బహిరంగ ప్రపంచంలోనే జీవితం : మీ అహమే మీ చెరసాల



🌹. బహిరంగ ప్రపంచంలోనే జీవితం : మీ అహమే మీ చెరసాల 🌹

🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀


‘‘నేను మీ చుట్టూ ఒక గోడలా ఉంటూ మిమ్మల్ని రక్షిస్తున్నాను. నేను లేకపోతే అతి బలహీనమైన మీకు ఎలాంటి రక్షణ ఉండదు. అప్పుడు మీరు చాలా ప్రమాదంలో పడతారు. నన్ను మీ చుట్టూ ఉండనిస్తూ, మిమ్మల్ని కాపాడనివ్వండి’’ అంటూ మీలోని అహం మీకు పదే పదే నచ్చచెప్తూనే ఉంటుంది. అహం మైకంలో పడడమంటే అదే.

అవును, మీ చుట్టూ ఒక గోడలా ఉండే అహం ఎవరినీ మీ దగ్గరకు రానివ్వదు. అలా అది మీకు ఒక రకమైన రక్షణగా ఉంటుంది. లేకపోతే, అది పెట్టే బాధలను ఎవరూ భరించలేరు. కానీ, ఆ క్రమంలో మీ మిత్రులు కూడా మీకు దూరమవుతారు. అలా ఆ గోడ మీకు చెరసాలగా కూడా మారుతుంది. అంటే, మీరు మీ శత్రువుకు భయపడి తలుపుమూసి దాని వెనకాల దాక్కున్నట్లన్నమాట. అప్పుడు మీ మిత్రుడు వచ్చినా తలుపుమూసి ఉంటుంది కాబట్టి లోపలకు రాలేడు.

కాబట్టి, మీరు మీ శత్రువుకు మరీ ఎక్కువగా భయపడితే, అప్పుడు మీ మిత్రుడు కూడా మీ లోపలికి రాలేడు. ఒకవేళ మీరు మీ మిత్రుని కోసం తలుపుతెరిస్తే, అప్పుడు మీ శత్రువుకూడా లోపలకు ప్రవేశించే ప్రమాదముంటుంది.

కాబట్టి, ఎవరైనా దీని గురించి చాలా లోతుగా ఆలోచించాలి. ఎందుకంటే, జీవితంలోని అతి పెద్ద సమస్యలలో ఇది ఒకటి. కేవలం ధైర్యమున్న కొందరు వ్యక్తులు మాత్రమే దానిని తమ దారికి తెచ్చుకుంటారు. ఇతరులు పిరికివారుగా తయారై తలుపు వెనకాల దాక్కుంటారు. అలా వారు తమ జీవితాన్ని కోల్పోతారు.

జీవితానికి ప్రమాదముంటుంది కానీ, మరణానికి ఎలాంటి ప్రమాదం ఉండదు. మరణిస్తే మీకు ఎలాంటి ప్రమాదము ఉండదు. ఎందుకంటే, మిమ్మల్ని ఎవరూ చంపలేరు. ఏమీచెయ్యలేరు. హాయిగా సమాధిలోకి వెళ్ళడంతో అంతా ముగిసిపోతుంది. ఆందోళనలు, రోగాలు-ఇలా ఎలాంటి సమస్యలు అక్కడ మీకు ఉండవు.

కానీ, మీరు సజీవంగా ఉంటే అన్నీ సమస్యలే. మీరు ఎంత ఎక్కువ సజీవంగా ఉంటే మీ సమస్యలు అంత ఎక్కువగా ఉంటాయి. అందులో తప్పేమీ లేదు. ఎందుకంటే, సమస్యలతో, సవాళ్ళతో పోరాడితేనే మీరు ఎదుగుతారు. మీ చుట్టూ అతి చిన్న గోడలా ఉండే మీ అహం ఎవరినీ మీ లోపలికి రానివ్వదు.

అందువల్ల మీరు పూర్తి రక్షణలో చాలా భద్రంగా ఉన్నట్లు- విత్తనంలో చెట్టు చాలా భద్రంగా ఉన్నట్లు భావిస్తారు. కానీ, అది కూడా మరణం లాంటిదే. అందుకే అతి సున్నితమైన ఆ చెట్టు మొలకెత్తేందుకు చాలా భయపడుతుంది. ఎందుకంటే, ప్రపంచం చాలా ప్రమాదకరమైనది.

తరువాత ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? అందుకే విత్తనంలో దాగిఉన్న చెట్టు చాలా భద్రంగా ఉన్నట్లు భావిస్తుంది. అలాగే తల్లి గర్భంలో ఉన్న శిశువుకు కావలసినవన్నీ తల్లి సమకూరుస్తూ ఉంటుంది. చివరికి అవసరమైతే శిశువు కోసం తల్లి గాలి పీలుస్తుంది. ఆహారం తీసుకుంటుంది. అందువల్ల శిశువు ఎలాంటి సమస్య లేకుండా, భవిష్యత్తు గురించి ఎలాంటి ఆందోళన లేకుండా హాయిగా, ఆనందంగా తల్లి గర్భంలో చాలా సౌకర్యంగా జీవిస్తుంది.

- ఇంకాఉంది.

🌹 🌹 🌹 🌹 🌹


27 Jan 2021

No comments:

Post a Comment