడుదురు. వారు అట్టివారి చేతిలో పట్టుపడినవారు. మనము పట్టినది మనలను పట్టునని తెలియుట జ్ఞానము.

అట్టిపట్టు శ్రీమాతపై ఉన్నచో, శ్రీమాయే మనలను పట్టును. సద్గుణములను, సద్గురువులను పట్టుట శ్రేయస్కరము. ఇతరములు పట్టుట వినాశకరము. శ్రీదేవి శివుని పట్టి యుండును. ఆయనయందు అర్ధబాగమై నిలచినది. అందువలన ఆమెయే నిర్లోభ.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 170 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 Nirlobhā निर्लोभा (170) 🌻

She is without greed. She is extremely liberal with Her devotees.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


05 Jan 2021

No comments:

Post a Comment