శ్రీ శివ మహా పురాణము - 334


🌹 . శ్రీ శివ మహా పురాణము - 334 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

84. అధ్యాయము - 39

🌻. విష్ణుదధీచి యుద్ధము - 2 🌻


బ్రహ్మ ఇట్లు పలికెను -

విష్ణువు తన చక్రము మొక్క బోవుటను గాంచి, ఆతని మాటలను విని కోపించి ఆతనిపై అస్త్రములనన్నింటినీ క్రమముగా (20) ప్రయోగించెను. అపుడు దేవతలు ఆదరముతో విష్ణువునకు సహాయపడిరి (21). ఒక్క బ్రాహ్మణునితో యుద్ధమునకు తలపడిన మూర్ఖులగు ఇంద్రాది దేవతలు విష్ణువు పక్షమున నిలబడి దధీచునిపై వేగముతో తత తమ శస్త్రములను, అస్త్రములను శీఘ్రమే ప్రయోగించిరి (22). అపుడు వజ్రము వంటి ఎముకలు గలవాడు, సర్వము తన వశమునందున్న వాడు అగు దధీచుడు శివుని స్మరించుచూ గుప్పెడు దర్భలను తీసుకుని (23) దేవతలందరిపై ప్రయోగించెను.

శంకరుని మహిమచే మహర్షి ప్రయోగించిన ఆ దర్భల కట్ట (24) కాలాగ్నివంటి దివ్య త్రిశూలమాయెను. ఓ మహర్షీ! మూడు అగ్రములు గల ఆ త్రిశూలము దేవతలను వారి ఆయుధములను దహించుటకు నిశ్చయించుకొనెను (25). శివుని ఆ శూలము ప్రలయకాలాగ్ని కంటె అధికమగు కాంతులను అంతటా విరజిమ్ముచూ మండెను. నారాయణుడు, ఇంద్రుడు మొదలగు దేతలను ప్రయోగించిన (26) ఆయుధములన్నియూ ఆ త్రిశూలము ముందు మోకరిల్లెనవి, నష్టమైన పరాక్రమముగల దేవతలందరు పారిపోయిరి (27). మాయావులలో శ్రేష్ఠుడవగు హరి ఒక్కడు మాత్రమే అచట నిలిచియుండెను. పురుషోత్తముడగు ఆ విష్ణుభగవానుడు తన దేహము నుండి (28) తనతో సమానమగు కోట్లాది దివ్య గణములను సృష్టించెను (29).

వీరులగు ఆ విష్ణు గణములు కూడా శివస్వరూపుడు ఏకాకియగు దధీచ మహర్షితో అచట యుద్ధమును చేసిరి. ఓ దేవర్షీ! (30) అపుడు శివభక్తశేఖరుడగు దధీచుడు ఆ విష్ణుగణములతో పరిపరి విధముల యుద్ధమును చేసి, ఆ తరువాత క్షణములో వారి నందరినీ దహించివేసెను (31). అపుడు మహామాయా పండితుడగు విష్ణువు దధీచుని ఆశ్చర్యచకితుని చేయుట కొరకై విశ్వరూపమును పొందెను (32). ద్విజశ్రేష్ఠుడగు దధీచి ఆ విష్ణువు యొక్క దేహములో అసంఖ్యాకులగు దేవతలను, ఇతర జీవులను ప్రత్యక్షముగా చూచెను (33).

ఆ విశ్వమూర్తి యొక్క దేహములో కోట్లాది భూతములు, కోట్లాది గణములు, మరియు కోట్లాది బ్రహ్మాండములు కానవచ్చెను (34). అపుడు ఆ విశ్వరూపమును చూచిన చ్యవననందనుడు, జగన్నాథుడు జగద్రక్షకుడు, పుట్టుక లేనివాడు, సర్వ వ్యాపియగు విష్ణువుతో నిట్లనెను (35).


దధీచుడిట్లు పలికెను -

హే మహాబాహో! మాధవా! మాయను వీడుము. విచారమును చేసినచో ఇది ఆ భాసయని తేలుసు. తెలియుట మిక్కిలి కష్టమైన వేలాది విషయములను నేను ఎరింగితిని (36). నీవు నాయందు శ్రద్ధగా చూడుము. నీకు దివ్య దృష్టినిచ్చుచున్నాను. నీవు, బ్రహ్మ, రుద్రులతో సహా జగత్తంతయు నీకు కనబడును (37).


బ్రహ్మ ఇట్లు పలికెను -

ఇట్లు పలికి చ్యవన పుత్రుడగు ఆ ముని శంభుని తేజస్సుచే పూర్ణ విరాడ్దేహమును స్వీకరించినవాడై తన దేహమునందు నిఖిల బ్రహ్మాండములను ప్రదర్శించెను (38). శివభక్తాగ్రగణ్యుడు, భయము లేనివాడు, విద్వాంసుడు అగు దధీచి మనస్సులో శంకరుని స్మరిస్తూ చిరునవ్వుతో దేవేశుడు విష్ణువునుద్దేశించి ఇట్లు పలికెను (39).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


26 Jan 2021

No comments:

Post a Comment