శ్రీ శివ మహా పురాణము - 339
🌹 . శ్రీ శివ మహా పురాణము - 339 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
85. అధ్యాయము - 40
🌻. శివదర్శనము -3 🌻
ముముక్షువులకు శరణమైనది, మహాయోగాత్మకము అగు ఆ వటవృక్షముపై కూర్చుండియున్న శివుని విష్ణువు మొదలగు దేవతలందరు గాంచిరి (37). మహాసిద్ధులు, సర్వదా శివభక్తియందు రమించువారు, సుందరమగు దేహములు గలవారు, శాంతమూర్తులు అగు బ్రహ్మపుత్రులు ఆనందముతో శివుని ఉపాసించుచుండిరి (38).
యక్ష రాక్షసులకు ప్రభువు, మిత్రుడునగు కుబేరుడు, ఆతని జ్ఞాతులు , శివుని గణములు ఆ శివుని ప్రత్యేకముగా సర్వదా సేవించుచుండిరి (39). సర్వప్రాణులకు వాత్సల్యమును చూపే మిత్రుడు అగు పరమేశ్వరుడు భస్మము మొదలగు వాటితో ప్రకాశించువాడై తపశ్శాలురకు అభీష్టమగు దివ్యరూపమును ధరించుయుండెను (40).
ఓ మహర్షీ! ఆయన దర్భాసనమునందు గూర్చుండి మహర్షులందరు వినుచుండగా నీవు అడిగిన ప్రశ్నలకు సమాధానముగా ఉత్తమ జ్ఞానమును బోధించుచుండెను (41). ఆయన కుడి తొడపై ఎడమ కాలిని, జానువును ఉంచి, బాహువుల నుండి ముంజేతుల నుండి వ్రేలాడుచున్న రుద్రాక్ష మాలలు గలవాడై జ్ఞానముద్రతో కూర్చుండెను (42).
అపుడు ఇట్టి శివుని చూచి విష్ణువు మొదలగు దేవతలందరు వినయముతో చేతులు కట్టుకొని శీఘ్రముగా నమస్కరించిరి (43). సత్పురుషులకు గతియగు రుద్రప్రభుడు అచటకు వచ్చిన నన్ను విష్ణువును చూచి లేచి శిరస్సుతో అభివాదమును కూడ చేసెను (44).
విష్ణువు మొదలగు దేవతలందరిచే నమస్కరింపబడిన పాదములు గల శివుడు, లోకములకు సద్గతినిచ్చు విష్ణువు కశ్యప ప్రజాపతికి నమస్కరించిన తీరున, మాకు నమస్కరించెను (45). దేవతలు, సిద్ధులు, గణాధీశులు మరియు మహర్షులచే సాదరముగా నమస్కరింపబడిన శివుని ఉద్దేశించి విష్ణువు దేవతలతో గూడి ఇట్లు పలికెను (46).
శ్రీ శివ మహాపురాణములో రెండవదియగు రుద్ర సంహితయందు సతీఖండములో శివదర్శన వర్ణనమనే నలుబడి యవ అధ్యాయము ముగిసినది (40).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
01 Feb 2021
Labels:
శివ మహా పురాణము
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment