భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 200


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 200 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. దుర్వాసమహర్షి-కందళి - 4 🌻


17. ఉద్యోగం చేస్తున్నప్పుడు, మనతో పనిచేసే వ్యక్తిని – ఒక మామూలు వ్యక్తిని తక్కువగా చూడటం ధర్మమేనా? అది వీలవుతుందా? ఒకవేళ అతడు సేవక వృత్తిలో ఉంటేమాత్రం అలా చెయ్యవచ్చా? ఎవరి హద్దులు వారు మీరరాదు. ఉద్యోగ ధర్మాన్ననుసరించి ఒకడి ముందు మరొకడు చేతులు కట్టుకుని నిలబడి ఉండవచ్చు. అయితే లోపల ఉండేస్థితికి, లౌకికజీవన విధానానికి ముడిపెట్టుకోకూడదు.

18. ఏ అంతస్థులో, ఏ ఉద్యోగం, ఏ నిర్వహణలో ఏపాత్రను మనుష్యులు పోషిస్తున్నారో-ఆ పాత్ర ఔచిత్యం దాటకూడదు. అది ధర్మగ్లాని అవుతుంది. అలా చేస్తే, ధర్మందాటిన దోషంవస్తుంది. ప్రతి సంఘటనలోనూ తన యొక్క ధర్మ పాలకత్వం, ధర్మనిష్ఠ ఎంత హద్దుల్లో తనున్నాడో శ్రీకృష్ణుడు తెలియపరిచాడు.

19. తను పరమేశ్వరుడే! పాండవపక్షపాతి అని తనకు పేరు ఉంది. వీళ్ళందరూ తనకు భక్తులు. అలా అయినప్పటికీ, తన పరమేశ్వరశక్తిని వాళ్ళయందు ప్రసరింపచేసి వారిని రక్షించి కాపాడాడా! లేదు. అభిమన్యుడు పాండవులకు ఒక్కడే వంశాంకురం. 16-18 ఏళ్ళ చిన్నవాడు. అతడు చచ్చిపోతుంటే చూస్తూనే ఊరుకున్నాడు కృష్ణపరమాత్మ! అభిమన్యుడు చనిపోయడు.

20. అయినా తన దివ్యశక్తులతో కాపాడాడా! నేనున్నాను అని అర్జునుడికి చెప్పాడా? నేను కాపాడతాను అన్నాడా? అలా అనలేదు సరికదా, “నువ్వు యుద్దంచెయ్యి. రాజ్యాన్ని గెలుచుకుంటే ఏలుకుంటావు. యుద్ధంలో చచ్చిపోతే స్వర్గానికి పోతావు” అన్నాడు యుద్ధప్రారంభంలోనే. ఇది ఆయన ఇచ్చిన వాగ్దానం! అందులో ఏమయినా హామీ ఉందా! తను చెప్పాలా ఆమాట!

21. “నువ్వు ఉన్నావు కదా! నీ అండదండలు చూసుకుని యుద్దంచేస్తాను” అనడానికిలేదు. రెండుదారులు చెప్పాడే తప్ప, నేను కాపాడతానని ఆయన అనలేదు. ఎందుకంటే, అది తన ఉద్యోగం కాదు. వారి అర్హత ఎంతో తన హద్దుకూడా అంతే. తాను జ్ఞాన స్వరూపుడు. శుద్ధస్వరూపుడు. శాంతుడు. అందుచేత సృష్టిలో ఉన్న ఏ సంఘటనలో ఏదీ కూడా ఆయనలో(కృష్ణునిలో) వికారాన్ని కలిగించలేదు.

22. కృష్ణుని జీవితం అడుగడుగునా బొధయే! భారతంలో అడుగడుగునా ధర్మబోధ తప్ప మరొకటి లేదు. ధర్మబోధ తెలుసుకోవాలంటే మహాభారతం కంటే గొప్ప పాఠ్యప్రణాళిక మరొకటిలేదు. ‘పంచమవేదం’ అని దానికి పేరు. దానికి తగినపేరు పంచమవేదం. అంటే నాలుగు వేదములు, ఇంకా ఎంతో అని అర్థం చేసుకోవాలి; అంతే కాని, కొంత మిగిలితే ఆ శేషం పంచమవేదం అని కాదు అర్థం.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


05 Jan 2021

No comments:

Post a Comment