✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాస యోగము 📚
శ్లోకము 23
🍀. 21. స్మరణ - కామ క్రోధముల వేగమును ఏ మానవుడైతే ఈ శరీరము విడచుటకు పూర్వమే జయించ సమర్థుడగు చున్నాడో, అట్టి మానవుడు యోగియై సుఖవంతుడగు చున్నాడు. కామక్రోధము లన్నవి ప్రపంచమున జీవించు మానవునకు సన్నివేశమునుబట్టి, పరిస్థితులను బట్టి ఉద్భవించుచునే యుండును. ఇవి చిత్తవృత్తులు. వీనిని అరికట్టుటయే యోగము. అరికట్టుట యనగ బలవంతముగ తొక్కి పెట్టుట కాదు. తొక్కి పెట్టినచో, అవి సమయమునకై వేచియుండి విజృంభించగలవు. చిత్తవృత్తి నిరోధమునకు యోగవిద్యయే పరిష్కారము. యోగమనగా ఆసనములు, ప్రాణాయామములే కాదు. దైవమునందు ప్రీతియే నిజమగు యోగము. అట్టి ప్రీతి మధురాతి మధురముగ నుండుటచేత యితర విషయములందు ప్రీతి శిథిల మగుచు నుండును. భగవంతునితో యుక్తుడైయుండుట ప్రధానము. అనగ భగవతత్త్వముతో ముడిపడి యుండుట. అట్లు ముడిపడుటకు చేయు ప్రయత్నమే స్మరణ, భావన. 🍀
శక్నోతీహైవ యః సోఢుం ప్రాక్శరీర విమోక్షణాత్ ।
కామక్రోధోద్భవం వేగం స యుక్తః స సుఖీ నరః ।। 23 ।।
కామ క్రోధముల వేగమును ఏ మానవుడైతే ఈ శరీరము విడచుటకు పూర్వమే జయించ సమర్థుడగు చున్నాడో, అట్టి మానవుడు యోగియై సుఖవంతుడగు చున్నాడు. కామక్రోధము లన్నవి ప్రపంచమున జీవించు మానవునకు సన్నివేశమునుబట్టి, పరిస్థితులను బట్టి ఉద్భవించుచునే యుండును. ఇవి చిత్తవృత్తులు. వీనిని అరికట్టుటయే యోగము.
అరికట్టుట యనగ బలవంతముగ తొక్కి పెట్టుట కాదు. తొక్కి పెట్టినచో, అవి సమయమునకై వేచియుండి విజృంభించగలవు. చిత్తవృత్తి నిరోధమునకు యోగవిద్యయే పరిష్కారము. యోగమనగా ఆసనములు, ప్రాణాయామములే కాదు. దైవమునందు ప్రీతియే నిజమగు యోగము. అట్టి ప్రీతి మధురాతి మధురముగ నుండుటచేత యితర విషయములందు ప్రీతి శిథిల మగుచు నుండును.
శ్లోకము చదివినపుడు “కామ క్రోధముల వేగమును జయించి, యోగమున సుఖపడుము” అన్నట్లు గోచరించును. ఇది సాధ్యపడునది కాదు. యోగమున స్థిరపడి, కామక్రోధములను జయించమనుట యిందలి రహస్యము. చీకటని పారద్రోలి, వెలుగు నేర్పరచుకొనుము అని తెలిపినచో అది సాధ్యపడునది కాదు. వెలుగు నేర్పరచి నంతనే చీకటి అదృశ్యమగును.
'యుక్తః' అను పదము యిందు చాల ముఖ్యము. భగవంతునితో యుక్తుడైయుండుట ప్రధానము. అనగ భగవతత్త్వముతో ముడిపడి యుండుట. అట్లు ముడిపడుటకు చేయు ప్రయత్నమే స్మరణ, భావన.
భగవంతుని యందు ప్రీతి యున్నచో, స్మరణ భావన నిరంతర మగుచుండును. అట్టి స్మరణ దీపపు వెలుగువంటిది. స్మరణ యను వెలుగు ఉన్నంత సమయము కామక్రోధములను చీకటి క్రమ్మదు.
అట్టి నరునకు సుఖ ముండును. అంతియేగాని కామమును జయింతును, క్రోధమును జయింతును అని అహంకరించువారు శ్రమ చెందుచు దుఃఖ పడుదురు.
ఇచ్చట సమర్థత భగవంతునితో యుక్తము చెందుటయేగాని, కామక్రోధములను జయించుట కాదు. కామక్రోధములు కూడ పై విధముగ శరీరమందుండగనే జయించనిచో మరుజన్మమున గూడ దుఃఖముండును.
అందువలన భగవంతుడు ఈ శరీరమందున్నప్పుడే నాతో యోగము చెంది, కామక్రోధములను హరించి, శాశ్వతముగ సుఖపడుము" అని తెలుపుచున్నాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
01 Feb 2021
No comments:
Post a Comment